బర్త్‌డే అంటే చాలు.. బెల్లం చుట్టూ ఈగలు ముసురుకున్నట్లు కేకు చుట్టూ చిన్నపిల్లలు గుమిగూడతారు. బర్త్‌డే ఎవరిదన్నది వారికి ముఖ్యం కాదు, కేక్ ముక్క వచ్చిందా? లేదా? అన్నదే వారికి అత్యంత అవసరం. అందులోనూ పెద్ద కేక్ పీస్ వచ్చిందంటే ఆనందంతో కేరింతలు పెడుతుంటారు. పెద్దవాళ్లు కూడా ముందుగా పిల్లలకే కేక్ ఇచ్చి తినమంటారు. కానీ ఇక్కడో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మాత్రం కేక్‌వైపే అవురావురుమంటూ చూస్తున్న చిన్నారిని వదిలి అతడిని ఎత్తుకున్న పెద్దోడికి తినిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
భేడియా సినిమా షూటింగ్ నిమిత్తం వరుణ్ ధావన్ ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్నాడు. అక్కడ చిత్రయూనిట్ సభ్యుల్లో ఒకరి కుమార్తెది బర్త్‌డే సెలబ్రేట్ చేశారు. అయితే ఆమె చిన్నపాప కావడంతో వరుణ్ ధావన్ కేక్ కట్ చేశాడు. దాన్ని పుట్టినరోజు పాపాయికి తినిపిస్తాడనుకుంటే ఆ కేకు ముక్కను మొట్టమొదటగా ఆమె తండ్రికి తినిపించాడు. దీంతో ఎంతో ఆశగా నోరు తెరిచిన చిన్నారి ముఖంలో ఒక్కసారిగా నిరాశ కమ్ముకుంది.
ఈ వీడియోను కృతీసనన్ షేర్ చేసింది. 'ఈ వీడియో మిమ్మల్ని రోజంతా నవ్విస్తుంది కావచ్చు. కానీ ఇలాంటి ఘటనలు మనమూ ఎప్పుడో ఒకసారి ఎదుర్కొనే ఉన్నాం. కానీ మరీ ఘోరంగా చిన్నపాప అని కూడా చూడకుండా ఇలా చేస్తావ్ అనుకోలేదు వరుణ్..' అని రాసుకొచ్చింది. అటు వరుణ్ మాత్రం 'ఐయామ్ సారీ.. ఇది పాప బర్త్‌డే కానీ, సెలబ్రేషన్స్ మాత్రం ఆమె తండ్రివి' అని కొంటెగా బదులిచ్చాడు. వరుణ్, కృతీ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తుండగా దినేశ్ విజన్ నిర్మిస్తున్నాడు. అభిషేక్ బెనర్జీ, దీపక్ డోబ్రియాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
చదవండి: కృతి చేతిలో ఏడు సినిమాలు
Comments
Please login to add a commentAdd a comment