![Intinti Gruhalakshmi June 29: Tulasi Furious On Nandu - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/29/gruhalakshmi.jpg.webp?itok=TNHQWQ8R)
Intinti Gruhalakshmi June 29వ ఎపిసోడ్: నందు జరిపిస్తున్న తల్లిదండ్రుల పెళ్లిరోజు వేడుకకు ఆహ్వానం అందడంతో తులసి తల్లి సరస్వతి కూడా రిసార్ట్‌కు చేరుకుంది. ఆమెను చూడగానే లాస్య, భాగ్య తమ నోటికి పని చెప్తూ పెద్దావిడను అనరాని మాటలు అన్నారు. పిలవని పేరంటానికి రావడానికి సిగ్గుండాలని చీదరించుకున్నారు. నానామాటలని ఆమె మనసుకు తూట్లు పొడిచారు. సరిగ్గా అప్పుడే సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తులసి తన తల్లి మీద జరుగుతున్న మాటల దాడికి అడ్డుపడుతూ లాస్య మీద విరుచుకుపడింది. మొగుడిని వదిలేసి అనాథలా తయారయ్యావు, కన్నకొడును వదిలేసి వాడిని అనాథను చేశావు, నీకేం తెలుసు కన్నతల్లి విలువ అంటూ లాస్యను తిట్టిపోసింది. మీరసలు మనుషులే కాదంటూ అసహ్యించుకుంది.
మరోవైపు తులసి తల్లి ఫంక్షన్‌కు రావడంతో నందు చాలా సంతోషించాడు. ఆమెకు ఒక రూమ్ చూపించమని లాస్యకు చెప్పాడు. అయితే ఇక్కడ కూడా లాస్య తన కుటిల బుద్ధిని ప్రదర్శించింది. గదులు ఖాళీగా లేవని బయటే సర్దుకోమని చెప్పింది. దీంతో నందు ఎక్కడో ఎందుకు, మన గదిలో ఉంటుందిలే అని చెప్పడంతో ఖంగు తిన్న లాస్య కుదరదని తేల్చి చెప్పింది. గదిలో విలువైన వస్తువులున్నాయంటూ వారిని పరోక్షంగా దొంగలతో సమానంగా పోల్చింది.
దీంతో చిర్రెత్తిపోయిన తులసి ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించానంది. అందుకే తన కొడుక్కి చెప్పి అమ్మ కోసం ప్రత్యేక గది రెడీ చేయించానంటూ లాస్యకు కౌంటరిచ్చింది. అయినా ఈ ఫంక్షన్‌కు తులసి తల్లి రావడమేంటని అంకిత అభిని ప్రశ్నించింది. అసలు అదేం ప్రశ్న అన్న అభి తను మా అమ్మమ్మ అని, ఇంట్లో వేడకకు ఆమె రాకపోవడమేంటి? ఇంత స్టుపిడ్‌గా మాట్లాడతావేంటి? అని అంకితకు అక్షింతలు వేశాడు. దీంతో అంకిత హర్ట్ అయినట్లు కనిపించడంతో ఆమె ఈ ఇంటి మనిషని, ఈ వేడుకలో ఆమె ఉండాల్సిందేనని సర్ది చెప్తాడు.
ఇక ఫంక్షన్‌లో వేదిక మీద కూర్చునే అనసూయ దంపతుల కోసం తులసి తల్లి పట్టుబట్టలు తీసుకొచ్చింది. అయితే తన చేతుల మీదుగా ఇస్తే వారు తీసుకుంటారా? అని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. అన్నట్లుగానే అనసూయ ఈ బట్టలు మేం కట్టుకోవాలా? అని ఎదురు ప్రశ్నించింది. అయితే ఆమె భర్త అనసూయకు ఎలాగోలా నచ్చజెప్పే చాన్స్ ఉంది. కానీ అడుగడుగునా సరస్వతిని అవమానించాలని కంకణం కట్టుకున్న లాస్య మాత్రం తనకొచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. మొగుడు పోయినదానివంటూ సరస్వతిని అనరాని మాటలు అంది.
తన కళ్లముందే తల్లిని దారుణంగా నిందిస్తూ చులకనగా చూస్తుండటం సహించలేకపోయిన తులసి.. లాస్యను లాగి కొట్టింది. అయితే నందు మాత్రం అంత జరిగినా లాస్యను వెనకేసుకురావడం గమనార్హం. అతడి ప్రవర్తనకు మరింత బాధపడ్డ తులసి మానసికంగా నందుకు ఈ క్షణమే విడాకులిచ్చేస్తున్నాని చెప్పింది. మరి తర్వాత పరిణామాలు ఎలా మారబోతున్నాయనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే!
చదవండి: ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?
Comments
Please login to add a commentAdd a comment