Intinti Gruhalakshmi July 7th Episode: తులసి, నందు విడిపోవాల్సిందేనా అని కుటుంబ సభ్యులంతా బాధపడుతుంటే అనసూయ మాత్రం దెప్పి పొడిచింది. ఎప్పుడెప్పుడు విడాకులు మంజూరవుతాయా? అని తహతహలాడిపోయింది. తులసి పీడ విరగడవుతుందని లోలోపలే ఆనందించింది. ఎప్పటిలాగే తులసి మీద విరుచుకుపడుతూ ఆమెను సూటిపోటి మాటలతో బాధ పెట్టింది.
మనసుకు శూలాల్లా గుచ్చుతున్నా పైకి అవేవీ కనిపించకుండా జాగ్రత్తపడింది తులసి. ఆమెను నానామాటలు అన్న అనసూయ మీదకు విరుచుకుపడింది ఆమె కూతురు మాధవి. నీలాంటి ఆడదాన్ని ఈ ప్రపంచంలోనే ఎక్కడా చూడలేదని చెప్పుకొచ్చింది. సాటి ఆడది అనే జాలి లేకుండా వదిన జీవితం నాశనమైపోవాలని కోరుకుంటున్న నీకు పుట్టినందుకు నాకే సిగ్గుగా ఉందని చీదరించుకుంది.
తులసికి విడాకులిస్తే నందు తన సొంతమైపోయినట్లేనని లాస్య తెగ ఆనందపడింది. మరికొద్ది క్షణాల్లో అతడు పూర్తిగా తనవాడు కాబోతున్నాడని సంబరపడిపోయింది. అయితే అప్పటిలోపు నందు మనసు మార్చుకోకుండా చూడమని భాగ్య హెచ్చరించడంతో లాస్య కన్నీటి డ్రామా మొదలు పెట్టింది. విడాకుల విషయంలో ఇప్పటికీ అనుమానంగానే ఉందని చెప్పడంతో అలాంటిదేమీ లేదని నందు బదులిచ్చాడు. అంతేకాకుండా లాస్యకు ప్రామిస్ కూడా చేశాడు.
కోర్టుకు తులసి తల్లి కూడా వచ్చింది. ఎప్పటికైనా మీరిద్దరూ మళ్లీ కలుస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. అనుకున్న ప్రతీది జరగాలనుకోవడం అత్యాశేనని చెప్పుకొచ్చింది. రేపటి ఎపిసోడ్‌లో కోర్టు మెట్లెక్కిన నందు, తులసి ఇద్దరూ విడిపోవడానికి తప్పు నీదంటే నీదని నిందించుకున్నట్లు తెలుస్తోంది.. జడ్జి ముందే వాదులాటకు దిగడం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే విడాకులు ఖాయంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment