'Lucky Lakshman' Movie Review and Rating in Telugu - Sakshi
Sakshi News home page

Lucky Lakshman Review: ‘బిగ్‌బాస్‌’ ఫేం సోహైల్‌ ఫస్ట్‌ మూవీ ‘లక్ష్మీ లక్ష్మణ్‌’ ఎలా ఉందంటే..

Published Fri, Dec 30 2022 12:40 PM | Last Updated on Fri, Dec 30 2022 2:05 PM

Lucky Lakshman Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: లక్కీ లక్ష్మణ్‌
నటీనటులు: స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష‌, దేవీ ప్ర‌సాద్‌, రాజా ర‌వీంద్ర‌, స‌మీర్‌, కాదంబ‌రి కిర‌ణ్‌, షాని తదితరులు
నిర్మాణ సంస్థ:   ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌
నిర్మాత: హ‌రిత గోగినేని
క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఎ.ఆర్‌.అభి
సంగీతం: అనూప్ రూబెన్స్‌
సినిమాటోగ్ర‌ఫీ:  ఐ.అండ్రూ
ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి
విడుదల తేది: డిసెంబర్‌ 30, 2022

బిగ్ బాస్ ఫేం స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత  గోగినేని ఈ సినిమాను నిర్మించారు. నేడు(డిసెంబర్‌ 30) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే.. 
లక్ష్మణ్‌(సోహైల్‌) ఓ మధ్య తరగతి యువకుడు. చిన్నప్పటి నుంచి  తండ్రి(దేవీ ప్రసాద్‌) ఏది అడిగినా..డబ్బులు లేవని చెబుతాడు. దీంతో తండ్రిపై లక్ష్మణ్‌కు కోపం ఏర్పడుతుంది.  పెద్దయ్యాక తన తండ్రిలాగా ఉండొద్దని, చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించిన విలాసవంతమైన జీవితం అనుభవించాలనుకుంటాడు. అందుకే అమ్మాయిలకు దూరంగా ఉంటూ బుద్దిగా చదువుకుంటాడు. అయితే బీటెక్‌లో చేరిన తొలి రోజే అతనికి శ్రేయ(మోక్ష) పరిచయం అవుతుంది. ఆమె బాగా ధనవంతురాలు. అయినా ఆ పొగరు ఎక్కడా చూపించదు. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి..అది కాస్త ప్రేమగా మారుతుంది.

లక్ష్మణ్‌ కుటుంబ నేపథ్యం తెలుకున్న శ్రేయ.. అతనికి కావాల్సినవన్నీ ఇస్తుంది. లక్ష్మణ్‌ ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఒక్కడే ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటాడు. ఓ విషయంలో శ్రేయ, లక్ష్మణ్‌ మధ్య గొడవ జరిగి బ్రేకప్‌ చెప్పుకుంటారు. ఆ తర్వాత లక్ష్మణ్‌ ఓ మ్యారేజ్‌ బ్యూరో స్టార్‌ చేసి నాలుగేళ్లలో బాగా డబ్బులు సంపాదిస్తాడు. కట్‌ చేస్తే.. ఓ రోజు  ఒక స్టోర్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న శ్రేయను చూసి లక్ష్మణ్‌ షాకవుతాడు.  

బాగా డబ్బులున్న శ్రేయ స్టోర్‌ మేనేజర్‌గా ఎందుకు ఉద్యోగం చేస్తుంది? లక్ష్మణ్‌, శ్రేయల బ్రేకప్‌కి కారణం ఏంటి? ఒకప్పుడు మంచి ఇల్లు.. ఆస్తులు ఉన్న లక్ష్మణ్‌ తల్లిదండ్రులు ఇప్పుడు ఎందుకు అద్దె ఇంట్లో ఉన్నారు? లక్ష్మణ్‌ కోసం తండ్రి చేసిన త్యాగం ఏంటి? పేరెంట్స్‌ విలువను లక్ష్మణ్‌ ఎప్పుడు తెలుసుకున్నాడు? చివరకు శ్రేయ, లక్ష్మణ్‌లు మళ్లీ ఎలా ఒకటయ్యారు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే..
‘డబ్బులు ఉంటే చాలు.. అన్ని వచ్చేస్తాయి. ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత సుఖంగా బతుకుతాం’అని చాలా మంది భావిస్తారు.  అలా అనుకున్న ఓ యువకుడి కథే ఈ ‘లక్కీ లక్ష్మణ్‌’. త‌ల్లిదండ్రుల ప్రేమానురాగాలు.. అమ్మాయి ప్రేమ ... ఏదీ త‌క్కువ కాదు. అలాంటి వాటి కంటే డ‌బ్బు గొప్ప‌ది కాదనే ఓ మంచి  సందేశాన్ని అందించిన సినిమా ఇది. దర్శకనిర్మాతలు కమర్షియల్‌గా ఆలోచించకుండా ఓ మంచి సందేశాన్ని అందించారు. ఈ విషయంలో వారిని మెచ్చుకోవాల్సిందే. అయితే ఈ మూవీ కథనం మాత్రం రొటీన్‌గా సాగుతుంది. కాలేజీ నేపథ్యం.. ప్రేమ.. బ్రేకప్‌ ఇలా ప్రతీది  గత సినిమాలలో చూసిన సన్నివేశాలే. కొన్ని చోట్ల లాజిక్‌ లేకుండా కొన్ని సీన్స్‌ వచ్చిపోతుంటాయి. మధుతో లక్ష్మణ్‌ ఫోన్‌ కాల్‌ సీన్‌ నవ్విస్తుంది.

ఇంటర్వెల్‌ వరకూ రొటీన్‌గా సాగే ఈ కథ.. సెకండాఫ్‌ నుంచి టర్న్‌ తీసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే ఫస్టాఫ్‌కు సెకండాఫ్‌కు సంబంధమే లేదన్నట్లుగా కథనం సాగుతుంది. లక్ష్మణ్‌ మ్యారేజ్‌ బ్యూరో ఏర్పాటు చేయడం.. ఎమ్మెల్యే కొడుకు పెళ్లి జరిపించడం..బాగా డబ్బులు సంపాదించన తర్వాత పెరెంట్స్‌ విలువ తెలుకొవడం..ఇలా సెకండాఫ్‌ సాగుతుంది. క్లైమాక్స్‌కు 20 నిమిషాల ముందు ప్రేక్షలు కథలో లీనం అవుతారు. క్లైమాక్స్‌ ఆలోచింపజేసే విధంగా ఉంటుంది.

ఎవరెలా చేశారంటే.. 
ఈ సినిమాలో సోహైల్‌ న‌ట‌న  సింప్లీ సూప‌ర్బ్‌. లక్ష్మణ్‌ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. శ్రీ పాత్రకు మోక్ష న్యాయం చేసింది. కాలేజీ సీన్స్‌లో తెరపై అందంగా కనిపిస్తుంది.  హీరో తండ్రి స్నేహితుడిగా కాబందరి ఒకే ఒక సీన్‌లో కనిపిస్తాడు. కానీ అతను చెప్పే సంభాషణలు అలా గుర్తిండిపోతాయి. ఇక హీరో తండ్రిగా దేవి ప్రసాద్ తన పాత్రకు న్యాయం చేశాడు. హీరో స్నేహితులు కిరణ్‌, చరణ్‌ పాత్రలు పోషించిన వారి నటన, కామెడీ బాగుంది. ఎమ్మెల్యేగా రాజా రవీంద్ర, కాలేజీ స్టూడెంట్‌గా యాదమ్మ రాజుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అనూబ్‌ రూబెన్స్‌ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రాఫర్‌ ఐ.అండ్రూ పనితీరు బాగుంది. నిర్మాత హరిత గోగినేని ఖర్చుకు వెనకాడకుండా సినిమాను చాలా రిచ్‌గా తెరకెక్కించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement