నవంబరు 20 నుంచి 28 వరకూ ఇఫీ ఉత్సవాలు
ప్రారంభ చిత్రంగా ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ ప్రదర్శన
ఒక భారీ చిత్రం... ఒక చిన్న చిత్రం... తెలుగు పరిశ్రమ నుంచి ఈ రెండు చిత్రాలు గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో ప్రదర్శితం కానున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వనీదత్ నిర్మించిన భారీ చిత్రం ‘కల్కి’, నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శిల కాంబినేషన్‌లో నందకిశోర్ ఈమాని దర్శకత్వంలో రానా నిర్మించిన చిన్న చిత్రం ‘35: చిన్న కథ కాదు’ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికయ్యాయి.
దేశ వ్యాప్తంగా పోటీలో నిలిచిన 384 ఫీచర్స్ ఫిల్మ్స్‌లో మెయిన్ స్ట్రీమ్ విభాగంలో 5 చిత్రాలను, ఇండియన్ పనోరమా విభాగంలో 20 చిత్రాలను... మొత్తంగా 25 చిత్రాలను ఎంపిక చేశారు. ఇక నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో పోటీలో నిలిచిన 262 చిత్రాల్లో 20 చిత్రాలను ఎంపిక చేశారు. ప్రధాన స్రవంతి విభాగంలో ప్రదర్శితం కానున్న 5 చిత్రాల్లో ‘కల్కి’, ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శితం కానున్న 20 చిత్రాల్లో ‘35: చిన్న కథ కాదు’ ప్రదర్శితం కానున్నాయి.
మలయాళ చిత్రం ‘మంజుమ్మెల్ బాయ్స్’ కూడా మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ప్రదర్శితం కానుంది. ఇక కురుక్షేత్ర యుద్ధంతో మొదలై, అక్కణ్ణుంచి 6 వేల సంవత్సరాల తర్వాతి కథతో దాదాపు రూ. 600 కోట్లతో రూపొందిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి’ హాలీవుడ్ సినిమాని తలపించి, భారీ వసూళ్లను రాబట్టి, ఘనవిజయం సాధించింది. ఇక కుమారుడు పాస్ మార్కులు తెచ్చుకోవాలని ఓ తల్లి పడే తపనతో రూపొందిన ‘35: చిన్న కథ కాదు’ ఎమోషనల్‌గా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది.
ప్రారంభ చిత్రంగా ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’
ఇండియన్ పనోరమా విభాగంలోప్రారంభ చిత్రంగా హిందీ ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ని ప్రదర్శించనున్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాలు పంచుకున్న యోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ బయోపిక్‌లో టైటిల్ రోల్‌ను రణ్‌దీప్ హుడా పోషించారు. అది మాత్రమే కాదు.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు ఒక రచయితగా, ఓ నిర్మాతగానూ వ్యవహరించారు రణ్‌దీప్.
ముందు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలోనే ఈ చిత్రం ఆరంభమైంది. అయితే క్రియేటివ్ పరంగా ఏర్పడ్డ మనస్పర్థల వల్ల ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత రణ్‌దీప్ దర్శకత్వ బాధ్యతను నిర్వర్తించారు. ఈ చిత్రంలో చరిత్రను ఏకపక్షంగా చూపించారంటూ కొన్ని విమర్శలు ఎదురైనప్పటికీ నటీనటుల నటనకు ప్రశంసలు లభించాయి. రణ్‌దీప్ టైటిల్ రోల్‌లో అంకితా లోఖండే, అమిత్ సాయి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
దక్షిణాది ప్రముఖులకు జ్యూరీలో చోటు లేదు
‘ఇఫీ’ ఉత్సవాల్లో మొత్తం 25 ఫీచర్ íఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ íఫిల్మ్స్ ప్రదర్శిస్తారు. దేశంలోని వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖులు జ్యూరీలో ఉంటారు. ఫీచర్ ఫిల్మ్స్ ఎంపిక కోసం 12 మంది సభ్యులతో కూడిన జ్యూరీ, నాన్ ఫీచర్ ఫిల్మ్స్ కోసం ఆరుగురు సభ్యు లతో కూడిన జ్యూరీ సినిమాలను ఎంపిక చేసింది. అయితే దక్షిణాదికి చెందిన ప్రముఖులు ఎవరూ జ్యూరీలో లేకపోవడం గమనార్హం. ఇక గోవా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహించనున్న ఈ 55వ ‘ఇఫీ’ వేడుకలు నవంబరు 20న ఆరంభమై 28న ముగుస్తాయి.
నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైన చిత్రాల్లో బెంగాలీ చిత్రం ‘మొనిహార’ ఒకటి. కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్న సుభాదీప్ బిస్వాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అదే ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన కరీంనగర్‌కు చెందిన వారాల అన్వేష్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన మొనిహార కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇక గతంలో వారాల అన్వేష సినిమాటోగ్రాఫర్‌గా రూపొందిన ‘అపార్, ‘నవాబీ శౌక్’ చిత్రాలు ఇండో బంగ్లాదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో సహా పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమయ్యాయి. ఇంకా తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన పట్నాల పై అన్వేష్ తీసిన డాక్యుమెంటరీ బతుకమ్మ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది.
Comments
Please login to add a commentAdd a comment