పరుత్తివీరన్ చిత్రంతో నటుడిగా సినీకెరీర్ ప్రారంభించిన హీరో కార్తీ. కథల ఎంపికలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇటీవల విరుమాన్, పొన్నియిన్ సెల్వన్, సర్ధార్ చిత్రాలతో వరుసగా విజయాలు అందుకున్న ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం జపాన్. ఇది ఆయన కెరీర్‌లో 25వ చిత్రం కావడం విశేషం. కాగా నటుడిగా కార్తీ 20 వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రాన్ని రాజుమురుగన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్‌ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్.ప్రభు నిర్మించారు. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్ నాయకిగా నటిస్తోంది. ఇందులో దర్శకుడు కేఏస్.రవికుమార్, విజయ్ మిల్టన్, వాగై చంద్రశేఖర్, టాలీవుడ్ నటుడు సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా.. జపాన్ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకను ఈనెల 28న భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు నిర్మాతల్లో ఒకరైన ఎస్‌ఆర్.ప్రభు వెల్లడించారు. కార్తీ నటించిన 25వ చిత్రం కావడంతో ఈ వేడుకను ప్రత్యేకంగా అభిమానుల సమక్షంలో స్థానిక నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు.
కార్తీ ఇప్పటి వరకూ నటించిన 24 చిత్రాల్లో 19 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయన్నారు. అందులో 6 చిత్రాలు తమ సంస్థలో నిర్మించడం విశేషమన్నారు. కాగా కార్తీ 25వ చిత్రం జపాన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు ఆయన్ని గౌరవించే విధంగా ఈ వేడుక ఉంటుందన్నారు. ఇందులో కార్తీ నటించిన చిత్రాలకు సంబంధించిన సన్నివేశాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఆ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ ఈ చిత్రానికి రవివర్మన్ సినిమాటోగ్రఫీ, జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment