
ఆశా నేగి.. కానీ, అందరికీ పూర్విగానే తెలుసు. తను అక్కడ టీవీలో అల్లరి చేస్తే.. ఇక్కడ ఇంట్లో మురిసిపోతారు. అంతలా ప్రేక్షకులను మాయ చేసిన ఆశా ఇప్పుడు వెబ్ ప్రపంచంలోనూ అందరి మనసులు దోచేస్తోంది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో పుట్టి, పెరిగింది. దయానంద్ ఆంగ్లో వేదిక్ (డీఏవీ) కాలేజీలో బీకామ్ చేసింది. అనంతరం ఓ కాల్ సెంటర్‌లో ఉద్యోగం సంపాదించుకుంది. ఆ సమయంలోనే ‘మిస్ ఉత్తరాఖండ్ 2009’ అందాల పోటీలో పాల్గొని కిరీటం సాధించింది.
నటనపై ఉన్న ఇష్టంతో ముంబై చేరింది ఆశా. తొలి అవకాశం ‘పవిత్ర రిష్తా’ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. అందులో తను షోషించిన ‘పూర్వీ’ పాత్రను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు.. అదే ఆమె ఇంటి పేరుగా మారేంతలా. ఈ సీరియల్‌లోని రిత్విక్ ధంజని, ఆశా నేగి జంటకూ అంతే క్రేజ్ ఏర్పడింది. జీవితంలోనూ ఆ ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. కలసి ఇండియన్ డ్యాన్స్ రియాలిటీ షో ‘నాచ్ బలియే 6’లో పాల్గొని విజయం సాధించారు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకే ఆ ఇద్దరూ విడిపోయారు. ప్రేమ గాయంతో కుంగిపోలేదు ఆశా. 2013లో ‘ఇండియన్ ఐడల్ జూనియర్’ షోకు వాఖ్యాతగా చేసింది. ‘ఖత్రోం కే ఖిలాడీ’ షోలో రన్నరప్‌గా నిలిచింది. ఇలా పలు సీరియల్స్, షోలు చేస్తూ బుల్లితెరపై బిజీగా ఉంటోంది.
గతేడాదే ‘బారిష్’ అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీకీ పరిచయమైంది ఆశా. ఆ తర్వాత చేసిన ‘అభయ్ 2’ ఆమెను ఓటీటీ స్టార్ చేసేసింది. క్రైం జర్నలిస్టుగా అందులో ఆమె కనబర్చిన నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ కారణంగానే అనురాగ్ బసు దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ మూవీ ‘లూడో’లో ఆమెకు స్థానం దక్కింది. అభిషేక్ బచ్చన్ పక్కన నటించింది.
సదా కృతజ్ఞురాలిని
డిజిటల్ ప్లాట్‌ఫాం అనేది సినిమాకు, టీవీకి మధ్య ఉన్న అందమైన వంతెన. నటనకు సంబంధించి సంపూర్ణ స్వేచ్ఛను ఇక్కడ నేను ఆస్వాదించాను. అలాగని నాకు గుర్తింపు తెచ్చిపెట్టిన టీవీని ఎన్నటికీ మరువను. దానికి సదా కృతజ్ఞురాలినే.
– ఆశా నేగి
Comments
Please login to add a commentAdd a comment