![Kangana Ranaut: It was a Mistake Directing Emergency, Another Mistake is](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/9/Kangana-Ranaut_1.jpg.webp?itok=LB_0Z_Ag)
హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ఏ ముహూర్తాన ఎమర్జెన్సీ సినిమా మొదలుపెట్టిందో కానీ అవాంతరాలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడో రిలీజవ్వాల్సిన సినిమా ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. అన్ని అడ్డంకులు దాటుకుని ఎమర్జెన్సీ (Emergency Movie) ఎట్టకేలకు జనవరి 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
తప్పు చేశా..
ఎమర్జెన్సీ సినిమా తీయడమేమో కానీ తనను మూడు చెరువుల నీళ్లు తాగించారంటోంది కంగనా. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఎమర్జెన్సీని థియేటర్లలో విడుదల చేయాలనుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. ఓటీటీకి వెళ్లుంటే ఇంకా అక్కడ మంచి డీల్ దొరికేది. ఈ సెన్సార్ బాధలు పడే గత్యంతరమే వచ్చుండేది కాదు. అసలు సెన్సార్ బోర్డు (The Central Board for Film Certification) నా చిత్రంలో ఆయా సన్నివేశాలను ఎందుకు తీసేయాలనుకుందో అర్థమే కాలేదు. వారు సూచించిన కట్స్ అన్నీ కూడా చరిత్రలో భాగమైనవే! అయినా వాటిని తీసేసినా కూడా నా సినిమా ధృడంగానే ఉంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/kangana_0.jpg)
అది నా మొదటి తప్పు
ఎమర్జెన్సీని థియేటర్లలో విడుదల చేయాలనుకోవడం ఒక్కటే నేను చేసిన తప్పు కాదు. దానికంటే ముందు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం అతి పెద్ద తప్పుగా భావిస్తున్నాను. గతంలో కిస్సా కుర్సీ కా (ఇందిరా గాంధీ, ఆమె తనయుడు సంజయ్ గాంధీల రాజకీయాలపై వచ్చిన సెటైరికల్ మూవీ) మూవీ వచ్చింది. దీన్ని ఎవరూ చూడలేదు. కారణం.. బ్యాన్ చేశారు. అప్పట్లోనే ఈ సినిమా ప్రింట్లన్నింటినీ కాల్చేశారు. ఆ చిత్ర దర్శకుడు అమృత్ నహ్త ఆత్మహత్య చేసుకున్నాడు.
(చదవండి: 'డాకు మహారాజ్' ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు)
మీకే తెలుస్తుంది
అప్పటినుంచి ఇప్పటివరకు ఇందిరా గాంధీపై ఏ ఒక్కరూ సినిమా తీసే ధైర్యం చేయలేదు. నాకూ దాదాపు అలాంటి పరిస్థితులే వస్తాయని ఊహించలేదు. స్టూడియో కోసం, బడ్జెట్ కోసం కష్టపడాల్సి వచ్చింది. ఇంత చేస్తే నా మూవీ రిలీజ్ అవుతుందని ఎవరూ నమ్మలేదు. ఇప్పుడీ సినిమా చూశాక ఇప్పటి జనరేషన్‌కు ఇందిరాగాంధీ మూడుసార్లు ప్రధాని ఎలా అయిందో తెలుస్తుంది అని చెప్పుకొచ్చింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/emergenvy.jpg)
అది తెలుసుకుని మాట్లాడు
ఈమె ఇంటర్వ్యూ విన్న నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అంతా ఓకే కానీ, కిస్సా కుర్సీ కా డైరెక్టర్ అమృత్ నహ్త బలవన్మరణం చేసుకోలేదని చెప్తున్నారు. ఆయన అనారోగ్యంతో మరణించారని.. కాస్త తెలుసుకుని మాట్లాడమని సూచిస్తున్నారు.
సినిమా విశేషం
కాగా కంగనా దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటించిన ఎమర్జెన్సీ. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో విధించిన ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూస్టార్ వంటి సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో కంగనాతో పాటు అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పడే, అశోక్ చబ్రా, మహిమ చౌదరి, మిలింద్ సోమన్, విశాక్ నాయర్, సతీశ్ కౌశిక్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది సెప్టెంబర్ 6న విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు వాయిదాల అనంతరం ఈ నెల 17న రిలీజవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment