Intinti Gruhalakshmi June 30వ ఎపిసోడ్: సరస్వతి అనుమానించినట్లే జరిగింది. తను తీసుకొచ్చిన బట్టలను తిరస్కరిస్తారేమోన్న అనుమానమే నిజమైంది. ఆమె తెచ్చిన బట్టల కంటే లాస్య తెచ్చినవే బాగున్నాయని అనసూయ పెదవి విరిచింది. దీంతో లాస్య డిజైన్ చేయించుకు వచ్చిన ఖరీదైన చీర మాత్రమే కట్టుకుంటానని మొండిగా మాట్లాడింది. ఆమె ప్రవర్తనకు తులసి మనసు చిన్నబుచ్చుకున్నా బయటకు మాత్రం.. తన కోరిక ప్రకారమే జరగనీయండని తెలిపింది. లాస్య బట్టలే వేసుకోమంటూ తన మామయ్యకు కూడా సర్ది చెప్పింది.
ఫంక్షన్‌లో అనసూయ దంపతులు నూతన వధూవరులుగా రెడీ అయి మరోసారి పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఇద్దరూ కొత్త పెళ్లి జంటలాగా తెగ సిగ్గుపడిపోయారు. పెళ్లి చూపుల్లో ఏం జరిగిందన్న దగ్గర నుంచి ఇప్పటివరకు ఇద్దరూ ఎలా కలిసి జీవితాన్ని కొనసాగిస్తున్నామని చెప్తూ వారి మధుర క్షణాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. అనంతరం ఈ వేడుకలో అందరూ స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. అనసూయ దంపతులు కూడా పాటలకు కాళ్లు కదుపుతూ డ్యాన్స్ చేశారు. అనంతరం ఇంట్లోని ప్రతి ఒక్కరూ అనసూయ దంపతుల్లో ఎవరెక్కువ ఇష్టమో చెప్తూ అందుకు గల కారణాలను వివరించారు.
నందు వంతు వచ్చేసరికి తనకిద్దరూ ఇష్టమేనన్నాడు. అమ్మ ప్రేమ, నాన్న కోపం రెండూ తన ఎదుగుదలకే పనికొచ్చాయన్నాడు. తర్వాత తులసి మాట్లాడుతూ.. అత్తలో అమ్మను, మామలో నాన్నను చూసుకున్నానని చెప్పుకొచ్చింది. తన బాధలను, కష్టాలను కూడా పక్కనపెట్టి కేవలం సంతోషాలను మాత్రమే ప్రస్తావించింది. దీంతో మాధవి స్పందిస్తూ.. నీకు జరిగే చేదును కూడా మంచి అనుకోవడం నీ గొప్పతనమని తులసిని ప్రశంసించింది.
అప్పటిదాకా సంతోషంగా సాగుతున్న ఆ పార్టీలో లాస్య చిచ్చు పెట్టినట్లు కనిపిస్తోంది. మరోసారి తులసి తల్లిని ఆవిడ దారుణంగా అవమానించినట్లు తెలుస్తోంది. దీంతో ఓపిక నశించిన తులసి ఉగ్రరూపం ఎత్తింది. నోటికొచ్చినట్లు వాగుతున్న లాస్య చెంప చెళ్లుమనిపించింది. తన తల్లి మీద నోరు జారిన లాస్యను వెనకేసుకొచ్చిన నందు మీద కూడా ఫైర్ అయినట్లు కనిపిస్తోంది. మరి ఈ గొడవ తీవ్రతరం కానుందా? దీని పరిణామాలు ఏవైపుకు దారి తీస్తాయి? అనేది రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment