
చాలా గ్యాప్ తర్వాత, కొత్త ప్రయోగమైన 'బింబిసార' హిట్‌తో సక్సెస్ వైపు దూసుకుపోతున్నాడు నందమూరి కల్యాణ్ రామ్. కథనే నమ్ముకుని విభిన్నమైన చిత్రాలను నటుడిగా ఎంకరేజ్ చేయడమే కాకుండా నిర్మాతగా రూపొందిస్తున్న కల్యాణ్ రామ్‌కు, ఓటీటీ వేళ థియేటర్లకు 'బింబిసార' విజయం ఒక ఆశా కిరణం. ఈ సక్సెస్‌పై కల్యాణ్ రామ్ ఆనంద వ్యక్తం చేస్తూ అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే 'బింబిసార' విజయంతో కొందరు మాత్రం రచ్చ చేస్తున్నారు. 'మెగాస్టార్' ట్యాగ్ జోడించి #MegastarKalyanRam అంటూ సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవిపై ట్రోలింగ్‌కు సైతం దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్‌కు 'మెగాస్టార్' ట్యాగ్ తగిలించడం అంతా అవసరమా? అనే విషయంపై ఓ చిన్న లుక్ వేద్దామా.
'బాల గోపాలుడు' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన నందమూరి కల్యాణ్ రామ్ 2003లో వచ్చిన 'తొలి చూపులోనే' సినిమాతో హీరోగా డెబ్యూ చేశాడు. ఈ సినిమాతో పాటు అదే సంవత్సరంలో విడుదలైన 'అభిమన్యు' అంతగా ఆకట్టుకోలేదు. తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం అతనొక్కడే. ఈ సినిమాతో సురేందర్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కల్యాణ్ రామ్ హీరోగా, నిర్మాతగా 2005లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అప్పటి నుంచి హీరోగా విభిన్నమైన కథలను ఎంచుకోవడమే కాకుండా నిర్మాతగా రూపొందిస్తున్నాడు.
ఇలా హీరోగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పేరిట నిర్మాతగా ఇప్పటివరకు ఎనిమిది చిత్రాలను నిర్మించాడు. కానీ ఏ ఒక్క చిత్రానికి స్టార్ డైరెక్టర్‌తో సినిమాను రూపొందించలేదు. అయితే 2016లో ఇజం సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసినా, అప్పుడు పూరి వరుస పరాజయాల్లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లోని తొలి చిత్రం అతనొక్కడేతో సురేందర్ రెడ్డిని పరిచయం చేస్తే, 2009లో జయీభవతో నరేన్ కొండెపాటిని, 2013లో ఓం త్రీడీ చిత్రంతో సునీల్ రెడ్డిని, 2015లో పటాస్ సినిమాతో అనిల్ రావిపూడిని డైరెక్టర్‌గా తెలుగు చిత్రసీమకు ఇంట్రడ్యూస్ చేశాడు కల్యాణ్ రామ్.
అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో రెండో సినిమాగా 2008లో విడుదలైన హరే రామ్‌ను హర్షవర్ధన్‌తో నిర్మించాడు. అప్పటికే ఈ డైరెక్టర్ బాలకృష్ణతో విజయేంద్ర వర్మ తెరకెక్కించి ప్లాప్ మూటగట్టుకున్నాడు. డైరెక్టర్ స్వర్ణ సుబ్బరావు తన పేరును హర్షవర్ధన్‌గా మార్చుకుని ఈ చిత్రం చేయడం విశేషం. తర్వాత తనతో అభిమన్యు తెరకెక్కించిన డైరెక్టర్ మల్లికార్జున్‌కు అవకాశం ఇస్తూ కత్తి సినిమాను నిర్మించాడు. ఇక తాజాగా నిర్మించిన 'బింబిసార' సినిమా డైరెక్టర్ వశిష్ఠ ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ కుమారుడు. వశిష్ఠ అసలు పేరు వెంకట్ కాగా పలువురు ముద్దుగా వేణు అని కూడా పిలిచేవారు. 2007లో 'ప్రేమలేఖ రాశా' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. గీత రచయిత కులశేఖర్ డైరెక్టర్‌గా మారిన ఈ చిత్రంలో అంజలి హీరోయిన్గా చేసింది. అయితే పలు కారణాల వల్ల విడుదల కానీ ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. హీరోగా తొలి అపజయాన్ని మూటగట్టుకున్న వెంకట్ నటనకు స్వస్తి పలికి దర్శకత్వం మీద దృష్టి పెట్టాడు. ఫైనల్‌గా సోషియో ఫాంటసీ కథతో 'బింబిసార' సినిమాను తెరకెక్కించి విజయం సాధించాడు.
ఇలా ముందు నుంచి చూసుకుంటే కల్యాణ్ రామ్ ఏ రోజు కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్ల వెంట పడలేదు. కథను, కొత్త దర్శకులు, ప్లాప్ డైరెక్టర్లు అనే భేదం లేకుండా ప్రతిభను నమ్మి.. నిర్మాతగా అవకాశాలిస్తూ నిజమైన హీరో అనిపించుకున్నాడు కల్యాణ్ రామ్. ఒక కొత్త దర్శకున్ని నమ్మి, నిర్మాతగా రూ. 45 కోట్ల బడ్జెట్ పెట్టడంతోపాటు హీరోగా 'బింబిసార' కోసం కష్టపడిన కల్యాణ్ రామ్ ఫ్యాషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పడంలో, ఈవిల్ టు గుడ్ అని ఓ టైమ్ ట్రావెల్ మూవీని నిర్మించడానికి చేసిన కృషిని ప్రశంసించడంలో ఎలాంటి తప్పులేదు. కానీ ఇదే అదనుగా కొంతమంది కల్యాణ్ రామ్ నిజమైన మెగాస్టార్ అని, చిరును కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం సరైంది కాదు.
ఎందుకంటే చిరంజీవి నటన, అభినయం, డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పునాది రాళ్లు, ప్రాణం ఖరీదు సినిమాలతో తెలుగు తెరకు పరిచయమైన చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సొంతగా ఎదిగారు. డ్యాన్స్, ఫైటింగ్స్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రయోగాత్మక చిత్రాలు, డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ అంచెలంచలుగా ఎదిగి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్ తర్వాత అంతటి స్టార్‌డమ్ సాధించారు. నేటితరం యువ హీరోలకు, ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని వంటి స్టార్స్‌కు చిరునే ఆదర్శం. ఇప్పటికీ ఆయన నటనలో, డ్యాన్స్‌లో ఎలాంటి మార్పు కనపడదు. ఆయన సినిమాలు పెద్దగా ఆడకపోవచ్చేమో కానీ, నటనలో మాత్రం చిరు ఎప్పుడు ఫ్లాప్ కాలేదు. పైగా ఏ సినిమా హిట్ అయినా, తన చిత్రం విజయం సాధించినట్లుగా మనస్ఫూర్తిగా అభినందిస్తుంటారు. కొత్త టాలెంట్‌ను, సరికొత్త కథా చిత్రాలను ఎంకరేజ్ చేస్తారు.
ఇందుకు, ఇటీవల విడుదలైన విక్రమ్, మేజర్ చిత్రాలను ప్రశంసించడం, నాగ చైతన్య కీ రోల్ ప్లే చేసిన హిందీ చిత్రం 'లాల్ సింగ్ చద్దా'ను తెలుగులో సమర్పించడం, అలాగే బెస్ట్ యాక్టర్‌గా అవార్డు దక్కించుకున్న సూర్యను మెచ్చుకోవడం, మంచి నటుడిగా మారిన తన అభిమాని సత్యదేవ్‌ను పొగిడటమే కాకుండా అవకాశాలు అందించడం, అంతేందుకు ఆగస్టు 5న విడుదలైన బింబిసార, సీతారామం సినిమాల తర్వాతి రోజే అంటే ఆగస్టు 6న ఆ చిత్రాలను ప్రశంసలతో ముంచెత్తడం వంటివి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. బింబిసార, సీతారామం చిత్రాలను 'ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటను, మరింత ఉత్సాహాన్నిచ్చాయి' అని కొనియాడుతూ తెలుగు సినిమా కోసం, అభివృద్ధి కోసం, ఇండస్ట్రీకి పెద్ద కొడుకుగా అహర్నిశలు కృషి చేస్తున్న చిరును.. తెలుగు సినీ ఇండస్ట్రీకి నిజమైన మెగాస్టార్ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు.
Hearty Congratulations
— Chiranjeevi Konidela (@KChiruTweets) August 6, 2022
Team #SitaRamam &
Team #Bimbisara 💐👏👏👏@VyjayanthiFilms @NTRArtsOfficial pic.twitter.com/cNcnuUgAYr
ఇక మెగాస్టార్ ట్యాగ్‌ను కల్యాణ్ రామ్‌కు జోడించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయడం, చిరుపై కామెంట్స్ చేయడం వంటివి పలువురి అత్యుత్సాహమని తెలుస్తోంది. ఎందుకంటే, సినిమా హిట్టయిన, ఫట్టయిన విభిన్న కథలతో ముందుకొస్తూ హీరోగా, నిర్మాతగా కల్యాణ్ రామ్ కష్టపడుతున్నారనేది వాస్తవమే. అలాంటప్పుడు.. ఒక ఉదాహరణగా తీసుకుంటే, కర్మ, క్షణం, గూఢచారి, మేజర్ వంటి ప్రయోగాత్మక చిత్రాలకు కథ అందిస్తూ, ఒక డిఫరెంట్ జోనర్ సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న అడివి శేష్‌కు కూడా మెగాస్టార్ ట్యాగ్ ఇవ్వొచ్చా? అనే ప్రశ్న ఎదురవుతుంది. సో.. ఎవరి స్టార్‌డమ్ వారిదే. ఎవరి కృషికైన గుర్తింపు ఉంటుంది. మెగాస్టార్, సూపర్ స్టార్ వంటి తదితర ట్యాగ్లు హీరోలపై అభిమానాన్ని వ్యక్తపరిచే విధంగా ఉండాలే తప్ప ఇంకొకరిని కించపరిచేలా ఉండకూడదు.
Big congratulations to #Bimbisara team . Very interesting & an engaging fantasy film . Impactful presence by @NANDAMURIKALYAN garu . My respect for him for always bringing in new talent into the industry & attempting new kind of films.
— Allu Arjun (@alluarjun) August 7, 2022
నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ కలిసి నటించి, తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత కూడా ఇలాంటి పోస్టులు పెట్టడం దురదృష్టకరం. ఈ 'ఆర్ఆర్ఆర్' చిత్రమే కాకుండా 1999లో రిలీజైన 'సుల్తాన్' మూవీలో బాలకృష్ణ, కృష్ణ, కృష్ణంరాజు కలిసి నటించి తామంతా ఒక్కటే అని నిరూపించారు. హీరోల్లో సక్యత బాగానే ఉన్నా.. కొంతమంది మాత్రం ట్రోలింగ్లతో సమయాన్ని వృథా చేసుకోవడం బాధాకరమైన విషయమేగా మాస్టారు!. కాగా ఓటీటీలని, థియేటర్లకు ఎవరు రావట్లేదనే తదితర అంశాలతో సతమతమవుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీకి బింబిసార, సీతారామం వంటి చిత్రాలు కొత్త ఉత్సాహాన్ని అందించాయి. ఇలాంటి తరుణంలో ట్యాగ్‌లను పక్కనపెట్టి సినీ పరిశ్రమ అంతా ఒకే కుటుంబమని భావిస్తే తెలుగు సినిమా ఖ్యాతి ఖండంతరాలు దాటే అవకాశముంది.
-సంజు (సాక్షి వెబ్‌డెస్క్)
Comments
Please login to add a commentAdd a comment