ఆశ.. చిన్నదో, పెద్దదో ప్రతి మనిషికీ ఉంటుంది. కష్టాల్లో ఉన్నవాడికి ఏదో ఒకరోజు అవి గట్టెక్కపోవన్న ఆశ.. సంతోషాల్లో ఉన్నవానికి ఎప్పటికైనా ఈ సంతోషం తనతోనే ఉండిపోవాలన్న ఆశ! ఈ ఆశే మనిషిని బతికిస్తుంది. చుట్టూ గాఢాంధాకారలు కమ్ముకున్నా వెలుగు వైపు నడిపిస్తుంది. అలాంటి సినిమానే ద శశాంక్ రెడింప్షన్.
ఈ సినిమా ఇప్పటిది కాదు. 1994లో వచ్చింది. స్టీఫెన్ కింగ్ రాసిన రిటా హేవర్త్ అండ్ షాషాంక్ రిడంప్షన్ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. చేయని తప్పుకు నిందిస్తేనే కయ్యిమని లేస్తాం. అలాంటిది చేయని నేరానికి రెండు జీవితకాలాల జైలుశిక్ష విధిస్తే..? ఈ సీన్‌తోనే కథ మొదలవుతుంది.
బ్యాంకర్ ఆండీ (టిమ్ రాబిన్స్).. భార్య తనను వదిలేసి ప్రియుడే కావాలనుకోవడాన్ని తట్టుకోలేకపోతాడు. ఆమెను చంపడానికి పూటుగా తాగి గన్ లోడ్ చేసుకుని వెళ్తాడు. కానీ మనసొప్పక తిరిగొచ్చేస్తాడు. అయితే అక్కడ నిజంగానే హత్య జరుగుతుంది. హీరో భార్య, ప్రియుడు ఇద్దరూ చనిపోతాడు. అక్కడ దొరికిన ఆనవాళ్ల ఆధారంగా ఆండీని జైల్లో వేస్తారు.
చంపాలనుకున్నమాట వాస్తవమే కానీ చంపలేదని చెప్తే ఎవరూ నమ్మరు. తాను నిర్దోషినని చెప్తే ఎగతాళి చేస్తారు. తన మాట ఎవరూ లెక్కచేయరని తెలసుకున్న అతడు నాలుగుగోడల మధ్య ఇమిడేందుకు అలవాటుపడతాడు. ఒంటరిని అన్న భావం దగ్గరకు రాకూడదని ఫ్రెండ్స్‌ను ఏర్పరుచుకుంటాడు. అయితే ఎప్పటికైనా బయటకు వెళ్లి ప్రశాంతమైన జీవితం గడపాలన్నది తన కోరిక.
అది చూసి ఇతరులు నవ్వుకున్నా తను మాత్రం ఆశ చంపుకోలేదు. ఆ ఆశే అతడిని జైలు నుంచి పారిపోయేలా చేస్తుంది. అతడి స్నేహితుడు ఆత్మహత్య వైపు అడుగులు వేయకుండా స్వేచ్ఛా జీవితం కోసం తపించేలా చేస్తుంది. ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్ ఉన్న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. జైల్లో ఉన్నవారిదే కాక అక్కడి నుంచి బయటకు వచ్చినవారి మానసిక స్థితి ఎలా ఉంటుందన్నది చక్కగా చూపించారు.
ఏళ్లు గడుస్తున్నా వారి జీవనవిధానంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ సినిమా హత్య, హింస, తిరుగుబాటును చూపించలేదు.. కేవలం విముక్తి, ఆశ చుట్టూ మాత్రమే తిరిగింది. అలాగే నిజమైన స్నేహం ఎలా ఉంటుందనేది ఆకట్టుకునేలా ఆవిష్కరించారు. రెండు జీవితకాలాల జైలుశిక్ష పడ్డా కుంగిపోకుండా స్వేచ్ఛ కోసం హీరో పడే తపన చూస్తుంటే ముచ్చటేయక మానదు. సినిమా ముగిసినప్పుడు మనకూ జీవితం మీద కొత్త ఆశలు చిగురించిన భావన కలుగుతుంది. డైరెక్టర్ ఫ్రాంక్ డారాబాంట్ ఈ చిత్రాన్ని అద్భుత కళాఖండంగా మలిచాడు. ఈ మూవీని అందరికీ ఒక ఫిలాసఫీగా అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment