టైటిల్: కంగువా
నటీనటులు: సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు
నిర్మాణ సంస్థ: స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్
నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్
దర్శకత్వం: శివ
సంగీతం: దేవీవ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి
ఎడిటర్: నిశాద్ యూసుఫ్
విడుదల తేది: నవంబర్ 14, 2024
కథేంటి అంటే?
కంగువ కథ 1070 - 2024 మధ్య నడుస్తుంది. 2024లో ఒక ప్రయోగశాల నుంచి జీటా అనే బాలుడు తప్పించుకుని గోవా వెళ్తాడు. మరోవైపు గోవాలో ఫ్రాన్సిస్ (సూర్య), కోల్ట్ (యోగిబాబు) బౌంటీ హంటర్స్‌గా ఉంటారు. పోలీసులు కూడా పట్టుకోలేని క్రిమినల్స్‌ను వారు పట్టుకుంటూ ఉంటారు. గోవాకు చేరుకున్న జీటాని ఫ్రాన్సిస్ అదుపులోకి తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒక నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఒకరిని హత్య చేస్తాడు. ఈ హత్యను జీటా చూస్తాడు. అంతేకాదు ఫ్రాన్సిస్‌ను చూడగానే ఏదో తెలిసిన వ్యక్తిలా జీటా ఫీల్ అవుతాడు. ఫ్రాన్సిస్ కూడా జీటాతో ఏదో కనెక్షన్ ఉండేవాడిలా ఫీల్ అవుతాడు. హత్య విషయాన్ని బయట చెప్పకుండా ఉండేందుకు జీటాను తన ఇంటికి తెచ్చుకుంటాడు.
ఇదే క్రమంలో జీటాను పట్టుకునేందుకు ల్యాబ్ నుంచి కొంతమంది వస్తారు. వారినుంచి జీటానీ కాపాడేందుకు ఫ్రాన్సిస్ ప్రయత్నిస్తుండగా కథ 1070లోకి వెళ్తుతుంది. అసలు జీటా ఎవరు..? అతనిపై చేసిన ప్రయోగం ఏంటి..? ఫ్రాన్సిస్, జీటా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? 1070కి చెందిన కంగువా(సూర్య) ఎవరు..? కపాల కోన నాయకుడు రుధిర ( బాబీ డియోల్)తో కంగువకి ఉన్న వైరం ఏంటి..? పులోమ ఎవరు? కంగువపై అతనికి ఎందుకు కోపం? భారత దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు రోమానియా సైన్యం వేసిన ప్లాన్ ఏంటి..? ప్రణవాది కోన ప్రజలను కాపాడుకోవడం కోసం కంగువ చేసిన పోరాటం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఎంత గొప్ప కథ అయినా సరే ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్తేనే ఆ సినిమాని ఆదరిస్తారు. ముఖ్యంగా కథ చెప్పడంలో విసిగించకుండా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు.. కథ చెప్పాలి. లేకపోతే ఎంత మంచి కథ అయినా...అంతే సంగతి. దర్శకుడు శివ రాసుకున్న కథ చాలా గొప్పది. కానీ అంతే గొప్పగా తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా ఫస్టాఫ్ ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యారు. సినిమా చూస్తున్నంతసేపు సూర్య పాత్ర మాత్రమే ప్రధానంగా ఉంటుంది. అయితే, స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్లు అన్నీ ఆడియెన్స్‌ను విసిగిస్తూనే ఉంటాయి. యోగిబాబు, రెడిన్ కింగ్‌స్లే కామెడీతో విసింగేచేశారనే ఫీల్ అందరిలోనూ కలుగుతుంది.
సినిమా ప్రారంభమైన సుమారు 30 నిమిషాల తర్వాత అసలు కథలోకి దర్శకుడు శివ వెళ్తాడు. అప్పటి వరకు ఆడియన్స్‌ను దర్శకుడు విషింగించారనే చెప్పవచ్చు. ఎప్పుడైతే పీరియాడిక్ పోర్షన్ మొదలౌతుందో అక్కడి నుంచి కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా కథ అంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. అప్పుడు వచ్చే వార్ ఎపిసోడ్లు అందరినీ మెప్పించడమే కాకుండా గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఫస్టాఫ్‌ను దర్శకుడు ఇంకాస్త బాగా తీసింటే కంగువా మరింత గొప్ప సినిమాగా ఉండేది. ఫస్టాఫ్‌లో సూర్య, దిశా పటానీ లవ్ స్టోరీ అంతగా కనెక్ట్ కాలేదు.
విలన్‌గా బాబీ డియోల్ లుక్ బాగున్నప్పటికీ ఆయన పాత్రను చూపించడంలో ఆ క్రూరత్వం కనిపించదు. ఇక్కడ కూడా డైరెక్టర్ శివ కాస్త నిరుత్సాహపరిచారు. అయితే, భారీ ఎమోషనల్ బ్యాంగ్‌తో సినిమాను ఎండ్ చేస్తారు. క్లైమ్యాక్స్ తర్వాత మాత్రం రెండు ట్విస్టులు ఇచ్చిన దర్శకుడు శివ.. సీక్వెల్‌కు మంచి లీడ్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఎవరెలా చేశారంటే..
సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తారు. ఈ చిత్రం కోసం ఆయన ప్రాణం పెట్టి నటించారు. కంగువా, ఫ్రాన్సిస్ అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన సూర్య.. ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ముఖ్యంగా వెయ్యేళ్ల కిందట వీరుడు కంగువాగా ఆయన నటనతో మెప్పించి సినిమాకే హైలెట్‌గా నిలిచారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఉదిరన్ పాత్రకు బాబీ డియోల్ పూర్తి న్యాయం చేశారు. ఏంజెలీనాగా దిశాపటానీ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రలో అనేక షేడ్స్ ఉంటాయి. సినిమాకు ఆమె స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.యోగి బాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం పర్వాలేదు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. అదే సమయంలో కొన్ని చోట్ల మోతాదుకు మించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. పాటలు పర్వాలేదు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా, రియాల్టీకీ దగ్గరగా ఉంటుంది. వీఎఫ్‌ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు చాలా రిచ్‌గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment