థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడని సినీప్రేక్షకులు ఉండరు. అలాంటివారి కోసం ఏ యేటికాయేడు కొత్త సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అందులో చాలా చిత్రాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా కొన్ని మాత్రమే బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబడతాయి. మరికొన్ని మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా అవార్డులు అందుకుంటాయి. అలాంటి చిత్రమే లూ. 2022లో వచ్చిన ఈ సినిమా గతేడాది రీఫ్రేమ్ స్టాంప్ అవార్డు అందుకుంది. మరి లూ మూవీ ఎలా ఉందో చూసేద్దాం..
లూ అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా నివసిస్తుంది. ఓ రోజు తన బ్యాంక్‌లో నుంచి పెద్ద మొత్తంలో డబ్బు విత్ డ్రా చేసుకుని ఇంటికి వస్తుంది. అలాగే పెంపుడు కుక్కకు కొన్ని వారాలపాటు అవసరమయ్యే మాంసాన్ని ఫ్రిజ్‌లో భద్రపరుస్తుంది. తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను, పేపర్లను మంటల్లో తగలబెట్టి కుర్చీలో కూలబడుతుంది. పెద్ద తుపాకీ అందుకుని చనిపోవడానికి సిద్ధమవుతుంది.
సరిగ్గా ట్రిగర్ నొక్కే సమయంలో హన్నా అనే మహిళ తన ఇంట్లోకి పరుగు పరుగున వస్తుంది. తన కూతురు వీ తప్పిపోయిందని చెప్తుంది. ఆ చిన్నారిని క్షేమంగా తీసుకొస్తానని మాటిచ్చిన లూ ఆత్మహత్య ఆలోచన విరమించుకుంటుంది. మరి లూ మాట మీద నిలబడిందా? చిన్నారిని కిడ్నాప్ చేసిందెవరు? తనను కాపాడిందా? లేదా? అసలు ఆమె ప్రాణాలు తీసుకోవడానికి ఎందుకు సిద్ధపడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
లూ మహిళ విచిత్రంగా ప్రవర్తించినప్పుడే తన వెనుక ఏదో ఫ్లాష్‌బ్యాక్ ఉందని అర్థమైపోతుంది. భీకరమైన వర్షం రాబోతోంది.. అప్రమత్తంగా ఉండండి అన్న ప్రకటనతో ఏదో ఘోరం జరగబోతుందని ముందుగానే హింటిచ్చాడు డైరెక్టర్ అన్నా ఫోరెస్టర్. పొరుగింట్లో ఉండే చిన్నారి వీని కనీసం ఒక్కసారైనా పలకరించని లూ.. ఆమె కోసం ప్రాణాలకు తెగించి పోరాడటం, ప్రయత్నించడం చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.
లూగా అలిసన్ జానీ నటన అద్భుతంగా ఉంది. హన్నాగా జుర్నీ స్మోలెట్, వీగా రైడ్లీ ఆషా నటన పర్వాలేదు. ప్రీక్లైమాక్స్ బాగుంది. కథను మలుపు తిప్పే ట్విస్టు బాగుంటుంది. కానీ కొన్ని సన్నివేశాలను జీర్ణించుకోవడం కష్టంగా అనిపిస్తుంది. డైరెక్టర్ కథకు ఇంకాస్త మెరుగులు దిద్ది ఉంటే లూ అద్భుతాలు సృష్టించేదనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారైతే పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూసేయొచ్చు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment