
కొణిదెల శివశంకర వరప్రసాద్.. మెగాస్టార్ చిరంజీవిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఫిబ్రవరి 11, 1978లో పునాదిరాళ్ళు చిత్రంతో 'చిరు' జల్లులా వచ్చి 'తుపాన్'లా మారారు చిరంజీవి. ఇండస్ట్రీలో చిరు స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. 'స్వయంకృషి'తో ఎదిగిన నటుడిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు వుంది. నాలుగు దశాబ్దాలకు పైగా బాక్సాఫీస్‌ను శాసిస్తున్న ఆయనకు ఫ్యాన్స్ కూడా అనేకం. తాజాగా ఆయన పదో తరగతికి సంబంధించిన సర్టిఫికెట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.
చిరంజీవి 1955 ఆగష్టు 22 న పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించిన చిరంజీవి.. 10వ తరగతి సర్టిఫికేట్ తాలూకు ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సర్టిఫికెట్‌లో మెగాస్టార్ చిరంజీవి పేరు కేఎస్ఎస్ వరప్రసాద్ రావు అని ఉంది. ఆయన తండ్రి పేరు వెంకట్ రావు అని ఉంది. కానీ ఇందులో చిరంజీవి పెనుగొండలో పుట్టినట్లు పేర్కొనడం జరిగింది. అందులోని పాఠశాల వివరాలు మొగల్తూరుకు సంబంధించినవిగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆయన ఫ్యాన్స్ కూడా తెగ షేర్ చేస్తున్నారు. కానీ ఈ సర్టిఫికెట్ చిరంజీవికి సంబంధించినదేనా అని సందేహాలు కొందరిలో ఉన్నాయి. ఈ అంశం గురించి మెగాస్టార్ తన ఎక్స్ పేజీలో చెప్పాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు. చిరంజీవి తండ్రి పోలీస్ కానిస్టేబుల్ కావడంతో ఆయనకు ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నారు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది.
విద్యార్థి దశలో చిరంజీవి ఎన్.సి.సిలో చేరి 1970వ దశకంలో న్యూఢిల్లీలో జరిగిన పెరేడ్‌లో పాల్గొన్నారు. చిన్నతనం నుంచి నటనమీద ఆసక్తి ఏర్పడింది. ఒంగోలులోని సి.ఎస్.ఆర్ శర్మ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.నరసాపురంలోని శ్రీ వై.ఎన్. కళాశాల నుంచి వాణిజ్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న తర్వాత 1976లో చెన్నై వెళ్లి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో చేరాడు. 1978లో పునాదిరాళ్లు చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు.