
ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్(68) ఇక లేరు. ఆదివారం నాడు హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణంపై చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా సోమవారం ఉదయం రాజ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు నుంచి మహాప్రస్థానం వరకు ఈ అంతిమయాత్ర కొనసాగింది. మహా ప్రస్థానంలో కోటి ,శివాజిరాజా , కాశీ విశ్వనాథ్ , జయంత్ , నల్లమల్లపు బుజ్జి తదితరులు రాజ్ మృతదేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. కాసేపటి క్రితమే మహాప్రస్థానంలో రాజ్ అంత్యక్రియలు ముగిశాయి. రాజ్ పెద్దల్లుడు కృష్ణంరాజు ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
రాజ్ సినీప్రస్థానం మొదలైందిలా..
రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు, సావిత్రి దంపతుల రెండో సంతానమే రాజ్. 1954 జూలై 7న జన్మించారు. చిన్నప్పటి నుంచి సినీ వాతావరణంలో, ముఖ్యంగా సంగీత నేపథ్యంలో పెరగడంతో రాజ్‌కు సంగీతంపై ఓ అవగాహన ఉండేది. చిన్నప్పటి నుంచే తండ్రి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఓవైపు ఇంటర్ చదువుతూ మరోవైపు ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి హనుమంతరావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు.
అ సమయంలో తన తండ్రి మరణించడంతో కొద్దిరోజులు ఏం చేయకుండా ఉండిపోయిన రాజ్ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌పీ కోదండపాణి వద్ద అసిస్టెంట్‌గా చేరారు. ఓ ఏడాది అవగానే సాలూరి రాజేశ్వరరావు వద్ద అసిస్టెంట్‌గా చేరి ఆరేళ్లు పని చేశారు. సాలూరి రాజేశ్వరరావు కుమారుల్లో ఒకరైన కోటితో రాజ్‌కు మంచి స్నేహం ఏర్పడింది. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలకు సంగీతం అందించి రాజ్-కోటి ద్వయంగా పేరు తెచ్చుకున్నారు.. సోలో మ్యూజిక్ డైరెక్టర్‌గానూ రాజ్ పలు చిత్రాలకు పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment