
తనకు పట్టిన అదృష్టం గురించి నటి మీనాక్షి చౌదరి చెబుతూ తెగ సంబరపడిపోతోంది. కెరీర్ ప్రారంభంలో చిన్న హీరోల సరసన నటిస్తూ మంచి బ్రేక్ కోసం ఎదురుచూసిన ఈ బ్యూటీ ఆ తర్వాత స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం రావడంతో పాపులర్ అయ్యింది. ముఖ్యంగా తెలుగులో మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన గుంటూరు కారం చిత్రంలో నటించే అవకాశాన్ని పొందింది. ఆ చిత్రంలో పెద్దగా నటించడానికి అవకాశం లేకపోయినా బాగానే గుర్తింపు పొందింది. కోలీవుడ్‌లోనూ అలాంటి అవకాశంతోనే పాపులర్ అయ్యింది.
నటుడు విజయ్ కథానాయకుడిగా నటించిన గోట్ చిత్రంలో ఆయనకు జంటగా నటించే అవకాశం రావడం, అందులోనూ ఈమె పాత్ర ఒక పాట, రెండు మూడు సన్నివేశాలకే పరిమితమైనప్పటికీ గుర్తింపు మాత్రం బాగానే వచ్చింది. అయితే ఈ చిత్రం నటించడానికి అంగీకరించి తొందరపడ్డాను అనే అభిప్రాయాన్ని నటి మీనాక్షి చౌదరి ఇటీవల ఒక భేటీలో వ్యక్తం చేయడం విశేషం.
ఏదేమైనా సింగపూర్ సలూన్ అనే చిన్న చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి.. ఆ తర్వాత విజయ్ ఆంటోని కథానాయకుడు నటించిన కొలై చిత్రంలో ముఖ్య పాత్రలో నటించింది. ఆ తర్వాత గోట్ చిత్రంలో దళపతి విజయ్‌కి జంటగా నటించే అవకాశం వరించింది. అదేవిధంగా దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటించిన లక్కీ భాస్కర్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఇటీవల ఈమె తెలుగులో వెంకటేష్ సరసన నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించడంతో చాలా ఖుషీలో ఉంది. కాగా నటి మీనాక్షి చౌదరి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ గత ఏడాది తనకు చాలా ప్రత్యేకంగా గుర్తుండిపోతుందని చెప్పింది.
సినిమాల్లో చాలా ఏళ్లుగా అనుభవం ఉన్న చాలామందికి వైవిధ్య భరిత కథల్లో నటించే అవకాశాలు ప్రస్తుతం లభించడం లేదని, అలాంటిది తన కెరీర్ ఆరంభ దశలోనే పలు వైవిధ్య భరిత కథల్లో నటించే అవకాశాలు రావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. అన్నట్టు ఇటీవల గ్లామర్ విషయంలో ఈ అమ్మడు మోతాదును పెంచిందనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment