
ముంబై: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు దేశ ఆర్థిక రాజధాని ముంబైని అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ వరద నీరు చేరుకుని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పని మీద బయటకు వచ్చిన జనం ఇంటికి చేరాలంటే గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో సింగర్, ర్యాపర్ మికా సింగ్ కారు ముంబై వర్షాల్లో చిక్కుకుంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సింగర్ కారు ఇలా వరద నీటిలో చిక్కుకుపోయింది. ఆ సమయంలో ఆయనతో పాటు ఆకాంక్ష పూరి కూడా ఉన్నారు. వీరిద్దరు ఓ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి వస్తుండగా ఇలా వరద నీటిలో చిక్కుకుపోయారు.
ఇక మికా కారు ఆగిపోయిందన్న విషయం తెలిసిన వెంటనే ఆయన అభిమానులు పదుల సంఖ్యలో రోడ్డు మీదకు వచ్చి.. సాయం చేసేందుకు ప్రయత్నించారు. వారంతా వర్షంలో తడుస్తూ.. సింగర్‌కు సాయం చేశారు. ఈ సందర్భంగా మికా మాట్లాడుతూ.. ‘‘దగర్గ దగ్గర 200 మంది వరకు జనాలు నాకు సాయం చేయడానికి వచ్చారు. వారందరికి నా కృతజ్ఞతలు’’ అని తెలిపారు. ఇప్పుడు సమయం తెల్లవారుజామున 3 గంటలవుతుందన్నారు. అభిమానుల సాయంతో మికా సింగ్ అక్కడ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
మికా సింగ్, ఆకాంక్ష పూరి డేటింగ్ చేస్తున్నట్లు గతకొంత కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వారు నిశ్చితార్థం కూడా చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై ఆకాంక్ష పూరి స్పందిస్తూ.. "మికా, నేను 12 సంవత్సరాలుగా ఒకరికొకరం తెలుసు. అతను నా కుటుంబ సభ్యుడిలాంటివాడు. అతను నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. మా మాధ్య చాలా బలమైన బంధం ఉంది. అయితే మేం నిశ్చితార్థం చేసుకున్నామంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. మాకు అలాంటి ప్రణాళికలు లేవు. అభిమానులు మేం కలిసి ఉండాలని కోరుకుంటారు. కానీ క్షమించండి.. అలా జరగదు’’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment