సాక్షి, హైదరాబాద్: అక్రమ దత్తత ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటి కరాటే కల్యాణి బుధవారం యూసుఫ్‌గూడ మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రాంగణంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కార్యాలయంలో చంటిబిడ్డతో సహా అధికారుల ఎదుట హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు సీడబ్ల్యూసీ అధికారులు ఆమెను ప్రశ్నించి సమాచారం రాబట్టారు.
అనంతరం కరాటే కల్యాణి విలేకరులతో మాట్లాడుతూ రాజకీయంగా, ఎదుగుతున్న తనను కావాలని కొందరు అసత్య ఆరోపణలతో బయటకు లాగారన్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. నిరాధార ఆరోపణలు చేసి తనను అవమానించిన వారిని వదిలేది లేదని, న్యాయపరంగా వారిపై పోరాడతానన్నారు. అధికారులు తన వాదనను నమ్మారని, తాను తప్పు చేయలేదని చెప్పడానికి అది చాలన్నారు. రెండు రోజులుగా ఫోన్ స్విచ్చాఫ్ అయిందని, తాను ఎక్కడికీ పారిపోలేదన్నారు. ఇంతవరకు తాను చంటిబిడ్డను దత్తత తీసుకోలేదని, భవిష్యత్‌లో తీసుకుంటానా లేదా అనే విషయాలు త్వరలో
వెల్లడిస్తానన్నారు.
చదవండి: ఓటీటీలో సామ్, నయన్‌ల మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే?
నిబంధనలు పాటించాల్సిందే..
పిల్లలను దత్తత తీసుకోవాలంటే ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సీడబ్ల్యూసీ అధికారులు కరాటే కల్యాణికి స్పష్టం చేశారు. ఆమె వద్ద ఉన్న పాపను చిన్నారి తల్లి స్వప్నకు అప్పగించారు. పాప తల్లిదండ్రులు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారైనందున భవిష్యత్‌లో దత్తత తీసుకోవాలంటే రంగారెడ్డి వెల్ఫేర్ అధికారులను సంప్రదించాలని స్పష్టం చేసినట్టు సమా చారం. ప్రస్తుతం కల్యాణి వద్ద ఉంటున్న 11 ఏళ్ల బాలుడికి సంబంధించిన తల్లిదండ్రుల వివరాలు కూడా సీడబ్ల్యూసీకి అందజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. విచారణలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ శైలజతో పాటు సభ్యులు లలిత, ప్రమోద తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment