మాలీవుడ్‌ సినీ చరిత్ర: దళిత నటి ఇంటినే తగులబెట్టేశారు! | Interesting Facts About Actress PK Rosy | Sakshi
Sakshi News home page

అప్పుడు క్యాస్ట్‌.. ఇప్పుడు కాంప్రమైజ్‌: దళిత నటి ఇంటినే తగులబెట్టేశారు!

Published Sun, Sep 8 2024 10:48 AM | Last Updated on Sun, Sep 8 2024 1:25 PM

Interesting Facts About Actress PK Rosy

మలయాళంలో హేమ కమిటి రిపోర్ట్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. కొన్ని రోజులుగా కేరళ సినిమా రంగంలో మహిళలపై దురాగతాలు బయటికి వస్తుండటంతో మాలీవుడ్‌ వణుకుతోంది. అయితే మహిళలపై దురాగతాలు, వేధింపులు ఇప్పుడే కాదు.. మాలీవుడ్‌ పరిశ్రమ ఏర్పడినప్పటి నుంచే ఉన్నాయి. అప్పట్లోనే స్త్రీలపై దాడులు జరిగాయి. చాలా మంది కుల వివక్షకు గురయ్యారు. మలయాళ తొలి హీరోయిన్‌కి అయితే కేరళను వదిలి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలేంటో చూద్దాం. 

మలయాళ ఇండస్ట్రీ 1920లో ఏర్పడింది. తొలి సినిమా విగతకుమారన్. ఈ చిత్రంలో పికె రోసీ హీరోయిన్‌గా నటించింది. మలయాళ తొలి హీరోయిన్‌, భారతీయ సినిమాల్లోనే మొదటి దళిత నటి రోసీ.

ఓ దళిత కుటుంబంలో పుట్టడమే రోసీకి శాపంగా మారింది. ఆమె విగతకుమారన్‌ చిత్రంలో నాయర్‌(పెద్ద కులం) మహిళగా నటించడాన్ని ఓ వర్గం ప్రజలు సహించలేకపోయారు. సినిమా విడుదలను అడ్డుకున్నారు. థియేటర్‌పై రాళ్ల దాడి చేశారు. అంతేకాదు ఆమె ఇంటిని కూడా తగులబెట్టేశారు. అగ్ర వర్ణాలా వేధింపులు తట్టుకోలేక..ప్రాణ భయంలో రోసీ మలయాళ ఇండస్ట్రీని వదిలి వెళ్లింది.

సమాజంలోని అనేక వర్గాలలో, ముఖ్యంగా మహిళలకు సాంస్కృతిక కళలలో పెద్దగా ప్రవేశంలేని రోజుల్లోనే రోజీ సినిమాల్లోకి వచ్చి పెద్ద సాహసమే చేసింది. అంతేకాదు తొలి సినిమాలోనే అగ్రవర్ణ మహిళగా నటించి కుల వివక్షకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేసింది. రోసీ చేసిన ప్రయత్నం చాలా మందికి స్ఫూర్తిగా నిలిచింది. అయితే ఆ సినిమాలో నటించిన కారణంగా రోజీ జీవితాంతం అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది.

మలయాళంలో ఇప్పటికీ కుల వివక్ష ఉందని చాలా మంది నటీనటులు చెబుతున్న మాట. కులం చూసి అవకాశం ఇచ్చే దర్శక నిర్మాతలు ఉన్నారట. తమ కులం వాడు అయితే ఒక పాత్ర.. తక్కువ కులం వాడు అయితే మరో పాత్రలు ఇస్తూ వివక్ష చూపించడం ఇంకా కొనసాగుతుంది.

ఇక మహిళలపై జరుగుతున్న దురాగతాలు అంతా ఇంతా కాదు. అయితే నటీమణులెవరు తమకు వస్తున్న వేధింపులపై అంత త్వరగా స్పందించరు. ‘మీటూ’లో భాగంగా ఆ మధ్య కొందరు తమకు వచ్చిన లైంగిక వేధింపులపై పెదవి విప్పారు. ఇప్పుడు  ‘హేమా కమిటీ’ వల్ల చాలా మంది తారలు ధైర్యంగా తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు.

2017లో మలయాళ నటి భావనా మీనన్‌పై లైంగిక దాడి జరిగింది. ఆ దాడి వెనుక సూత్రధారి మలయాళ హీరో దిలీప్‌ అని ప్రచారం జరిగింది. దీంతో అప్పటి ప్రభుత్వం  జడ్జి హేమ ఆధ్వర్యంలో కమిషన్‌ ఏర్పాటు చేయించింది. ఆ కమిటీ రిపోర్ట్‌ ఆలస్యంగా 2024 ఆగస్టులో బయటకు వచ్చింది. అయితే అప్పట్లో మహిళలు కుల వివక్షకు గురైతే..ఇప్పుడు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. సినిమా చాన్స్‌లు రావాలంటే కాంప్రమైజ్, అడ్జస్ట్‌ కావాల్సిందే. హేమ కమిటీ రిపోర్ట్‌తోనైనా మాలీవుడ్‌ మారిపోయి మంచి పరిశ్రమగా ఎదగాలని కోరుకుందాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement