నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణతో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. గతేడాది కైకాల పుట్టినరోజు నాడు స్వయంగా చిరు దంపతులు ఆయన ఇంటికి వెళ్లి బెడ్‌పైనే కేక్ కట్ చేయించి ఆప్యాయంగా పలకరించారు. కైకాలను అలా చూడటం అదే చివరిసారి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. కైకాల మరణం పట్ల చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొంటూ సుధీర్ఘ పోస్ట్ పెట్టారు.
‘‘తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణం నన్ను ఎంతగానో కలచివేస్తోంది. తెలుగు సినీ రంగానికే కాదు.. భారత చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటుడాయన. ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో మరో నటుడు పోషించి ఉండరు. ఆయనతో నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి పరిశీలించే అవకాశం నాకు కలిగింది.
డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్ఛమైన స్పటికం లాంటి మనిషి, నిష్కల్మషమైన మనసున్న మనిషి, ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలవారు.నన్ను ‘తమ్ముడూ’ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి.
నటన, రుచికరమైన భోజనం రెండూ ఆయనకు ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతి వంటను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారు. గతేడాది ఆయన జన్మదినం సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిలిగిన సంతృప్తి. అప్పుడు ఆయన సురేఖతో.. ‘‘అమ్మా.. ఉప్పు చేప వండి పంపించు’’ అని అన్నప్పుడు..‘‘మీరు త్వరగా కోలుకోండి ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం’’ అని చెప్పాం.ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోషపడ్డారు.సత్యనారాయణ గొప్ప సినీ సంపదను అందరికీ అందించి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
Rest in peace
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2022
Navarasa Natana Sarvabhouma
Sri Kaikala Satyanarayana garu 🙏 pic.twitter.com/SBhoGATr0y
Comments
Please login to add a commentAdd a comment