సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): నిర్మాత బన్నీవాసు తనను మోసం చేశాడని ఆరోపిస్తూ సినీ నటి సునీత బోయ మంగళవారం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. ఇటీవల ఆమె తనకు న్యాయం కావాలంటూ ఇదే కార్యాలయం ముందు నగ్నంగా కూర్చొని నిరసన వ్యక్తం చేయగా జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చగా ఆమెను తల్లిదండ్రులకు అప్పగించాలంటూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
రెండు వారాలు గడవకముందే మళ్లీ ఆమె అదే కార్యాలయం ముందు బైఠాయించి గేటుకు వేలాడుతూ నిరసన వ్యక్తం చేసింది. గీతా ఆర్ట్స్ కార్యాలయం ప్రతినిధులు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా వినకుండా గేటు ముందే పడుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులను మూడు గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టింది. ఇప్పటి వరకు ఆమె ఇదే కార్యాలయం ముందు పాతికసార్లు ఆందోళన చేయగా రెండుసార్లు ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి తరలించారు. అయినా ఆమెలో మార్పురాక పోగా తరచూ న్యూసెన్స్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment