సాక్షి, ముంబై: ప్రముఖ సంగీత దర్శకుడు నరేంద్ర భిడే (47) గుండెపోటుతో కన్నుమూశారు. గురువారం ఉదయం పూణేలోని ఆయన నివాసంలో తుది శ్వాస తీసుకున్నారని నరేంద్ర కుటుంబ సభ్యులు తెలిపారు. నరేంద్ర హఠాన్మరణంపై మరాఠీ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన లేని లోటు తీరనిదంటూ సంతాపం ప్రకటించింది.
వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ అయిన నరేంద్ర, మరాఠీ చిత్ర పరిశ్రమలో గొప్ప మ్యూజిక్ డైరెక్టరుగా ఎదిగారు. పిల్లలనుంచి పెద్దల దాకా అన్ని వయసుల వారిలో తన సంగీతంతో పాపులర్ అయ్యారు. ‘ఏ పేయింగ్ గోస్ట్’ (2015) లాంటి నాటకాలతోపాటు, డియోల్ బ్యాండ్ (2015), బయోస్కోప్ (2015), ఉబూన్ టు (2017) పుష్పక్ విమాన్, హరిశ్చంద్ర ఫ్యాక్టరీ, సానే గురూజీ, సరివర్ సారీ, ముల్షీ పాట్రన్ వంటి చిత్రాలకు సంగీతం అందించారు. పూణేకు చెందిన స్టూడియో డాన్ ఇన్ఫోటైన్‌మెంట్‌లో డైరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాదు అనేక నాటకాలు, సీరియల్స్, సినిమాలు, జింగిల్స్ ద్వారా సంగీత పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. అలాగే జీ గౌరవ్ (ఐదుసార్లు), సహ్యాద్రి సినీ అవార్డు, స్టేట్ డ్రామా అవార్డు (రెండుసార్లు), వి శాంతారామ్ అవార్డు, శ్రీకాంత్ ఠాక్రే అవార్డు, ఎం.ఎ. ఆనర్స్, స్టేట్ ఫిల్మ్ అవార్డలును ఆయన దక్కించుకున్నారు. నరేంద్ర భిడేకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరేంద్ర అకాలమరణం సంగీత పరిశ్రమకు తీరని నష్టమని నటుడు ఓంకర్ తట్టే సంతాపం తెలిపారు. భిడేతో కలిసి ఒక శాస్త్రీయ పాటను రికార్డ్ చేయడానికి ఎదురుచూస్తున్నామని, కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదాపడిందని చిత్రనిర్మాత సాగర్ వంజారీ గుర్తు చేసుకున్నారు. ఇక ఎప్పటికీ ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు ఉండదంటూ వంజారీ విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment