హేమ కమిటీ నివేదిక మాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ రిపోర్ట్ బయటకొచ్చాక పలువురు డైరెక్టర్స్, నటులపై పెద్దఎత్తున లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు హీరోయిన్స్ తమకెదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(AMMA) సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అమ్మ అధ్యక్ష పదవిలో ఉన్న మోహన్ లాల్ సైతం వైదొలిగారు. పాలక మండలి పదవుల నుంచి మొత్తం 17 మంది సభ్యులు రాజీనామాలు సమర్పించారు. వీరంతా నైతిక బాధ్యత వహిస్తూ పక్కకు తప్పుకున్నారు. దీంతో మలయాళ చిత్రమండలిని రద్దు చేశారు. రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.
రాజీనామా చేయని ఇద్దరు?
అయితే అమ్మ సభ్యులుగా ఉన్న మరో ఇద్దరు హీరోయిన్స్ మాత్రం రాజీనామాలు సమర్పించలేదు. తాజాగా రద్దయిన కమిటీలో హీరోయిన్స్ సరయు, అనన్య సభ్యులుగా ఉన్నారు. అయితే రాజీనామా నిర్ణయంపై తమ సమాచారం లేదని వీరిద్దరు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తమ అభిప్రాయం కూడా తీసుకోలేదని ఆరోపించారు. అయితే మండలి పూర్తిగా రద్దు చేయడంతో వీరి పదవులు కూడా పోయినట్లేనని భావిస్తున్నారు.
అసలేంటి హేమ కమిటీ?
ఇటీవల జస్టిస్ హేమ కమిటీ షాకింగ్ నివేదికను బహిర్గతం చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. ఆ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఆ తర్వాత దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముకేశ్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలోనే మొదట అమ్మ జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment