ప్రముఖ మలయాళ నటి హనీరోజ్ (Honey Rose) వేధింపుల కేసులో ఇప్పటికే వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. చాలాసార్లు తనను సోషల్ మీడియా వేదికగా ఇబ్బందులకు గురి చేశాడని హానీ రోజ్ ఆరోపించిస్తోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సుమారు 30మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బిజినెస్‌మెన్ బాబీ చెమ్మనూరు సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వయనాడ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అతనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు.
అయితే హనీ రోజ్ ఫిర్యాదు తర్వాత ప్రముఖ మలయాళ కామెంటేటర్ రాహుల్ ఈశ్వర్ హీరోయిన్‌పై విమర్శలు చేశారు. ఈ విషయంలో వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్‌కు రాహుల్ ఈశ్వర్ మద్దతుగా నిలిచారు. తాజాగా ఓ టీవీ డిబేట్‌లో పాల్గొన్న రాహుల్ ఈశ్వర్.. హనీ రోజ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. హనీ డ్రెస్ గురించి చర్చించడంలో తప్పు లేదని.. తన మార్కెటింగ్ సామర్థ్యాన్ని ఆమె ఉపయోగించుకుందని రాహుల్ హనీ రోజ్‌ను విమర్శించాడు.
తనపై రాహుల్ ఈశ్వర్ చేసిన కామెంట్స్‌కు హనీ రోజ్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. మీకు భాషపై పట్టు ఉన్న మాట వాస్తవమే కానీ.. మహిళల దుస్తులను చూసినప్పుడు మాత్రం నియంత్రణ కోల్పోతున్నారని ఆయన మాటలు వింటేనే అర్థమవుతోందని మండిపడింది.
హనీ రోజ్ ఇన్‌స్టాలో రాస్తూ.. 'మీ భాషపై నియంత్రణ చాలా తక్కువ. ఒక సమస్యపై చర్చ జరిగినప్పుడు.. చర్చకు రెండు వైపులా ఆలోచిస్తే మంచిది. భాషపై మీకున్న అద్భుతమైన పట్టుతో ఎల్లప్పుడూ చర్చలకు సిద్ధంగా ఉంటారు. కానీ రాహుల్ ఈశ్వర్ తన భాషా నైపుణ్యంతో మహిళల సమస్యల విషయంలో మాత్రం తటస్థంగా వ్యవహరిస్తాడు. భాషపై మీ నియంత్రణ గొప్పదే అయినప్పటికీ, మహిళల దుస్తుల విషయానికి వస్తే అది కాస్తా తడబడుతున్నట్లు కనిపిస్తోంది. రాహుల్ ఈశ్వర్ గుడిలో పూజారి కాకపోవడమే మంచిదైంది. లేకుంటే తాను ఉన్న గుడికి వచ్చే మహిళలకు డ్రెస్ కోడ్ పెట్టేవాడు. ఎలాంటి వస్త్రధారణ మీ స్వీయ నియంత్రణకు భంగం కలిగిస్తుందో ఎవరు అంచనా వేయగలరు?. నేను ఎప్పుడైనా మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎదుర్కోవలసి వస్తే ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటా" అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది
అసలేం జరిగిందంటే..
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై డబుల్ మీనింగ్‌తో పోస్టులు పెడుతున్నారని హనీ రోజ్ ఆరోపించారు. కొందరు తనను వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్స్ పెడుతున్నారని ఇన్‌స్టాలో కొద్దిరోజుల క్రితం తెలిపారు. ఒక వ్యాపార వేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నాని ఒక లేఖను హనీరోజ్ విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని నన్ను అవమానించడానికి యత్నిస్తున్నాడని అందులో రాసుకొచ్చింది. తప్పుడు కామెంట్ల గురించి తాను సైలెంట్‌గా ఉంటుంటే.. ఆ వ్యాఖ్యలను నువ్వు స్వాగతిస్తున్నావా..? అని చాలామంది అడుగుతున్నారని ఆమె తెలిపారు.
హనీరోజ్ సినీ కెరీర్..
వీరసింహారెడ్డి చిత్రంతో హనీరోజ్ తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఈ ఒక్క సినిమాతోనే 10 చిత్రాలకు దక్కినంత పేరు, గుర్తింపు ఆమె రావడం విశేషం. దీంతో తెలుగు రాష్ట్రాలలో పదుల సంఖ్యలో పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలకు గెస్ట్‌గా వెళ్లారు. వాస్తవంగా 2008లోనే ఆలయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. మలయాళంలోనే వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ చేతిలో ప్రస్తుతం రాచెల్ అనే ప్రాజెక్ట్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment