నటితో క్రికెటర్‌ ఫెయిల్యూర్‌ లవ్‌ స్టోరీ | Mansoor Ali Khan Pataudi, Simi Garewal Failure Love Story | Sakshi
Sakshi News home page

ప్రేమించిన నటిని ఒంటరిని చేసిన క్రికెటర్‌

Published Sun, Jan 31 2021 10:10 AM | Last Updated on Sun, Jan 31 2021 10:18 AM

Mansoor Ali Khan Pataudi, Simi Garewal Failure Love Story - Sakshi

మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ, సిమీ గరేవాల్‌

క్రికెట్‌ స్టేడియంలో ఆ బాట్స్‌మన్‌ బ్యాటింగ్‌ తీరుకి ప్రత్యర్థులు బెంబేలెత్తుతున్నారు.. గ్యాలరీలో ఉన్న స్వదేశీయులు జేజేలు పలుకుతున్నారు. వాళ్లల్లో ఒక హీరోయిన్‌ అయితే ఆనందంతో కేరింతలు కొడ్తోంది. ఆ ఆనందం ఆ బ్యాట్స్‌మన్‌కి మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఫోర్, సిక్సర్‌ కొట్టినప్పుడల్లా ఆమె వంక చూస్తున్నాడు. అభినందనలను చప్పట్లతో మారుమోగిస్తోంది ఆమె. అతను.. మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ.. బ్యాట్‌తో మెరుపుదాడి చేసి స్టేడియంలో బంతులను పరిగెత్తించే టైగర్‌.. ఆ హీరోయిన్‌.. షర్మిలా టాగోర్‌ .. కాదు. నాజూకు మేని.. అంతే నాజూకైన స్వరం... బ్రిటిష్‌ యాక్సెంట్‌ ఇంగ్లిష్‌ ప్రత్యేకతల సిమీ గరేవాల్‌. అవును.. షర్మిలాను జీవిత భాగస్వామిగా చేసుకునే కంటే ముందు పటౌడీ శ్వాస, ధ్యాస సిమీనే. ఆ ఫెయిల్యూర్‌ లవ్‌ స్టోరీనే ఈ వారం ‘మొహబ్బతే’. 

టైగర్‌ పటౌడీ పరిచయం అక్కర్లేని పర్సనాలిటీ. సిమీ అంతే పేమస్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులకు. ‘సిద్ధార్థ’ సినిమాలో బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌గా కనిపించింది. ‘మేరా నామ్‌ జోకర్‌’, ‘చల్తే చల్తే’ వంటి సినిమాలతో మెప్పించింది. జాతీయ అంతర్జాతీయ సెలబ్రెటీలను కూర్చోబెట్టి మాటల్లో పెట్టి  వాళ్ల జీవిత కథను (‘రెండవూ విత్‌ సిమీ గరేవాల్‌’ అనే టాక్‌ షోలో) వినిపిస్తూ  బ్యూటీ విత్‌ బ్రెయిన్స్‌ అనీ నిరూపించుకుంది. పుట్టింది లుధియానా (పంజాబ్‌)లో, పెరిగింది ఇంగ్లాండ్‌లో. సిమీ సినిమాల్లోకి రావడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. నిరాహార దీక్ష చేసి పెద్దవాళ్ల చేత ‘ఎస్‌’ చెప్పించుకుంది. సిమీకి శ్వేత వర్ణం అంటే ఇష్టం. ఎక్కువగా ఆ రంగు దుస్తులనే వేసుకుంటుంది తన టాక్‌ షో అయినా.. సినిమా వేడుక అయినా. అందుకే ఆమెను ‘ది లేడీ ఇన్‌ వైట్‌’ అని పిలుస్తారు సినిమా రంగంలోని వాళ్లు. (చదవండి: ఆ హీరో ఇద్దరితో ప్రేమలో పడ్డాడు.. కానీ!)

ఫస్ట్‌ లవ్‌..
తన పదిహేడేళ్ల వయసులో ఇంగ్లాండ్‌లో వాళ్లింటి పక్కనే ఉంటూండే జమ్నాగర్‌ మహారాజుతో ప్రేమలో పడింది. అతని వల్లే బయటి ప్రపంచం తెలిసింది అనీ చెప్పింది సిమి ఒక ఇంటర్వ్యూలో. మూడేళ్లు సాగిన ఆ బంధం బ్రేక్‌ అయింది. సినిమాలతో సివీమ బిజీగా ఉన్న సమయంలో ఒక పార్టీలో పటౌడీ పరిచయం అయ్యాడు. ఆటలు, ఇంగ్లిష్‌ కల్చర్‌ అంటే ఆ ఇద్దరికీ ఉన్న ఆసక్తి వాళ్లిద్దర్నీ స్నేహితులుగా మార్చింది. సిమీ ధైర్యం, నొప్పించకుండా ఉండే మాట తీరుకు ఆకర్షితుడై.. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు పటౌడీ. నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా ఉండే అతని తీరునూ సిమీ ఇష్టపడింది. ఎక్కడ క్రికెట్‌ మ్యాచ్‌ ఉన్నా.. ఏ సినిమా వేడుకకైనా జంటగా వచ్చేవాళ్లిద్దరూ. క్రికెట్, సినిమా పరివారానికంతటికీ తెలిసిపోయింది వీళ్లిద్దరూ ప్రేమ పక్షులని. గ్యాలరీలో సిమీ కేరింతల కోసం పిచ్‌ మీద నుంచి ఆశగా చూసేవాడు పటౌడీ. ఆలంబనగా చేతులు చాచేది సిమీ. అంతే ఆమెను చూస్తూనే వచ్చే బంతిని బౌండరీ దాటించేవాడని చెప్తారు ఈ ఇద్దరి సన్నిహితులు. అందుకే ఆ రెండు రంగాల వాళ్లు వీళ్ల పెళ్లి పత్రిక కోసం ఎదురు చూడసాగారు. పటౌడీ కూడా వాళ్లింట్లో వాళ్లకు సిమీ గురించి చెప్పేసి ఆమెతో పెళ్లి నిశ్చయం చేసుకోవాలనే శుభ ఘడియ కోసం ఆగాడు.

ఈలోపు..
ఏదో సందర్భంలో షర్మిలా కలిసింది పటౌడీని. తొలి చూపులోనే ఆమె రూపం అతని మనసులో ముద్ర పడిపోయింది. ఈసారి తాను సందర్భం కల్పించుకొని షర్మిలాను కలిశాడు. పటౌడీని ఇష్టపడింది ఆమె. అతనికీ ఇష్టం ఉంది. కాని ఇంకా సందిగ్ధంలో ఉన్నాడు. జీవితభాగస్వామిగా షర్మిలా చేయే పట్టుకోవాలనే నిశ్చయించుకున్నాడు కాని సిమీతో ఉన్న బంధం అతణ్ణి కన్‌ఫ్యూజన్‌లో పెట్టింది. అయినా ఏ కొంచెం సమయం చిక్కినా షర్మిలాతోనే సమయం వెచ్చించసాగాడు. ఆ స్నేహ సంభాషణలతో కన్‌ఫ్యూజన్‌ పోయి స్పష్టత వచ్చేసింది.

ఒకరోజు సాయంకాలం.. 
సిమీ వాళ్లింటి కాలింగ్‌ బెల్‌ మోగింది. తలుపు తీసింది సిమీ. ఎదురుగా పటౌడీ. ఎప్పటిలా నవ్వుతూ ఆప్యాయంగా ఆహ్వానించింది ఆమె. ఇబ్బందిగానే హాల్లోకి వెళ్లి కూర్చున్నాడు. ‘లెమనేడ్‌ ఇష్టం కదా మీకు? తీసుకొస్తా’ అంటూ కిచెన్‌లోకి వెళ్లబోతుంటే ‘ఇప్పుడేం వద్దు. నీతో మాట్లాడాలి అంతే’ అన్నాడు పటౌడీ. ‘లెమనేడ్‌ తాగుతూ కూడా మాట్లాడొచ్చు కదా’ అని నవ్వుతూ వంటింట్లోకి వెళ్లి లెమనేడ్‌ తెచ్చి పటౌడీ చేతికిచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది సిమి. ‘ఇప్పుడు చెప్పండి’ అన్నట్టుగా. చేతిలో ఉన్న గ్లాస్‌ టీపాయ్‌ మీద పెడుతూ అన్నాడు పటౌడీ ‘సిమీ.. ఇట్స్‌ ఓవర్‌’ అని. కనుబొమలు పైకి స్ట్రెచ్‌ చేస్తూ చూసింది ఆమె ‘ఏంటీ?’ అన్నట్టుగా.  ‘యెస్‌.. నేను షర్మిలాను ఇష్టపడ్తున్నాను. తననే పెళ్లిచేసుకుంటున్నాను. ఇంక మనమధ్య.. ’ అని ఆగాడు. నవ్వుతూనే నిట్టూర్చుంది సిమీ. ‘ఐయామ్‌ సారీ సిమీ’ అన్నాడు పటౌడీ ఆమె కళ్లలోకి చూస్తూ. అదే నవ్వు ఆమె పెదవుల మీద. కాని ఆ కళ్లల్లో కనిపించిన నీటి పొర పటౌడీ దృష్టిని తప్పించుకోలేదు. అక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోయాడు. ‘బై’ అంటూ లేచాడు. తనూ లేచింది ఎప్పటిలాగే లిఫ్ట్‌ దాకా పటౌడీని సాగనంపడానికి. వద్దంటూ ఒక్కతీరుగా వారించాడు. అయినా వినకుండా అతని వెంటే వెళ్లింది. లిఫ్ట్‌ దగ్గర.. పటౌడీ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డ షర్మిలా కనిపించింది సిమీకి. ఊహించని దృశ్యానికి షర్మిలా ఇబ్బంది పడింది. ఈ లోపు లిఫ్ట్‌ వచ్చింది. షర్మిలా, వెనకాలే పటౌడీ.. లిఫ్ట్‌లో వెళ్లిపోయారు. ఒంటరి అయిపోయింది సిమీ. తర్వాత కొన్నాళ్లకు ఢిల్లీకి చెందిన రవి మోహన్‌ అనే వ్యాపారవేత్తను సిమీ పెళ్లి చేసుకుంది. కాని ఆ పెళ్లి ఎంతో కాలం నిలువలేదు. ఒంటరిగానే జీవనయానం సాగిస్తోంది సిమీ. 
- ఎస్సార్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement