Intinti Gruhalakshmi: కొడుకు కోసం కలవనున్న తులసి, నందు! | Intinti Gruhalakshmi June 14: Tulasi, Nandu Reunite For Abhi | Sakshi
Sakshi News home page

Intinti Gruhalakshmi: అంకిత మోసం, భ్రమలో అభి!

Published Mon, Jun 14 2021 2:12 PM | Last Updated on Mon, Jun 14 2021 2:26 PM

Intinti Gruhalakshmi June 14: Tulasi, Nandu Reunite For Abhi - Sakshi

ఇంటింటి గృహలక్ష్మి జూన్‌ 14వ ఎపిసోడ్‌: తన భార్య అంకిత గర్భవతన్న విషయం తెలిసి అభి ఎగిరి గంతేశాడు. కంటికి రెప్పలా చూసుకుంటానంటూ అంకితను ఎత్తుకుని తిరిగాడు. తండ్రవుతున్నాడన్న సంతోషంలో మునిగి తేలుతున్న అభి ఈ వార్తను అమ్మకు చెప్పాలంటూ వెంటనే తులసికి ఫోన్‌ చేశాడు. అంకిత గర్భవతి అని, నువ్వూ, నాన్న జంటగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండని కోరాడు. దీంతో నందుతో కలిసి రావాలా? వద్దా? అని తులసి ఆలోచనలో పడింది. ఈ కుటుంబమే వద్దనుకుని వెళ్లిన అతడిని ఎలా ఒప్పించాలో అర్థం కాక తల పట్టుకుంది. అయినా కొడుకు సంతోషం కోసం నందు దగ్గర కాళ్లబేరానికి పోవాలా? అని తనను తానే మథనపడింది.

ఇది చూసిన తులసి మామయ్య వెంటనే తన కొడుక్కి ఫోన్‌ చేశాడు. అభి తండ్రి కాబోతున్నాడన్న విషయాన్ని నందుకు చెప్పాడు. నువ్వు, తులసి కలిసి అక్కడికి రావాలని అభి ఆశపడుతున్నాడని పేర్కొన్నాడు. తనకు మనుమడు రాబోతున్నాడని సంతోషించిన నందు తులసితో కలిసి కొడుకు ఇంటికి వెళ్లాలా? అని ఓ క్షణం తటపటాయించాడు. కానీ కొడుకు కోసం భార్యతో కలిసి వెళ్లేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. మరి దీనికి లాస్య ఒప్పుకుంటుందా? లేదా? అనేది పక్కన పడితే మొదలు తులసే అంగీకరించడానికి నిరాకరిస్తున్నట్లు కనిపిస్తోంది. నందుతో కలిసి వెళ్లడం నాకిష్టమేనా? అని ఎందుకు అడగలేదని తన మామయ్యను నిలదీసింది. 

ఇదిలా వుంటే అంకిత తనకు అబార్షన్‌ జరిగిన విషయాన్ని అభికి చెప్పలేక, మనసులో దాచుకోలేక నరకం అనుభవిస్తోంది. కడుపులో బిడ్డను తానే చంపేసుకున్నానని కుమిలిపోయింది. ఈ విషయం తెలియని అభి.. అంకిత కడుపులో బిడ్డ పెరుగుతోందనుకుని తన గదినంతా చిన్నపిల్లల పోస్టర్లతో నింపేశాడు. పుట్టే బిడ్డ కోసం ఇప్పటి నుంచే తన కళ్లు ఎదురు చూస్తున్నాయని ఆనంద భాష్పాలు రాల్చాడు.

కడుపులో మోసే అమ్మ కన్నా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసే నాన్నకే ఆ ఫీలింగ్‌ ఎక్కువ ఉంటుందని చెప్పుకొచ్చాడు. పుట్టే బిడ్డ కోసం తాపత్రయపడుతున్న అభి సంతోషాన్ని తనే నాశనం చేశానని అంకిత కుమిలిపోయింది. మరి రేపటి ఎపిసోడ్‌లో అభి కోరిక మేరకు నందు, లాస్య జంటగా అతడి ఇంటికి వెళ్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

చదవండి: కూతురు ఫోటో షేర్‌ చేసి మురిసిపోతున్న హీరోయిన్‌ అసిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement