అలహాబాద్: మీర్జాపూర్ వెబ్ సిరీస్ రూపకర్తలకు ఊరట లభించింది. నిర్మాతలు ఫర్హాన్ అఖర్, రితేష్ సిధ్వానీలపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను అలహాబాద్ హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. జస్టిస్ ఎంసీ త్రిపాఠి, జస్టిస్ సుభాష్ విద్యార్థిలతో కూడిన బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. దర్శక-రచయితలు కరణ్ అన్షుమాన్, గుర్మీత్ సింగ్, పునీత్ కృష్ణ, వినీత్ కృష్ణలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కూడా హైకోర్టు రద్దు చేసింది.
ఉత్తరప్రదేశ్ ప్రతిష్టకు భంగం కలిగేలా వెబ్ సిరీస్ రూపొందించారని ఆరోపిస్తూ కొత్వాలి దేహత్ పోలీస్ స్టేషన్ (మీర్జాపూర్)లో స్థానిక జర్నలిస్ట్ అరవింద్ చతుర్వేది జనవరి, 17న ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 295-ఏ, 504, 505, 34, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 67-ఏ కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వెబ్ సిరీస్‌లో మీర్జాపూర్ పట్టణాన్ని చెడుగా చిత్రీకరించి మత, సామాజిక, ప్రాంతీయ మనోభావాలను దెబ్బతీశారని పిటిషనర్ ఆరోపించారు.
తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ముందుగా నిర్మాతలు కోర్టు ఆశ్రయించారు. తర్వాత దర్శక-రచయితలు కూడా న్యాయస్థానం తలుపు తట్టారు. జనవరి, ఫిబ్రవరిలో వీరిని అరెస్ట్ చేయకుండా కోర్టు ఆదేశిలిచ్చింది. మీర్జాపూర్ వెబ్ సిరీస్ పూర్తిగా కల్పితమని, అన్ని మతాలను తాము గౌరవిస్తామని అంతకుముందు ఉన్నత న్యాయస్థానానికి వీరు విన్నవించుకున్నారు. వీరి వాదనలను పరిగణనలోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్‌లను కోర్టు రద్దు చేసింది. (చదవండి: సినిమా చూసేందుకు ఆటోలో వచ్చిన స్టార్ హీరోయిన్)
అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో విడుదలైన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌కు వీక్షకుల నుంచి ఆదరణ లభించింది. ఇప్పటికే రెండు సిరీస్‌లు విడుదలయ్యాయి. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజాల్, దివ్యేందు శర్మ, కుల్‌భూషణ్ ఖర్బందా, రసికా దుగల్, శ్వేతా త్రిపాఠి, ప్రమోద్ పాఠక్, హర్షిత గౌర్, షాజీ చౌదరి తదితరులు నటించారు. ఇదిలావుంటే మూడో మీర్జాపూర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కోసం వీక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (చదవండి: మీ మగబుద్ధే వంకరబుద్ధి అంటున్న సమంత!)
Comments
Please login to add a commentAdd a comment