Karthikeya 2 Movie Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

Karthikeya 2 Review: ‘ కార్తికేయ2 ’ మూవీ రివ్యూ

Published Sat, Aug 13 2022 12:21 PM | Last Updated on Sat, Aug 13 2022 2:15 PM

Karthikeya 2 Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : కార్తికేయ2 
నటీనటులు : నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌, అనుపమ్‌ ఖేర్‌, ఆదిత్య మీనమ్‌, కేఎస్‌ శ్రీధర్‌, శ్రీనివాసరరెడ్డి 
నిర్మాణ సంస్థ : పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్
నిర్మాతలు:  టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ 
దర్శకత్వం: చందూ మొండేటి
సంగీతం : కాల భైరవ
సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని
విడుదల తేది: ఆగస్ట్‌ 13, 2022

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌. ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడ్డాడు. ఆయన కెరీర్‌లోనే భారీ బ్లాక్‌ బస్టర్‌ అయిన చిత్రం ‘కార్తికేయ’. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా అదే టీమ్‌తో ‘కార్తికేయ2’ తీశాడు. ఎన్నో అవంతరాల తర్వాత నేడు(ఆగస్ట్‌ 13) ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో కార్తికేయ2 పై హైప్‌ క్రియేట్‌ అయింది. ఈ భారీ అంచనాల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం  ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే.. 
ఈ సినిమా కథంతా  ద్వాపర యుగానికి, ద్వారక నగరానికి సంబంధించిన ఒక రహస్యం చుట్టూ తిరుగుతుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కాలికి ధరించిన కంకణం.. నేటి కలియుగంలోని ఎన్నో అంతుచిక్కని సమస్యలకు పరిష్కారం చూపుతుందని ఆర్కియాలజిస్ట్ రావు తెలుసుకుంటాడు. ఆ కంకణం గురించి అశ్వేషిస్తున్న రావు హత్య చేయబడతాడు.

అదే సమయంలో  తల్లి (తులసి)తో కలిసి ద్వారక దర్శనానికి వచ్చిన డాక్టర్‌ కార్తిక్‌(నిఖిల్‌)ని పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. ఆర్కియాలజిస్ట్ రావును కార్తిక్‌కే హత్య చేశాడని తప్పుడు కేసు నమోదు చేస్తారు. పోలీసు స్టేషన్‌లో ఉన్న కార్తిక్‌ని రావు  రావు మనవరాలు ముగ్ధ (అనుపమా పరమేశ్వరన్) తప్పిస్తుంది. అసలు కార్తిక్‌ని ముగ్ఢ ఎందుకు తప్పించింది? ఆమె కార్తిక్‌తో చెప్పిన విషయం ఏంటి? శ్రీకృష్ణుడి కంకణం కనిపెట్టాలని కార్తిక్‌ ఎందుకు డిసైడ్‌ అవుతాడు? ఈ క్రమంలో కార్తిక్‌కు డాక్టర్‌ శాంతను (ఆదిత్యా మీనన్) నుంచి ఎటువంటి ప్రమాదాలు ఎదురయ్యయాయి? అధీరుల తెగకు చెందిన వ్యక్తులు కార్తిక్‌ని చంపేందుకు ఎందుకు ప్రయత్నించారు. చివరకు కార్తిక్‌ కంకణ రహస్యాన్ని కనిపెట్టాడా? లేదా? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
దర్శకుడు చందూ మొండేటి మొదటి నుంచి చెబుతున్నట్లుగా ‘కార్తికేయ’ చిత్రానికి, కార్తికేయ2 కు ఎలాంటి సంబంధం లేదు. కేవలం హీరో, అతని తల్లి పాత్రలు అలా ప్రవర్తిస్తాయి. కార్తికేయలో మిస్టరీ, థ్రిల్లర్‌ అంశాలు ఉంటే.. ఇందులో అడ్వెంచర్‌ ఎలిమెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. దైవం, సైన్స్‌ రెండింటిని కలిపి ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌లో మొత్తం సాదాసీదాగా సాగుతున్నప్పటికీ.. సెకండాఫ్‌పై మాత్రం క్యూరియాసిటీ పెంచుతుంది.

అధీరుల వంశానికి చెందిన ఓ వ్యక్తి కార్తిక్‌పై దాడి చేయడం.. దానికి కారణం ఏంటో యానిమేషన్‌ ద్వారా చూపించడం ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్‌ తర్వాత కథలో వేగం పెరుగుతుంది. శ్రీకృష్ణ కంకణం అన్వేషణని ఆసక్తికరంగా తెరపై చూపించాడు. గోవర్థన గిరి గుహలో లభించిన ఆధారంతో కంకణాన్ని కనిపెట్టడం.. దానిని తీసుకొచ్చేందుకు కార్తిక్‌ చేసిన ప్రయత్నం రక్తి కట్టిస్తుంది.  తర్వాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని క్లైమాక్స్‌ వరకు ఉండేలా జాగ్రత్త పడ్డాడు. 

కథ పరంగా చూస్తే కార్తికేయ2 చాలా సాదారనమైనది..కానీ కథనం మాత్రం కొత్తగా ఆకట్టుకునేలా ఉంటుంది. కార్తికేయలో మాదిరి ఇందులో భయపడే సీన్స్‌ పెద్దగా ఉండవు. అలాగే హీరోని ఢీకొట్టేందుకు బలమైన విలన్‌ లేకపోవడంతో కొన్ని సన్నివేశాలు చప్పగా సాగాయనే ఫీలింగ్‌ కలుగుతుంది. అలాగే విలన్‌, అధీరుల తెగకు చిక్కిన ప్రతీసారి హీరో సింపుల్‌గా తప్పించుకోవడం లేదా ఆ సీన్‌ని హడావిడిగా ముంగించి వేరే సీన్‌లోకి తీసుకెళ్లడంతో థ్రిల్‌ మూమెంట్స్‌ మిస్‌ అవుతారు. శ్రీకృష్ణుడి గొప్పదనం గురించి అనుపమ్‌ ఖేర్‌తో చెప్పించే డైలాగ్స్‌ ఆకట్టుకుంటుంది. దర్శకుడు ఫోకస్‌ అంతా కృష్ణతత్వం మీదే పెట్టినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది.  కమర్షియల్‌ హంగుల కోసం సాంగ్స్‌, కామెడీని జోడించకుండా  ఉత్కంఠభరితంగా కథను నడిపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. 
 
ఎవరెలా చేశారంటే...
డాక్టర్‌ కార్తికేయ పాత్రలో నిఖిల్‌ ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రని అల్రెడీ కార్తికేయ చిత్రంలో పోషించిన అనుభవం ఉండటం అతనికి కలిసొచ్చింది. కార్తికేయ మాదిరే కార్తికేయ 2 కథ మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు. ఇక ముగ్ధ పాత్రకి అనుపమ పరమేశ్వరన్‌ న్యాయం చేసింది. కార్తిక్‌ని కాపాడే రెండు సీన్స్‌ అనుపమా క్యారెక్టర్‌ని గుర్తిండిపోయేలా చేస్తాయి. ఇక బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తెరపై కనిపించేది కొద్ది నిమిషాలే అయినా.. గుర్తిండిపోయే పాత్ర చేశారు. శ్రీకృష్ణుడి గొప్పతనం గురించి ఆయన చెప్పే డైలాగ్స్‌ థియేటర్స్‌లో ఈలలు వేయిస్తాయి. కార్తిక్ మామగా శ్రీనివాస్‌రెడ్డి, ట్రాలీ డ్రైవర్‌గా వైవా హర్ష తమదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రవీణ్‌, సత్యలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం కాల భైరవ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు.  కార్తీక్‌ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ రెండూ బాగున్నాయి.  వీఎఫ్ఎక్స్‌ ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement