ఇంటింటి గృహలక్ష్మి జూన్ 25వ ఎపిసోడ్: నందు చేతుల మీదుగా తమ 50వ పెళ్లిరోజు ఫంక్షన్ జరిపించాలని అనసూయ మంకుపట్టు పట్టింది. దీనికి ఒప్పుకునేవరకు తాను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకునేది లేదని తేల్చి చెప్పింది. తులసి ప్రేమగా తీసుకొచ్చిన ఇడ్లీ ప్లేటును కూడా నేలకు విసిరి కొట్టింది. నీ మాయమాటలకు లొంగనంటూ తన పంతం నెగ్గించుకోవాలని చూసింది.
మరోవైపు తులసి ఆంటీ వల్లే ఇంట్లో ఈ గొడవలన్నీ అని అంకిత అభితో వాపోయింది. ఆంటీ పంతం నెగ్గించుకోవడానికి, తనను అందరూ మెచ్చుకోవడం కోసం అమ్మమ్మను ఇంత బాధపెడుతోందని అభిప్రాయపడింది. దీంతొ అభి తల్లిని వెనకేసుకురాగా అంకిత మాత్రం ఇదంతా తులసి ఆంటీ వల్లే జరుగుతోందని విమర్శించింది. మరోవైపు శృతి, ప్రేమ్ కూడా ఆ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటూ నానమ్మ బ్లాక్‌మెయిల్ చేస్తుందని ఆగ్రహించారు.
కానీ అనసూయ భోజనం మానేసి ఎక్కడ ఆరోగ్యం మీదకు తెచ్చుకుంటుందోనని తులసి భయపడిపోయింది. కానీ తనకంత సీను లేదని, కడుపు మాడ్చుకుంటానని బెదిరిస్తుందే తప్ప అంతకు మించి ఏమీ చేయలేదని మామయ్య నచ్చజెప్పాడు. వీళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారో లేదో అనసూయ కళ్లు తిరిగి పడిపోయింది.
దీంతో వెంటనే డాక్టర్‌ను ఇంటికి పిలిపించారు. కానీ మొండిదల ఎక్కువ ఉండే అనసూయ వైద్యం చేయించుకోవడానికి కూడా నిరాకరించింది. అయితే ఆమె అన్నపానీయాలు మానేస్తే ఆరోగ్యానికే ప్రమాదం అని వైద్యురాలు హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయినా సరే 50వ పెళ్లిరోజు ఫంక్షన్ తన కొడుకు చేతుల మీదుగా జరగాల్సిందేనని, అది వాడి నోటి వెంట వింటేనే తను ఈ నిరాహార దీక్ష వదిలేస్తానంది.
దీంతో అత్త క్షేమం కోసం తులసి లాస్య గడప తొక్కక తప్పలేదు. ఇదే అదును అనుకున్న లాస్య తులసి మీద మాటల యుద్ధం ప్రకటించబోయింది. అవమానంతో తలదించుకునేలా చేయాలనుకుంది. బయటకు గెంటేస్తానంటూ బెదిరించింది. కానీ అంతలోనే నందు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తులసిని చూసి భగ్గుమని లేచాడు. మరి నందు.. తులసి చెప్పేది వింటాడా? తన తల్లి కోసం ఆమె వెంట ఇంటికి వెళ్తాడా? లేదా? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment