ముంబై: బాలీవుడ్ సినిమా ‘ఖ్వాహిష్’(2003)తో వెలుగులోకి వచ్చిన మల్లికా శెరావత్.. ఆ తర్వాత విడుదలైన ‘మర్డర్’ సినిమాతో బోల్డ్ నటిగా గుర్తింపు పొందారు. ఈ రెండు చిత్రాల్లోనూ మితిమీరిన గ్లామరస్ షో చేశారనే విమర్శలు మూటగట్టుకున్నారు. కెరీర్ ఆరంభంలోనే ఇంతకు దిగజారావా అనే కామెంట్లు కూడా ఆమె చెవిన పడ్డాయి. ఈ విషయాల గురించి తాజాగా బాంబే టైమ్స్‌తో మాట్లాడిన మల్లికా శెరావత్ తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ‘‘మర్డర్ సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నైతికంగా నేను చచ్చిపోయినట్లు అనిపించింది.
దిగజారుడు మనస్తత్వం గల మహిళగా చిత్రీకరించే సన్నివేశాల్లో హత్యకు గురైనట్లుగా భావించాను. అందుకు తగ్గట్లే విమర్శలు కూడా. అయితే, నేను అప్పట్లో చేసిన ఈ సీన్లు ఇప్పుడు సినిమాల్లో సర్వసాధారణమైపోయాయి. ప్రేక్షకులు సినిమాను చూసే విధానం మారింది. చాలా మార్పులు వచ్చాయి. కానీ, నాకు మాత్రం 50, 60వ దశకాల నాటి సినిమాలే ఇష్టం. వాటిని ఎవరూ బీట్ చేయలేరు. అప్పట్లో స్త్రీల కోసం అద్భుతమైన పాత్రలు సృష్టించేవారు. అయితే, రానురాను ఆ సున్నితత్వం, అందులోని అందం మసకబారిపోయింది. ఒక్క మంచి పాత్ర కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది’’ అని మల్లిక తన మనసులోని భావాలు వెల్లడించారు.
నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు
ఇక తన సినిమాల విడుదలలో జాప్యం జరగడం గురించి చెబుతూ..‘‘సినిమాలతో పాటు వెబ్ షోస్ కూడా చేస్తున్నా. ట్రావెలింగ్‌ను ఆస్వాదిస్తున్నా. నిజానికి.. ఇలాంటి పాత్రలు కావాలి, ఇదే చేయాలి, ఇప్పుడు విడుదల కావాలి అని అడిగేందుకు, నాకు మద్దతుగా నిలిచేందుకు బాయ్‌ఫ్రెండ్ లేడు. నా బతుకు నేను బతుకుతున్నా. ప్రశాంతంగా ఉన్నా. సమయం వచ్చినపుడు అన్నీ అవే జరుగుతాయి. సినిమాల్లో భాగం కావడం అదృష్టంగా భావిస్తాను’’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కాగా మల్లికా శెరావత్ తాజాగా నటించిన ఆర్కే/ఆర్కేఏఓ చిత్రం అమెరికా, కెనడా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. రజత్ కపూర్ దర్శకత్వం వహించారు. రజత్, మల్లికతో పాటు రణ్‌వీర్ షోరే, కుబ్రా సైత్, మను రిషి చద్దా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment