ముంబై: క్రూయిజ్ షిప్ డ్రగ్స్ పార్టీ కేసులో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌కు స్థానిక కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన మేజిస్ట్రేట్ కోర్టు అతడితోపాటు మరో ఇద్దరికి ఈ నెల 7వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో కీలకమైన తదుపరి విచారణకు వీరిని ప్రశ్నించడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ఆదివారం ఆర్యన్ ఖాన్ మరో ఇద్దరికి విధించిన ఒక్క రోజు కస్టడీ గడువు ముగియడంతో సోమవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచారు.
ఆదివారం అరెస్ట్ చేసిన మరో ఆరుగురికి కూడా అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్‌ఎం నెర్లికర్ ఈనెల 7వ తేదీ వరకు ఎన్‌సీబీ కస్టడీకి అనుమతించారు. ‘సహనిందితుల వద్ద కూడా డ్రగ్స్ ఉన్నట్లు తేలింది. నిందితులు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమేచాతో వీరు కలిసే ఉన్నారు. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తునకు నిందితులను విచారించాల్సిన అవసరం ఉంది. వీరు తమ నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి కూడా ఇది ఉపయోగ పడుతుంది’ అని మేజిస్ట్రేట్ తన తీర్పులో పేర్కొన్నారు. తీర్పు వెలువరించే సమయంలో ఆర్యన్ ఖాన్ నిబ్బరంగా కనిపించగా.. అర్బాజ్, మున్‌మున్‌లు ఒక్కసారిగా రోదించారు.
ఆర్యన్ ఖాన్ తరఫున లాయర్ సతీశ్ మానెషిండే తన వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదనీ, అతడి వద్ద ఎలాంటి డ్రగ్స్ లభ్యం కాలేదని తెలిపారు. ఎన్‌సీబీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ దందాతో సంబంధమున్న ఈ కేసులో వివరాలను రాబట్టాలంటే నిందితులను విచారించాల్సిన అవసరం ఉందని ఎన్‌సీబీ లాయర్ వాదించారు. వారిని ఈనెల 11వ తేదీ వరకు, వారంపాటు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరారు.
శనివారం రాత్రి ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్‌పై ఎన్‌సీబీ అధికారులు మెరుపుదాడి జరిపి పలు రకాల నిషేధిత డ్రగ్స్‌తోపాటు ఆర్యన్ ఖాన్ తదితరులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, క్రూయిజ్ షిప్ సోమవారం తీరానికి చేరుకోవడంతో ఎన్‌సీబీ అధికారులు దాదాపు 6 గంటలపాటు అణువణువూ శోధించారు. ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కొన్ని అనుమానిత డ్రగ్స్ కూడా లభించాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment