
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్న చందంగా మారిది లాస్య పరిస్థితి. తను ఏ లక్ష్యంతో నందు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిందో అది నెరవేరేలా కనిపించడం లేదు. పైగా నందు సోదరి మాధవి సడన్‌గా ఇంట్లోకి వచ్చేయడంతో ఆమె ప్లాన్ మొత్తం రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. తన భర్త వదిలేయాలనుకుంటున్నాడంటూ మాధవి ఆత్మహత్యకు ప్రయత్నించడం వెనక ఏదో కుట్ర ఉంటుందని భావిస్తోంది లాస్య. మరి నేటి(మే 17) ఇంటింటి గృహలక్ష్మి ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి..
మొన్నటివరకు దివ్యను ఎలా చదివించాలన్న టెన్షన్‌తో మథనపడిపోయిన నందుకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చిపడింది. తన సోదరి మాధవి జీవితం అర్థం కాని ప్రశ్నలా మారిపోతుందేమోనని కలవరపడుతున్నాడు. ఎలాగైనా ఆమె జీవితం చక్కదిద్దాలని ప్రయత్నించాడు. మాధవి భర్త మోహన్ తీసుకున్న నిర్ణయాన్ని వేలెత్తి చూపాడు. తనను విడిచిపెడితే అస్సలు బాగోదని వార్నింగ్ ఇచ్చాడు.
కానీ మరో ఆడదాని కోసం కట్టుకున్న భార్యను వదిలేసుకునేందుకు సిద్ధపడ్డ నందు తనకు నీతులు చెప్పే అర్హత లేదని మోహన్ విమర్శించాడు. మోహన్ మాత్రం విడాకులకే మొగ్గు చూపడం గమనార్హం. పైగా విడాకుల ఆలోచన మనసులోకి రావడానికి మాత్రం నందునే కారణమని చెప్పాడు. పక్కవారికి నీతులు చెప్పేముందు తన తప్పొప్పుల గురించి ఆలోచించుకోమని హితవు పలికాడు. అతడి ధోరణితో ఖంగు తిన్న నందు మారు మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
ఈ విషయం తెలిసిన లాస్య.. మాధవి ఇలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం వెనక ఏదో కుట్ర ఉంటుందని భావించింది. ఎందుకైనా మంచిది, ఆమెను ఓ కంట కనిపెడుతూ ఉండమని భాగ్యకు మరీ మరీ చెప్పింది. అక్కడ మాధవి కూడా తన భర్త ఎవరిని చూసి ప్రేరణ పొందుతున్నారో అని పరోక్షంగా నందును విమర్శించింది. ఎవరిని చూసి ఇలా భార్యను వదిలేస్తానంటున్నాడో అని అతడికి చురకలంటించింది. దీన్నిబట్టి మాధవి దంపతులు నందులో మార్పు తీసుకురావడానికి విడాకుల నాటకం ఆడుతున్నారా? లేదా నిజంగానే విడిపోవాలని నిర్ణయించుకున్నారా? అనేది తేలాలంటే రేపటి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే!
చదవండి: Intinti Gruhalakshmi: తులసి సాయం, లాస్య మొసలి కన్నీళ్లు