చాలామంది ఇప్పటికీ మగపిల్లాడే కావాలనుకుంటారు, కానీ ఆడపిల్లను మాత్రం అస్సలు కోరుకోరు. మరీ ముఖ్యంగా మొదటి ప్రసవంలో ఆడపిల్ల పుడితే అదేదో పాపం జరిగిపోయినంత ఫీలైపోతారు. ఇలాంటి పరిస్థితి తన ఇంట్లో కూడా ఎదురైందని అంటోంది హీరోయిన్ కరిష్మా తన్నా. తను పుట్టినప్పుడు తండ్రి ముఖం చూసేందుకు కూడా ఇష్టపడలేదని చెప్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'మాది గుజరాతీ కుటుంబం. మాది ఉమ్మడి కుటుంబం. మా పెద్దనాన్న వాళ్లు, తాతయ్య బిజినెస్‌లో బాగానే సంపాదించారు. కానీ నాన్న మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు పడేవాడు. నేను మూడో తరగతి చదివేవరకు కూడా ఆ కష్టాలు వెంటాడాయి. నేను పుట్టినప్పుడు మా నాన్న అస్సలు సంతోషంగా లేడని నేను పెద్దయ్యాక అమ్మ చెప్పింది. నాన్న కొడుకు కావాలని ఎదురుచూశాడట. కానీ ఆడపిల్ల పుట్టడంతో నిరాశచెందాడు. అన్ని గుజరాతీ కుటుంబాలలాగే మా ఇంటివాళ్లు కూడా మగపిల్లాడే కావాలని ఒత్తిడి చేశారు.
అబ్బాయి అయితేనే ఇంటిని, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలడు, బాగా సంపాదించగలడని భావించారు. అమ్మమ్మ, తాతయ్య నన్ను పవర్‌ఫుల్ గర్ల్‌గా పెంచారు. ఒక అబ్బాయి ఏదైతే చేయగలడో అది అమ్మాయి కూడా చేయగలదు అని నిరూపించాలనుకుకున్నాను. కానీ ఇప్పటికీ నన్ను బాధించే విషయం నేను పుట్టగానే అమ్మానాన్న నా ముఖం కూడా చూడలేదు. అమ్మ ఒక వారం రోజులపాటు నా వైపు కన్నెత్తి చూడలేదు. నాన్న అయితే నెల రోజులపాటు నేనెవరో కూడా తెలీదన్నట్లుగా ఉండిపోయాడు. నేనెలా ఉన్నానో కూడా పట్టించుకోలేదు.
అమ్మ ఈ విషయం చెప్పినప్పుడు నా గుండె పగిలింది. నాన్న చూడటానికి రాలేదని తెలిసి నేను తట్టుకోలేకపోయాను. నాన్నకు ఆడపిల్లంటే ఇష్టమే కానీ ఆ విషయాన్ని తన ఫ్యామిలీకి ఎలా చెప్పాలో అర్థం కాక కుమిలిపోయాడు. నేను కాస్త పెద్దయ్యాక నాన్నకు మాటిచ్చా.. కొడుకు దగ్గరి నుంచి ఏవైతే ఆశిస్తావో అవన్నీ నేను నీకు అందిస్తాను. ఇక మీదట నేనే నీ కొడుకుని అని చెప్పా.. చెప్పినట్లే ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను' అని చెప్పుకొచ్చింది కరిష్మా.
ఎవరీ కరిష్మా..
క్యూంకీ సాద్ భీ కభీ బహు తీ సీరియల్‌తో 17 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్ ఆరంభించింది కరిష్మా. ఇందులో ఆమె పోషించిన ఇందు పాత్ర తనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. ఆ వెంటనే పలు సీరియల్స్, రియాలిటీ షోలలోనూ మెరిసింది. ప్రస్తుతం ఆమె స్కూప్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ఈ సిరీస్‌లో జాగృతి పాతక్ అనే జర్నలిస్టుగా కనిపించనుంది. ఈ వెబ్ సిరీస్ జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
చదవండి: ప్యాలెస్‌లో శర్వానంద్ పెళ్లి.. ఒక్కరోజుకు ఎన్ని కోట్లంటే?
Comments
Please login to add a commentAdd a comment