టైటిల్: మిస్టేక్
నటీనటులు: అభినవ్ సర్దార్, అజయ్ కతుర్‌వర్, సుజిత్, తేజ ఐనంపూడి, కరిష్మా కుమార్, తానియా కల్రా, ప్రియా పాల్ తదితరులు
నిర్మాణ సంస్థ: ఏఎస్‌పీ మీడియా హౌస్
నిర్మాత: అభినవ్ సర్దార్
స్టోరి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్ కొమ్మాలపాటి
సంగీతం: మణి జెన్నా
సినిమాటోగ్రాఫర్: హరి జాస్తి
ఎడిటర్:విజయ్ ముక్తావరపు
విడుదల తేది: ఆగస్ట్ 4, 2023
‘మిస్టేక్’ కథేంటంటే..
హెయిర్ స్టైలీష్ ఆగస్త్య(అజయ్ కతుర్‌వర్) , పూజారి మహదేవ్ శర్మ అలియాస్ దేవ్(సుజిత్ కుమార్), కార్తీక్(తేజ ఐనంపూడి) ముగ్గురు స్నేహితులు. ఒకే గదిలో కలిసి ఉంటారు. ఈ ముగ్గురికి లవర్స్ ఉంటారు. హెయిర్ స్టైలీష్ ఆగస్త్య.. ఏసీపీ కూతురు మిత్ర(ప్రియా)ను ప్రేమిస్తాడు. పూజారి దేవ్, పార్వతి అలియాస్ పారు(నయన్ సారికా) అనే యువతితో ప్రేమలో ఉంటే, ముంబైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిణి స్వీటీ(తనియా కార్లా)ని కార్తీక్ లవ్ చేస్తాడు.
ఈ ముగ్గురికి నగరంలో వేరు వేరు కారణాల వల్ల ప్రాణహానీ ఉందని భావిస్తారు. దీంతో ఒక వారం పాటు సిటీకి దూరంగా వెళ్లాలనుకుంటారు. తమ లవర్స్‌తో కలిసి ఫారెస్ట్ ట్రిప్ వేస్తారు. ఇందుకుగాను కార్తీక్ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసి అందరికి డ్రెస్సులు తీసుకుంటాడు. అంతా కలిసి జీపులో ఫారెస్ట్‌కి వెళ్తుంటే మార్గ మధ్యలో ఓ రౌడీ(అభినవ్ సర్దార్) వీరిపై అటాక్ చేస్తాడు. అతని నుంచి తప్పించుకున్న ఈ మూడు జంటలు అడవిలోకి వెళ్లిపోతారు. అడవిలో వీరికి ఎదురైన సమస్యలేంటి? అసలు ఆ రౌడీ వీరికి ఎందుకు అటాక్ చేశాడు? అతన్ని ఎవరు పంపించారు? ఈ మూడు జంటలు చేసిన మిస్టేక్ ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే మిస్టేక్ మూవీ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఓ చిన్న పొరపాటు వల్ల మూడు జంటలు పడిన బాధలేంటి? చివరకు వారు చేసిన మిస్టేక్ ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చింది అనేదే ఈ సినిమా కథ. దర్శకుడు భరత్ కొమ్మాలపాటి ఓ చిన్న పాయింట్‌ని కథగా మలిచి, రెండు గంటల పాటు ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపించడం హైలైట్ పాయింట్. సినిమా కామెడీగా సాగుతూనే మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఉత్కంఠకు గురి చేస్తాయి. అయితే సస్పెన్స్ అంశాలు, ట్విస్టులలో కొత్తదనం ఉండదు. గతంలో చాలా సినిమాల్లో చూసిన ట్వీస్టులు ఇందులో చూపించారు. సస్పెన్స్ అంశాలను మరింత బలంగా రాసుకోవాల్సింది.
సినిమా మొత్తం మూడు జంటలు, ఓ విలన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. ఎక్కువ భాగం అడవిలోనే సాగుతుంది. ఫస్టాఫ్‌లో మూడు జంటల ప్రేమ కథ, వారికి వచ్చిన సమస్యలు, దాని నుంచి తప్పించుకునేందుకు వారు వేసిన ప్లాన్.. ఈ క్రమంలో వారు చేసే పనులు అన్ని సరదాగా సాగుతూ వినోదాన్ని పంచుతాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలు ఉత్కంఠభరితంగాను సాగుతాయి.
మూడు జంటలకు అడవిలో మరుగుజ్జు జాతి ప్రజలతో కలిసి చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని బోల్డ్ సన్నివేశాలు, డైలాగులు ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ద్వితియార్థంలో మాత్రం థ్రిల్లింగ్‌గా సాగినప్పటికీ కాస్త బోర్ కొడుతుంది. ఇంటర్వెల్ ముందే ట్విస్ట్‌ని రివీల్ చేయడం.. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా అర్థమైపోతుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. కథను మరింత బలంగా రాసుకొని, సెకండాఫ్‌ని ఆసక్తికరంగా నడిపించి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
అభినవ్ సర్దార్ నెగిటివ్ రోల్ లో మెప్పించాడు. భయంకరమైన లుక్స్‌లో కనిపిస్తూ యాక్షన్స్ సీన్స్ అదరగొట్టేశాడు. ఇక మూడు ప్రేమ జంటలు అగస్త్య(అజయ్)- మిత్ర(ప్రియా),దేవ్(సుజిత్ కుమార్)-పార్వతి(నయన్ సారికా), కార్తిక్(తేజ ఐనంపూడి)-స్వీటి(తనియా కార్లా) తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పూజారి దేవ్ పాత్ర నవ్వులు పూయిస్తుంది. ఇక ముగ్గురు హీరోయిన్లు నటన పరంగానే కాదు గ్లామర్‌తోను మెప్పించారు. రాజా రవీంద్ర, సమీర్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సంగీతం పర్వాలేదు. మంగ్లీ పాడిన పాట మినహా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రాఫర్ హరి జాస్తి పనితీరు బాగుంది. ఎడిటర్ విజయ్ ముక్తావరపు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment