
Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎలా రఫ్ఫాడిస్తాడన్నది బిగ్‌బాస్ తొలి సీజన్ ద్వారా మనం ఇదివరకే చూశాం. చాలా కాలానికి ఆయన మరోసారి బుల్లితెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’ అనే రియాలిటీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించనున్నాడు. తాజాగా ఈ షోకు సంబంధించి కిక్కిచ్చే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ నెలలోనే ఎవరు మీలో కోటీశ్వరులు ప్రసారం కాబోతోందంటూ ప్రోమోను రిలీజ్ చేశారు.
ఇందులో ఒక స్కూలు టీచర్ పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారు? అని పిల్లలను అడిగింది. కలెక్టర్ అని ఒకరు, పైలెట్ అని మరొకరు సమాధానం చెప్తుండగా ఒక విద్యార్థిని మాత్రం అమ్మను అవుదాం అనుకుంటున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పెద్దయ్యాక అదే అమ్మాయికి ఎన్టీఆర్ ముందు హాట్ సీట్‌లో కూర్చునే అవకాశం వరించింది. అప్పుడు ఎన్టీఆర్.. జీవితంలో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా ఆమె మరోసారి 'అమ్మనవుదాం అనుకుంటున్నాను' అని బదులిచ్చింది. రేపటితరాన్ని ముందుకు నడపాలంటే అది అమ్మ వల్లే సాధ్యం అంటూ తన తల్లి పడ్డ కష్టాలను వివరించింది.
ఆమె సమాధానం ఎన్టీఆర్ మనసును కూడా గెల్చుకున్నట్లు తెలుస్తోంది. 'ఇక్కడ మనీతో పాటు మనసులు కూడా గెల్చుకోవచ్చు. ఇక్కడ కథ మీది, కల మీది, ఆట నాది, కోటి మీది.. రండి గెలుద్దాం' అంటూ మీసం మెలేసి సవాలు విసురుతున్నాడు తారక్. ఆగస్టులోనే ఈ షో ప్రసారం అవుతుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మొత్తానికి లేటెస్ట్ ప్రోమో చూస్తుంటే వారి నిరీక్షణకు డబుల్ ఫలితం దక్కేలా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment