టైటిల్: జితేందర్ రెడ్డి
నటీనటులు:రాకేశ్ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలు
నిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డి
దర్శకుడు: విరించి వర్మ
సంగీతం: గోపి సుందర్
ఎడిటర్: రామకృష్ణ అర్రం
విడుదల తేది: నవంబర్ 8, 2024
కథేంటంటే..
తెలంగాణలోని జగిత్యాలకు చెందిన దివంగత ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్ ఇది. 1980లో జగిత్యాల పట్టణంలో నక్సలైట్లకు, ఆరెస్సెస్, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన పోరాటంలో జితేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. వామపక్ష ఉద్యమాలు బలంగా ఉన్న సమయంలో వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అయితే జితెందర్(రాకేశ్ వర్రె) బాల్యం ఎలా గడిచింది? నక్సల్స్‌ని ఎందుకు ఎదురించాడు? కాలేజీ రోజుల్లో ఏబీవీపీ నాయకుడిగా రాకేశ్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు? ఆయనపై ఆరెస్సెస్ నేత గోపన్న(సుబ్బరాజు) ప్రభావం ఎంతవరకు ఉంది? అతన్ని చంపడానికి నక్సల్స్ వేసిన ప్లాన్ ఏంటి? జితేందర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జగిత్యాలలో ఎలాంటి మార్పులు జరిగాయి? కాలేజీ స్నేహితురాలు, లాయర్ శారద(రియా సుమన్) అతనికి ఎలా తోడుగా నిలిచింది? చివరకు నక్సల్స్ చేతుల్లో ఎలా మరణించాడు? అనేదే ఈ సినిమా కథ.
ఎలా ఉందంటే..
జితేందర్ రెడ్డి గురించి జగిత్యాలతో పాటు కరీంనగర్ చుట్టుపక్క ప్రాంతాల వారికి బాగా తెలుసు. నక్సల్‌పై ఆయన చేసిన పోరాటం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. అయితే కరీంనగర్ జిల్లా మినహా ఆయన గురించి, ఆయన కుటుంబ నేపథ్యం గురించి పూర్తిగా తెలిసినవారు అంతగా లేరు. జితేందర్ రెడ్డి ఏబీవీపీ నాయకుడని, నక్సల్స్‌కు వ్యతిరేకంగా పోరాడి వారి చేతుల్లోనే మరణించారనే విషయం మాత్రమే తెలుసు. ఈ చిత్రంలో జితేందర్ రెడ్డి గురించి బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు చెప్పారు. అయితే వీటిల్లో నిజం ఎంత అనేది పక్కకు పెడితే..సినిమా పరంగా చూస్తే దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ని తెరపై చక్కగా, అందరికి అర్థమయ్యేలా చూపించాడు.
జితేందర్ రెడ్డి బాల్యం మొదలు కొని చనిపోయే వరకు ఆయన జీవితంలో చోటు చేసుకున్న కీలక ఘటలన్నింటిని రెండున్నర గంటల సినిమాలో చూపించేశాడు. జితేందర్‌కి చిన్నప్పటి నుంచే దేశ భక్తి ఎక్కువని రిజిస్టర్ చేయడానికి ప్రారంభంలోనే పలు సీన్లను యాడ్ చేశాడు. సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగానే వాడుకున్నాడు. యువకుడి ఎన్‌కౌంటర్ సీన్ తర్వాత కథపై ఆసక్తి పెంచుతుంది.ఫస్టాఫ్‌లో జితేందర్ రెడ్డి బాల్యంతో పాటు ఆయన స్టూడెంట్ లీడర్‌గా ఎదిగిన తీరును చూపిస్తూనే నక్సల్స్‌కి ఎలా టార్గెట్ అయ్యారనేది చూపించారు.
అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్లలో నాటకీయత ఎక్కువైనట్లు కనిపిస్తుంది. కొన్ని చోట్ల సాగదీతగానూ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. చాలా చోట్ల గూస్‌బంప్స్ సీన్లు ఉంటాయి. అప్పటి ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి నక్సల్స్‌పై చేసే ఫిర్యాదు సీన్, ఎన్నికల ప్రచారం, క్లైమాక్స్ సన్నీవేశాలు అదిరిపోతాయి. అయితే ఈ కథ మాత్రం ఓ వర్గం వారికి ఎంత బాగా నచ్చుతుందో అంతే స్థాయిలో మరో వర్గం నుంచి వ్యతిరేకత రావొచ్చేమో. సినిమాలో కీలకమైన పాత్రల్లో కూడా అంతగా గుర్తింపులేని నటీనటులను పెట్టుకోవడం కూడా కొంతవరకు మైనస్ అయిందనే చెప్పాలి.
ఎవరెలా చేశారంటే..
జితేందర్ రెడ్డి పాత్రకు రాకేశ్ వర్రే న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. తెరపై నిజంగానే జితెందర్ రెడ్డిని చూసినట్లుగా అనిపిస్తుంది. ఆర్సెసెస్ నాయకుడు గోపన్నగా సుబ్బరాజు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక నక్సలైట్‌గా ఛత్రపతి శేఖర్ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. లాయర్‌గా రియా సుమన్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జితేందర్ రెడ్డి పర్సనల్ పీఏ పాత్రలో రవిప్రకాశ్ బాగా మెప్పించాడు. రవి ప్రకాశ్ తండ్రి పాత్రను పోషించిన వ్యక్తితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. క్లైమాక్స్ సాంగ్స్ హృదయాలను హత్తుకుంటుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. కొన్ని విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- Rating: 2.75/5
Comments
Please login to add a commentAdd a comment