ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘క్యారీ ఆన్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
థ్రిల్లర్ జోనర్ అనేది సినిమా మొత్తం క్యారీ చేయడం దర్శకుడికి కత్తి మీద సాము లాంటిది. సినిమా ఓ లైన్‌లో వెళుతున్నపుడు దాని జోనర్‌ని కమర్షియల్ యాంగిల్‌లో కూడా బ్యాలెన్స్ చేస్తూ క్యారీ చేయడం చాలా కష్టం. ఒకవేళ అలా పట్టు సడలకుండా క్యారీ చేస్తే మాత్రం ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టే. ‘క్యారీ ఆన్’ ఆ కోవకు చెందిన సినిమానే. ఇదో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్. ఈ మధ్య కాలంలో థ్రిల్లింగ్ జోనర్‌లో వచ్చిన అరుదైన సినిమా అని చెప్పాచ్చు.
ఈ సినిమాకి జేమ్ కలెక్ట్ సేరా దర్శకుడు. ప్రముఖ హాలీవుడ్ నటులు టారన్, సోఫియా లీడ్ రోల్స్‌లో నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... భార్యాభర్తలైన ఈథన్ కోపెక్, నోరా పార్సీ అమెరికాలోని ఎయిర్‌పోర్టులలో లగేజ్ సెక్యురిటీ తనిఖీ సంస్థ అయిన టీఎస్‌ఎలో పని చేస్తూ ఉంటారు. అది క్రిస్మస్ కాలం. ఎయిర్‌పోర్టు పండగ వాతావరణంలో ప్రయాణీకులతో రద్దీగా ఉంటుంది. కొపెక్ తన ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తుంటాడు. అందుకని ఆ రోజు వేరే వాళ్లు ఉండాల్సిన స్థానంలో తన పోస్ట్ వేయించుకుంటాడు. అది లగేజ్ స్క్రీన్ స్పెషలిస్ట్ డ్యూటీ. తాను రొటీన్‌గా ప్రయాణీకుల లగేజ్ స్క్రీన్ చేస్తుండగా అనూహ్యంగా ఓ బ్లూటూత్ దొరుకుతుంది. ఆ బ్లూటూత్ కొపెక్ ధరించడంతో అసలు కథ మొదలవుతుంది.
ఓ అనామకుడు కొపెక్‌ను బ్లూటూత్ ద్వారా తాను చెప్పింది చెయ్యకుంటే అదే ఎయిర్‌పోర్టులో పని చేస్తున్న అతని భార్య నోరాని చంపుతానని బెదిరిస్తాడు. ఆ ఆగంతకుడు ఓ బాంబుని ఫ్లైట్‌లోకి తరలించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ బాంబు బ్యాగేజీని లగేజ్ స్క్రీన్ దగ్గర అడ్డుకోకూడదని అజ్ఞాత వ్యక్తి హెచ్చరిస్తూ బ్లూటూత్ ద్వారా కొపెక్‌కు సూచనలిస్తుంటాడు. అసలే పండగ కాలం... ఎయిర్‌పోర్టు నిండా జనం. ఒకవేళ ఏదైనా జరగ రానిది జరిగితే పెద్ద సంఖ్యలో అపార ప్రాణ నష్టం. అందుకే కొపెక్ ఓ పక్క ఆ లగేజ్‌ని ఆపాలని మరో పక్క తన భార్యను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం సినిమాకే హైలైట్.
ముందుగా తనకు కనపడకుండా తనను లక్ష్యంగా చేసుకుని ఇంతటి దారుణానికి ఒడిగడుతున్న అతడ్ని వెతకడానికి ప్రయత్నిస్తుంటాడు. కొపెక్ ఆ ఆగంతకుడితో పాటు బాంబుని కనుక్కున్నాడా? అలాగే తన భార్యని కాపాడుకున్నాడా... ఈ ప్రశ్నలకు సమాధానం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘క్యారీ ఆన్’ సినిమాని చూడడం. ఈ సినిమా స్క్రీన్‌ప్లే ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. సినిమాలో పాత్రలు పరిచయం అయ్యే దాకా రొటీన్ సినిమా అనిపించినప్పటికీ బ్లూటూత్ దొరికినప్పటి నుండి కథ వేగంగా పరిగెడుతూ ప్రేక్షకుడిని కదలకుండా చేస్తుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యమవుతోంది. ఈ ‘క్యారీ ఆన్’ వర్త్ టు వాచ్. సో యూ ఆల్సో క్యారీ ఆన్ ఫర్ క్యారీ ఆన్. – ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment