బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)ను సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి అతడి ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌పై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపదలో ఆదుకున్న నీకు ఏమిచ్చినా తక్కువే అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇప్పటికే సైఫ్ సదరు ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను కలిసి అతడికి కృతజ్ఞతలు తెలిపాడు. రూ.50 వేల నగదును బహుమానంగా ఇచ్చాడు. అలాగే ముంబైకి చెందిన ఓ సంస్థ కూడా రానాకు రూ.11 వేల రివార్డు అందించింది.
రూ.1 లక్ష సాయం ప్రకటించిన సింగర్
తాజాగా సింగర్ మికా సింగ్.. ఆటో డ్రైవర్‌కు రూ.1 లక్ష సాయం ప్రకటించాడు. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టాడు. ఇండియా ఫేవరెట్ సూపర్‌స్టార్‌ను కాపాడిన అతడికి కనీసం రూ.11 లక్షలైనా రివార్డుగా ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సమయానికి హీరోలా వచ్చి కాపాడాడు. దయచేసి అతడి వివరాలు ఎవరైనా నాకు తెలియజేస్తారా? అతడు చేసిన మంచి పనికి మెచ్చుకోలుగా రూ.1 లక్ష సాయం చేయాలనుకుంటున్నాను అని పేర్కొన్నాడు.
అతడు రియల్ హీరో
సైఫ్ అర లక్ష సాయం చేశాడని రాసున్న పోస్ట్‌ను షేర్ చేస్తూ.. సైఫ్ భాయ్, దయచేసి అతడికి రూ.11 లక్షలివ్వు. అతడు రియల్ హీరో. ముంబై ఆటోవాలా జిందాబాద్ అని రాసుకొచ్చాడు. కాగా జనవరి 16న సైఫ్ అలీఖాన్ ఇంట్లో ఓ దుండగుడు చొరబడ్డాడు. సైఫ్ చిన్నకుమారుడి జెహ్ దగ్గర అతడిని చూసిన పనిమనిషి గట్టిగా కేకలు వేసింది. ఆ శబ్దం విని కిందకు వచ్చిన సైఫ్.. దుండగుడిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో అతడు తన దగ్గరున్న కత్తితో నటుడిని పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.
(చదవండి: రామ్‌గోపాల్‌వర్మకు మూడు నెలల జైలు శిక్ష)
ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్
తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న సైఫ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమయానికి కారు కూడా అందుబాటులో లేదు. దీంతో అతడు నడుచుకుంటూ రోడ్డు మీదకు రాగా ఓ ఆటో డ్రైవర్ అతడిని చూసి హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో సైఫ్‌కు చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పింది. సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలవగా వెన్నెముక దగ్గర 2.5 అంగుళాల కత్తిమొనను వైద్యులు సర్జరీ చేసి తొలగించారు.
నిందితుడి అరెస్ట్
నటుడిపై దాడి చేసిన నిందితుడిని ముంబై పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. అతడిని బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాం షెహజాద్ మొహమ్మద్ రోహిల్లా అమీన్ ఫకీర్‌గా గుర్తించారు. భారత్‌కు వచ్చాక బిజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment