
కాటుక కళ్లతో, ముసిముసి నవ్వులు నవ్వుతున్న ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఈమె ఒక క్లాసికల్ డ్యాన్సర్.. టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. గ్లామర్, యాక్టింగ్.. రెండింటిలోనూ బెస్ట్ అనిపించుకుంది. ఈపాటికే ఆమె ఎవరో తెలిసిపోయుంటుంది. అవును, ఆమె అచ్చతెలుగందం, అందాల తార జయప్రదనే!
15 ఏళ్లకే హీరోయిన్
రాజమండ్రికి చెందిన జయప్రద అసలు పేరు లలిత రాణి. 'భూమి కోసం' (1974) చిత్రంలో మొదటిసారి తెర మీద రెండు మూడు నిమిషాల సేపు కనిపించింది. ఈ చిత్రంలోని ఓ పాట మధ్యలో ఒక వితంతువు తనను చెరబట్టే కామందును హతమారుస్తుంది. ఆ వితంతువు చంద్రమ్మ మరెవరో కాదు జయప్రదనే. ఈ సినిమా చేసే సమయానికి ఆమె వయసు 13 కాగా తను అందుకున్న పారితోషికం రూ.10. ఈ చిత్రంతోనే ఆమె తన పేరు మార్చుకుని జయప్రదగా మారింది. తన పెదవిపై ఉండే పుట్టుమచ్చ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. దీని తర్వాత ఆమె చేసిన పెద్ద చిత్రం అంతులేని కథ. అప్పుడామె వయసు 15 ఏళ్లు. షూటింగ్‌లో రజనీకాంత్, జయప్రదల మధ్య సన్నివేశంలో జయప్రద నటనకు కె.బాలచందర్ సంతోషంతో క్లాప్స్ కొట్టారట!
300కు పైగా సినిమాలు..
జయప్రద 'అడవి రాముడు' సినిమాతో కమర్షియల్ హీరోయిన్‌గా మారింది. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి.. హరి.. అంటూ ఆమె తన అందాలు చూపిస్తూ కళ్లతోనే కొంటెగా మాట్లాడింది. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు అందుకున్న ఆమెకు బాలీవుడ్‌లోనూ అవకాశాలు తలుపు తట్టాయి. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, రాకేశ్ రోషన్, జితేంద్ర వంటి బడా స్టార్స్‌తో నటించింది జయప్రద. హిందీలో జితేంద్ర- జయప్రదలది ఎక్కువ హిట్ కాంబినేషన్‌గా చెప్పుకుంటారు. 'సిరిసిరిమువ్వ', 'భద్రకాళి', 'అడవిరాముడు', 'యమగోల', 'అందమైన అనుభవం', 'సాగర సంగమం', 'దేవత', 'మేఘసందేశం'.. ఇవి కాక.. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో మొత్తం మూడు వందలకు పైగా సినిమాలు చేసింది. ఆమె నటనా కౌశల్యానికి గానూ ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమెకు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. హీరోలతో సమాన పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది.
ముగ్గురు పిల్లల తండ్రితో పెళ్లి
కెరీర్‌లో ఆకాశమంత విజయాలను చూసిన ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాల మేళవింపుగా మిగిలిపోయింది. జయప్రద అప్పటికే పెళ్లై, ముగ్గురు పిల్లల తండ్రైన నిర్మాత శ్రీకాంత్ నహతాను ప్రేమించింది. అతడు మొదటి భార్యకు విడాకులివ్వకుండానే జయప్రదను పెళ్లాడాడు. అప్పట్లో ఈ విషయం పతాక శీర్షికల్లో నిలిచింది. వీరికి పిల్లలు లేరు. పెళ్లి తర్వాత కూడా జయప్రద సినిమాలు చేసింది. కానీ నెమ్మదిగా దర్శకనిర్మాతలు తనను పక్కన పెడుతూ రావడంతో సినిమాల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది. ఆమె చివరగా 2019లో సువర్ణ సుందరి సినిమా చేసింది. చాలాకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైంది.
చదవండి: నా భర్తను ద్వేషిస్తున్నా.. ఎందుకంటే 5 నిమిషాలు కూడా మాట మీద నిలబడడు
Comments
Please login to add a commentAdd a comment