నటుడు అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం విడాముయర్చి. లైకా పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మగిల్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో అజిత్ తన తర్వాత చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇటీవల విడుదలైన మార్క్ ఆంటోని చిత్రం ఫేమ్ ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. దీన్ని ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మించనున్నట్లు సమాచారం.
ఇందులో అజిత్ సరసన నటి మృణాల్ ఠాకూర్ నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగులో వరుస హిట్లతో క్రేజీ కథానాయకిగా ఈమెకు ఇప్పుడు అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇటీవల నటుడు శివకార్తికేయన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించనుందని ప్రచారం జోరుగా సాగింది. ఆమె కాల్‌షీట్స్ కోసం ఆ చిత్ర యూనిట్ గట్టిగానే ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు.
అదేవిధంగా శింబు కథానాయకుడిగా కమలహాసన్ నిర్మిస్తున్న చిత్రంలోనూ కథానాయకిగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. దీంతో ఈ అమ్మడు అజిత్‌కు జై కొడుతుందో, శింబుకు సై అంటుందోనన్న ఆసక్తి కోలీవుడ్లో నెలకొంది. అజిత్ చిత్రం యూనిట్ వేరే ఆప్షన్ కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. మృణాల్ ఠాకూర్ కాల్‌షీట్స్ కుదరకపోతే బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నటింపజేయడానికి చర్చలు జరుపుతున్నట్లు టాక్ వైరల్ అవుతోంది .ఈ భామ ఇప్పటికే కంగువ చిత్రంలో సూర్యకు జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment