'భలే భలే మగాడివోయ్ బంగారు నాసామివోయ్..', 'మసక మసక చీకటిలో..', 'తీస్కో కోకోకోలా..' వంటి సూపర్ హిట్ సాంగ్స్ పాడిన గాయని ఎల్ ఆర్ ఈశ్వరి. విలక్షణమైన స్వరంతో స్వర విన్యాసం చేసిన ఆమె తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'కోరస్ పాటల నుంచి నా కెరీర్ మొదలైంది. అమ్మ కోరస్ పాడుతూ ఉండేది. ఆ తర్వాత నేనూ కోరస్ పాడటం మొదలుపెట్టాను. సువర్ణ సుందరి సినిమాలో పిలువకురా పాటకు కోరస్ ఇస్తుంటే నా గొంతు బాలేదని చెప్పి బయటకు గెంటేశారు. నాకంటే ఎక్కువగా అమ్మ బాధపడింది. ఎవరైతే నన్ను బయటకు పొమ్మన్నారో వాళ్లే నా పాటను రికార్డు చేసే రోజొకటి వస్తుందని ఓదార్చాను. కానీ నాకూ కన్నీళ్లాగలేదు. అయితే నేను పెద్ద సింగర్ అయ్యాక అదే రికార్డిస్టు నా పాటలు రికార్డు చేశాడు.
ఇప్పుడొస్తున్న పాటలేవీ నాకు నచ్చడం లేదు. ఇటీవల ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా.. పాట విన్నాను. అసలు అదీ ఒక పాటేనా? మొదటి నుంచి చివరకు ఒకేలా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ చూసుకోవాలి కదా, పిల్లలకేం తెలుసు? చెప్పినట్టు పాడతారు. ఆ పాట నా దగ్గరకొచ్చి ఉంటే ఆ కలరే వేరు. మేము ఎంతో సిన్సియర్‌గా పని చేశాం కాబట్టే అప్పుడు పాడిన పాటలు ఇప్పటికీ నిలబడుతున్నాయి. అప్పుడు ఒక్క సినిమా 100, 250 రోజులు ఆడింది. ఇప్పుడు 10 రోజులు ఆడితేనే గొప్ప అంటున్నారు అని చెప్పుకొచ్చింది' ఈశ్వరి.
Comments
Please login to add a commentAdd a comment