
ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ మరణం సినీ, సంగీతప్రియులను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. మంగళవారం రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన ఇచ్చిన అనంతరం హోటల్ గదిలోకి వెళ్లిన కేకే ఛాతీలో భారంగా ఉందంటూనే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు ధృవీకరించారు. అయితే సకాలంలో సీపీఆర్ (కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేసుంటే కేకే బతికేవారని ఓ వైద్యుడు పేర్కొన్నారు.
గురువారం కేకే పార్థివదేహానికి పోస్ట్‌మార్టం చేసిన వైద్యుడు మీడియాతో మాట్లాడుతూ.. 'కేకే గుండెలోని ఎడమ ధమనిలో పెద్ద బ్లాక్ ఏర్పడింది. ఇతర నాళాల్లో కూడా చిన్నచిన్న బ్లాక్స్ ఉన్నాయి. లైవ్ షోలో తీవ్ర ఉద్వేగానికి లోనవడంతో రక్త ప్రసరణ ఆగిపోయి గుండెపోటు వచ్చింది. కేకే జనాలతో కలిసి డ్యాన్స్ చేస్తూ పాడుతూ బాగా ఎగ్జయిట్ అయ్యాడు. తీవ్ర ఉద్వేగానికి లోనయినప్పుడు రక్త ప్రసరణ కొన్ని క్షణాల పాటు ఆగిపోయి గుండె నెమ్మదిగా కొట్టుకుంటుంది. ఆ సమయంలోనే అతడికి గుండెపోటు వచ్చింది. కానీ అతడు స్పృహ తప్పి కింద పడిపోయిన వెంటనే ఎవరైనా సీపీఆర్(గుండె మీద చేతులతో నొక్కడం) చేసుంటే బతికే ఛాన్స్ ఉండేది. అతడికి చాలాకాలంగా గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేశాడు' అని పేర్కొన్నాడు.
సీపీఆర్ ఇలా..
గుండెపోటుకు గురైన లేదా అకస్మాత్తుగా కుప్పకూలి గుండె ఆగిపోయిన (కార్డియాక్ అరెస్ట్ అయిన) వ్యక్తికి కార్డియో పల్మనరీ రిససిటేషన్ (సీపీఆర్) చేయడం ద్వారా గుండెను మళ్లీ స్పందించేలా చేయవచ్చు. వ్యక్తి స్పృహ తప్పి పడిపోయిన 3–4 నిమిషాల్లో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడటానికి 60 నుంచి 70% అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సీపీఆర్ ప్రక్రియలో భాగంగా గుండెమీద చేతులతో లయబద్ధంగా వెంటవెంటనే తగినంత ఒత్తిడితో నొక్కాలి. తద్వారా గుండె కండరాలన్నిటినీ ఉత్తేజితం చేసి మెదడుకు అవసరమైన రక్తం మళ్లీ అందేలా చేయవచ్చు. ఓ వైపు సీపీఆర్ చేస్తూనే అంబులెన్స్‌ను రప్పించి ప్రాథమిక చికిత్స అందిస్తూ ఆస్పత్రికి తరలిస్తే బాధితులు బతకడానికి అవకాశాలు ఉంటాయి.
చదవండి: పాటలు పాడడానికే పుట్టాడు.. 'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి'
కేకే ఎవరు? మాలాంటి గొప్ప సింగర్లు మీ కళ్లకు కనిపించడం లేదా?
Comments
Please login to add a commentAdd a comment