స్టార్ హీరోయిన్ సమంతకు ‘మహానటి’ కీర్తి సురేశ్ థాంక్స్ చెప్పింది. ఆమె వల్లే తనకు ‘బేబీ జాన్’ అవకాశం వచ్చిందని, ఆమె ఇచ్చిన ధైర్యంతోనే సినిమాలో నటించానని చెప్పింది. కీర్తి సురేశ్ నటించిన తొలి హిందీ సినిమా ‘బేబీ జాన్’.వరుణ్ ధావన్ హీరోగా కాలీస్ దర్శకత్వంలో అట్లీ నిర్మించిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్‌డ్ టాక్ సంపాదించుకుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చిందో చెప్పింది. తమిళ మూవీ ‘తెరి’ని హిందీలో రీమేక్ చేయాలని భావించగానే సమంత నా పేరు చెప్పారు. తమిళ్‌లో ఆమె పోషించిన పాత్రను నేను హిందీలో చేయడం ఆనందంగా ఉంది. సామ్ వల్లే నాకు హిందీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
‘తెరి’లో సమంత నటన నాకెంతో ఇష్టం. ఆ పాత్రలో నేను నటించాలని చెప్పగానే భయపడ్డాను. కానీ సమంత నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. మేకర్స్ నా పేరు వెల్లడించగానే.. ‘నువ్వు తప్ప ఈ పాత్రలో మరెవ్వరు చేయలేరు’ అని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టారు. ఆ సందేశం నాకు చాలా ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచింది. సమంత స్ఫూర్తితోనే ధైర్యంగా షూటింగ్ పూర్తి చేశాను. ఈ మూవీలో నటించనడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని కీర్తి సురేశ్ చెప్పుకొచ్చింది. కాగా, గతంలో కీర్తి, సమంత కలిసి ‘మహానటి’లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment