![Movie Producer Petition Filed 25 Cr On Udhayanidhi Stalin](/styles/webp/s3/article_images/2024/10/23/udaynidhi-stalin.jpg.webp?itok=dHODsOns)
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తమకు రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని చిత్ర నిర్మాత కోర్టుకు వెళ్లారు. ఒకప్పుడు పాపులర్ హీరోగా కోలీవుడ్‌లో అనేక చిత్రాల్లో నటించిన ఆయన గతేడాదిలో 'మామన్నన్' సినిమానే తన చివరి ప్రాజెక్ట్ అని ప్రకటించారు. ఆ తర్వాత తమిళనాడు పాలిటిక్స్‌లో ఆయన బిజీ అయిపోయారు. ఈ క్రమంలో ఉదయనిధి స్టాలిన్ అప్పటికే ఒప్పుకున్న ఒక సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో ఆయన నష్టపరిహారం కట్టించాలని ఆ చిత్ర నిర్మాత రామశరవణన్ కోర్టుకు వెళ్లారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_135.jpg)
'మామన్నన్' సినిమా కంటే ముందే 'ఏంజెల్' అనే చిత్రాన్ని ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, ఆనంది కథానాయికలు. 2018లో ప్రారంభమైన ఈ మూవీని కేఎస్.అదయమాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయ్యింది. మరో 20 శాతం చిత్రీకరణ చేయాల్సి ఉంది. ఈ సినిమా కోసం నిర్మాత రూ.13 కోట్లకు పైగా ఖర్చు పెట్టాడని తెలుస్తోంది. అయితే.. అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల పాటు ఆలస్యం అయ్యింది. ఇంతలో 'మామన్నన్' తన చివరి చిత్రమని ఉదయనిధి స్టాలిన్ ప్రకటించడంతో ఆ ప్రాజెక్ట్ అక్కడే ఆగిపోయింది. దీంతో తను భారీగా నష్టపోయానని అందుకుగాను తనకు నష్టపరిహారంగా రూ. 25 కోట్లు ఉదయనిధి స్టాలిన్ చెల్లించేలా కోర్టు ఆదేశించాలని పిటీషన్‌లో నిర్మాత రామశరవణన్ పేర్కొన్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/2_52.jpg)
ఏంజెల్ చిత్ర నిర్మాత వేసిన పిటీషన్‌ను కొట్టివేయాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తరపున మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో జస్టిస్ డీకారామన్ ముందుకు తాజాగా ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. మొదట నిర్మాత తరపున న్యాయవాది తియాగేశ్వరన్ వాదనలు వినిపిస్తూ.. 'ఏంజెల్' చిత్రానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ ఎనిమిది రోజులు షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉందని పేర్కొన్నారు. ఆయన సహకరించకపోవడం వల్ల సినిమా ఆగిపోయిందన్నారు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థకు భారీగా నష్టం వస్తుందని పేర్కొన్నారు.
అయితే, ఉదయనిధి స్టాలిన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ఎన్ఆర్ ఇళంగో మాట్లాడుతూ.. ఏంజెల్ చిత్రానికి సంబంధించి ఉదయనిధి పలుమార్లు చిత నిర్మాతను సంప్రదించారని, సినిమాలో తన సన్నివేశాలు పూర్తి అయ్యాయని చెప్పిన తర్వాతే మామన్నన్‌లో నటించారని తెలిపారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి డీకారామన్.. అక్టోబర్ 28న తుది తీర్పు వెళ్లడిస్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment