టైటిల్: బింబిసార
నటీనటులు: కల్యాణ్ రామ్, కేథరీన్ థ్రేసా, సంయుక్త మీనన్, ప్రకాశ్ రాజ్, వివాన్ భటేనా, అయ్యప్ప పి శర్మ తదితరులు
నిర్మాత : హరికృష్ణ. కె
కథ, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: వశిష్ఠ
సినిమాటోగ్రఫీ: చోటా కె నాయుడు
విజువల్ ఎఫెక్ట్స్: అనిల్ పాడురి
విడుదల తేది: ఆగస్టు 5, 2022
'అతనొక్కడే' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కల్యాణ్ రామ్ 'పటాస్', '118' వంటి చిత్రాలతో సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే రొటీన్ సినిమాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథ ద్వారా ప్రేక్షకుల ముందుకు 'బింబిసార'గా వచ్చాడు కల్యాణ్ రామ్. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం 'బింబిసార'. టైమ్ ట్రావెల్ మూవీగా వచ్చిన ఈ మూవీ శుక్రవారం (ఆగస్టు 5) విడుదలైంది. మరి ఈ సినిమాతో కల్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడా? లేదా? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.
కథ:
త్రిగర్తల సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపతిగా పాలిస్తుంటాడు బింబిసారుడు (కల్యాణ్ రామ్). అహం, తనను ఎవరు ఎదిరించలేరనే పొగరుతో, పాలించే ప్రజలను, చిన్న పిల్లలను సైతం చూడకుండా అతి కిరాతకంగా చంపే కర్కోటకుడిగా రాజ్యాన్ని ఏలుతుంటాడు. ఈ క్రమంలోనే ఒక మాయ దర్పణం ద్వారా భూలోకానికి వస్తాడు. భూలోకంలో అతనికి వారసులు ఉన్నారని, అతని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిసిన బింబిసారుడు ఏం చేశాడు? అతి క్రూరుడైన రాజు రాజు బింబిసారుడు.. తన ప్రజల కోసం ప్రాణాలిచ్చే నిజమైన చక్రవర్తిగా, ఒక మానవత్వం గల మనిషిగా ఎలా మారాడు? టైమ్ ట్రావెల్ చేసేందుకు వీలుగా ఉన్న మాయ దర్పణం ఎలా వచ్చింది? బింబిసారుడు దాచిని నిధి తలపులు తెరవడానికి ప్రయత్నిస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి (వివాన్ భటేనా) ఎవరు? అనే తదితర ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే 'బింబిసార' సినిమాను కచ్చితంగా చూడాల్సిందే.
విశ్లేషణ:
క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని పాలించిన రాజు బింబిసారుడు. నిజానికి ఇతను హర్యాంక రాజవంశానికి చెందినవాడు. అయితే ఈ బింబిసారుడు అనే పాత్రను తీసుకుని పూర్తి కల్పిత కథతో 'బింబిసార'ను తెరకెక్కించారు డైరెక్టర్ వశిష్ఠ. 'ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్' అనే ఒక్క క్యాప్షన్‌తో సినిమా కథను చెప్పేశారు. చరిత్రలో బింబిసారుడు ఎలా ఉన్న ఈ సినిమాలో మాత్రం అత్యంత క్రూరుడిగా, మద గజ మహారాజుగా చిత్రీకరించారు. రాజ్యాన్ని తాను ఒక్కడే పాలించాలనే కోరికతో సొంత తమ్మున్ని సైతం చంపించే అన్నగా బింబిసారుడి పాత్రను ఆవిష్కరించారు.
అంతేకాకుండా తనకు ఎదురు వస్తే, తన మాటను ధిక్కరిస్తే చిన్న పిల్లలను కూడా అంతమొందించే రాక్షస రాజుగా బింబిసార పాత్రలో కల్యాణ్ రామ్‌ను చూపించారు. అహంతో మదమెక్కి అరాచకాలు, ఆకృత్యాలు చేసే చక్రవర్తిగా బింబిసారుడిని చూపించడంలో డైరెక్టర్ పూర్తిగా సక్సెస్ అయ్యారు. తర్వాత ఒక నిజమైన రాజుగా, మంచి మనిషిగా బింబిసారుడు మారే క్రమాన్ని కూడా అంతే బాగా తెరకెక్కించారని చెప్పవచ్చు.
త్రిగర్తల సామ్రాజ్యం, అక్కడి భాషా, వేషం అన్ని చక్కగా చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఒకటి, రెండు సీన్లలో త్రిగర్తల సామ్రాజ్యపు కోట ఆర్టిఫిషియల్‌గా కనిపించిన మిగతా సీన్లలో మాత్రం కళ్లకు విజువల్ ఫీస్ట్. ఫ్యామిలీ డ్రామాతో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కొంచె రొటీన్‌గా అనిపించిన ఆకట్టుకునేలా ఉన్నాయి. అక్కడక్కడ వచ్చిన కామెడీ కూడా బాగానే పండింది. కొన్ని సీన్లు, విజువల్స్ ఇతర సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్‌లో వచ్చే ఫైటింగ్ సీన్స్ చాలా స్టైలిష్‌గా అదిరిపోయాయి. బింబిసారుడిని ఎలివేట్ చేసే డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి.
ఎవరెలా చేశారంటే?
ఈ సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ చిత్రంలోని కల్యాణ్ రామ్ యాక్టింగ్ అతని కెరీర్‌లోనే ది బెస్ట్. క్రూరమైన రాక్షస చక్రవర్తి బింబిసారుడిగా పూర్తి నెగెటివ్ పాత్రలో కల్యాణ్ రామ్ అదరగొట్టాడు. అహంతో విర్రవీగే రాజుగా, ఎదురు తిరిగిన, సలహా ఇచ్చిన ప్రతి ఒక్కరినీ నిర్దాక్షణ్యంగా చంపే కర్కోటకపు రాజుగా కల్యాణ్ రామ్ చూపించిన అభినయం అబ్బురపరుస్తుంది. అలాగే సెకండాఫ్‌లో వచ్చే ఫైటింగ్ సీన్లలో స్టైలిష్‌గా, ఒక రాజులోని హుందాతనాన్ని నటనతో చాలా చక్కగా చూపించాడు. తర్వాత మనిషిగా మారిన చక్రవర్తిగా, ఎమోషనల్ సీన్లలో సైతం ఆకట్టుకున్నాడు. బింబిసారుడి తమ్ముడు దేవ దత్త పాత్రలో కూడా చక్కగా ఒదిగిపోయాడు. సినిమా మొత్తం తాను ఒక్కడై నడిపించినట్లుగా ఉంటుంది.
యువరాణి ఐరాగా కేథరీన్ థ్రేసా, ఎస్సై వైజయంతిగా సంయుక్త మీనన్ నటన పాత్రకు తగినట్లుగా పర్వాలేదు. కానీ వారి రోల్స్‌కు అంతా ప్రాముఖ్యత లేదు. శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిశోర్, చమ్మక్ చంద్ర కామెడీతో అలరించారు. వివాన్ భటేనా, ప్రకాశ్ రాజు, రాజీవ్ కనకాల, అయ్యప్ప పి శర్మ తదితరులు పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు. ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచింది. అలాగే కథకు అనుగుణంగా వచ్చిన ఒక్కో పాట కూడా అలరిస్తుంది. ఈ ఒక్కో సాంగ్‌ను చిరంతన్ భట్, వరి కుప్పల యాదగిరి, ఎంఎం కీరవాణి కంపోజ్ చేశారు. ఇక విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక రాక్షస రాజుగా నటనతో మెస్మరైజ్ చేసిన కల్యాణ్ రామ్ 'బింబిసార' సినిమా కచ్చితంగా చూడాల్సిందే.
-సంజు (సాక్షి వెబ్‌డెస్క్)
Comments
Please login to add a commentAdd a comment