టైటిల్: పురు (Puzhu)
నటీనటులు: మమ్ముట్టి, పార్వతి తిరువోతు, వాసుదేవ్ సజీత్ తదితరులు
నిర్మాత: ఎస్ జార్జ్
దర్శకత్వం: రథీనా పీటీ
సంగీతం: జేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీ: థేనీ ఈశ్వరన్
విడుదల తేది: మే 13, 2022 (సోనీ లివ్)
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి విభిన్నమైన సినిమాలతో విలక్షణ నటనతో అలరిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ 70 ఏళ్ల వయసులోనూ నేటి తరం హీరోలకు గట్టిపోటీ ఇస్తూ అబ్బురపరుస్తున్నారు. ఇటీవల భీష్మ పర్వం, సీబీఐ5, ది ప్రీస్ట్ సినిమాలతో ఆకట్టుకున్న మమ్ముట్టి, మరో వైవిధ్యమైన క్యారెక్టరైజేషన్‌లో నటించిన చిత్రం 'పురు' (Puzhu). ఈ సినిమాతోనే మమ్ముట్టి ఓటీటీలోకి అడుగు పెట్టగా, రథీనా పీటీ దర్శకురాలిగా పరిచయమయ్యారు. మమ్ముట్టి నెగెటివ్ షేడ్స్ పాత్రలో కనిపించిన ఈ చిత్రంలో పార్వతి తిరువోతు మరో కీ రోల్‌లో నటించారు. మే 13న ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్‌లో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
పోలీస్ ఆఫీసర్ కుట్టన్ (మమ్ముట్టి) తన భార్య చనిపోవడంతో కొడుకు కిచ్చు (వాసుదేవ్ సజీత్)తో కలిసి అందిరికీ దూరంగా నివసిస్తూ ఉంటాడు. అనుక్షణం క్రమశిక్షణ పేరుతో కొడుకు కిచ్చుతో కాస్తా కఠినంగా ప్రవర్తిస్తుంటాడు. కానీ కిచ్చుకు మాత్రం తండ్రి ప్రవర్తన చాలా ఇబ్బంది పెడుతుంది. అయినా తండ్రి మీద భయంతో అది పైకి మాత్రం చెప్పడు. మరోవైపు కుట్టన్ చెల్లెలు భారతి (పార్వతి తిరువోత్తు) పెద్దలను ఎదిరించి కేపీ అనే నాటకాలు వేసే వ్యక్తిని ప్రేమవివాహం చేసుకుంటుంది. కేపీది తక్కువ కులం కావడంతో కుట్టన్ ఫ్యామిలీ వారిద్దరిని దూరం పెడతారు. కానీ అనుకోకుండా కుట్టన్ ఉంటున్న ఫ్లాట్‌లోకి భారతి-కేపీ వచ్చి నివసిస్తుంటారు. మరోవైపు కుట్టన్‌ను చంపేందుకు ఎవరో ప్రయత్నిస్తుంటారు. కుట్టన్ చంపేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు ? వారికి కుట్టన్‌కు సంబంధం ఏంటీ ? తన చెల్లెలు భారతి ప్రేమను కుట్టన్ అంగీకరించాడా ? కుట్టన్‌తోపాటు భారతి జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది తెలియాలంటే 'పురు' చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇది ఒక సింపుల్ స్టోరీ. పరువు హత్యలు, రివేంజ్ కథాంశంగా తెరకెక్కింది. ఈ స్టోరీని మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌గా బాగానే మలిచారు డైరెక్టర్ రథీనా పీటీ. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. క్రమశిక్షణ పేరుతో తండ్రి ప్రవర్తించే తీరు, అది నచ్చకపోయిన తండ్రి మీద భయంతో వాటన్నింటిని కొడుకు భరించే సీన్లను చక్కగా చూపించారు. ఉన్నత కుటుంబాల్లో ఉండే కుల వివక్షత, ఎవరైనా ప్రేమించి పెద్దలను పెళ్లి చేసుకుంటే ఇరుగుపొరుగు వాళ్ల మాటలు, తండ్రి చెప్పిందే వేదం వంటివి ఆలోచింపజేస్తాయి. కానీ స్టోరీ, స్క్రీన్‌ప్లే చాలా స్లోగా నడుస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారనే చెప్పవచ్చు. తర్వాత ఏదో జరుగబోతోందనిపించే ప్రేక్షకుడికి ప్రతిసారి నిరాశే మిగులుతుంది.
క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ పర్వాలేదనిపిస్తుంది. కుట్టన్ తీసుకునే సడెన్ డెసిషన్ ఆశ్చర్యపరుస్తుంది. కుట్టన్‌ను ఎందుకు, ఎవరు చంపుతున్నారనే విషయం ఓకే అనిపిస్తుంది. ఒరిజినల్‌గా ఇది మలయాళ చిత్రం. తెలుగులోకి డబ్ చేశారు. అయితే పాత్రల లిప్ సింక్‌కు తగినట్లుగా డబ్ చేస్తారు. డబ్ చేసేటప్పుడు దానికి తగినట్లుగానే డైలాగ్‌లు రాస్తారు. మలయాళంలో ఉన్న డైలాగ్‌లనే తెలుగులోనూ పూర్తిగా అదే అర్థం వచ్చేలా చెప్పిస్తే కొంతవరకు బెటర్‌గా ఉండేది. రివెంజ్ తీర్చుకునే వ్యక్తి ఇంటెన్సిటీ చక్కగా కనిపించేది. ఎందుకంటే ఇంగ్లీష్‌లో వచ్చే సబ్‌టైటిల్స్‌కు తెలుగులో డైలాగ్‌లకు కొన్నిసార్లు సంబంధం ఉండదు. కేవలం కొద్దిపాటి అర్థం వచ్చేలా మ్యానేజ్ చేశారు.
ఎవరెలా చేశారంటే?
ఈ మూవీలో హైలెట్ అంటే కేవలం అది మమ్ముట్టి నటనే. కొడుకు మీద ప్రేమతోపాటు క్రమశిక్షణ ఎంత అవసరమో అని చెప్పే తండ్రిగా, భార్య జ్ఞాపకాలను తలుచుకుంటూ జీవించే భర్తగా ఆయన నటన అద్భుతంగా ఉంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆయన క్యారెక్టర్, నటన బాగా మ్యాచ్ అయ్యాయి. కుట్టన్ కొడుకు కిచ్లుగా బాల నటుడు వాసుదేవ్ సజీత్ కూడా ఎంతో చక్కగా నటించాడు. తండ్రి మీద భయం, ద్వేషం, ప్రేమ వంటి ఎమోషన్స్ చూపించండలో ఆకట్టుకున్నాడు. పార్వతి తిరువోతు నటన ఆ క్యారెక్టర్‌కు సరిపోయేలా ఉంది. నెక్ట్స్ సమ్‌థింగ్ ఏదో జరగుతుందనిపించేలా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్‌గా ఉంది. కెమెరా వర్క్ కూడా బాగుంది. ఇక చివరిగా చెప్పాలంటే టైంపాస్ కోసం చూడలనుకునేవారు ఓపికతో 'పురు'ను చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment