maha prasthanam
-
మహాప్రస్థానంలో సంగీత దర్శకుడు రాజ్ అంత్యక్రియలు
ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్(68) ఇక లేరు. ఆదివారం నాడు హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణంపై చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా సోమవారం ఉదయం రాజ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి మహాప్రస్థానం వరకు ఈ అంతిమయాత్ర కొనసాగింది. మహా ప్రస్థానంలో కోటి ,శివాజిరాజా , కాశీ విశ్వనాథ్ , జయంత్ , నల్లమల్లపు బుజ్జి తదితరులు రాజ్ మృతదేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. కాసేపటి క్రితమే మహాప్రస్థానంలో రాజ్ అంత్యక్రియలు ముగిశాయి. రాజ్ పెద్దల్లుడు కృష్ణంరాజు ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రాజ్ సినీప్రస్థానం మొదలైందిలా.. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు, సావిత్రి దంపతుల రెండో సంతానమే రాజ్. 1954 జూలై 7న జన్మించారు. చిన్నప్పటి నుంచి సినీ వాతావరణంలో, ముఖ్యంగా సంగీత నేపథ్యంలో పెరగడంతో రాజ్‌కు సంగీతంపై ఓ అవగాహన ఉండేది. చిన్నప్పటి నుంచే తండ్రి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఓవైపు ఇంటర్ చదువుతూ మరోవైపు ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి హనుమంతరావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు. అ సమయంలో తన తండ్రి మరణించడంతో కొద్దిరోజులు ఏం చేయకుండా ఉండిపోయిన రాజ్ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి వద్ద అసిస్టెంట్‌గా చేరారు. ఓ ఏడాది అవగానే సాలూరి రాజేశ్వరరావు వద్ద అసిస్టెంట్‌గా చేరి ఆరేళ్లు పని చేశారు. సాలూరి రాజేశ్వరరావు కుమారుల్లో ఒకరైన కోటితో రాజ్‌కు మంచి స్నేహం ఏర్పడింది. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలకు సంగీతం అందించి రాజ్-కోటి ద్వయంగా పేరు తెచ్చుకున్నారు.. సోలో మ్యూజిక్ డైరెక్టర్‌గానూ రాజ్ పలు చిత్రాలకు పని చేశారు. చదవండి: మమ్మల్ని కాలమే కలిపింది, కాలమే విడదీసింది: కోటి -
బాలయ్య పెట్టిన ముహూర్తానికే తారకరత్న అంత్యక్రియలు
►జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు ► మహాప్రస్థానంలో అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డి, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ► తారకరత్న వెంటే వైకుంఠ రథంలో మహాప్రస్థానానికి వచ్చిన బాలకృష్ణ, చంద్రబాబునాయుడు ► ఫిల్మ్ చాంబర్ నుంచి మహా ప్రస్థానానికి అంతిమ యాత్ర ► తండ్రి మోహన కృష్ణ చేతుల మీదుగా తారకరత్న అంతిమ సంస్కారాలు ► పాడె మోసిన బాలకృష్ణ, మిగతా కుటుంబసభ్యులు ► కన్నీరుమున్నీరవుతున్న నందమూరి కుటుంబసభ్యులు తారకరత్న మృతితో నందమూరి కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే తారకరత్న అకాల మరణం చెందడాన్ని కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అజాత శత్రువుగా, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా తారకరత్నకు పేరుంది. దీంతో ఆయన్ను కడసారి చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకొని తారకరత్నకు నివాళులు అర్పించారు. బాలకృష్ణ నిర్ణయించిన ముహూర్తం మేరకు మధ్యాహ్నం 3.30గంటల తర్వాత తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఫిల్మ్ చాంబర్ నుంచి అంతిమ యాత్ర ప్రారంభమయ్యింది. మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. తారకరత్నకు ఆయన తండ్రి మోహన్ కృష్ణ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ముగిసిన చలపతిరావు అంత్యక్రియలు
నటుడు చలపతిరావు అంత్యక్రియలు మహా ప్రస్థానంలో పూర్తయ్యాయి. కుమారుడు రవిబాబు చలపతిరావు కు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.కుటుంబ సభ్యులతో పాటు హీరో మంచు మనోజ్, నిర్మాత సురేష్ బాబు, నిర్మాత దామోదర ప్రసాద్, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, దర్శకుడు శ్రీవాస్, నటుడు గౌతమ్ రాజు మరియు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈనెల 24 గుండెపోటుతో చలపతి రావు మృతి చెందిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న కుమార్తెలు రాక ఆలస్యం కావడంతో చలపతిరావు భౌతికకాయాన్ని మహాప్రస్థానంలోని ఫ్రిజర్ బాక్స్ ఉంచారు. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు రవిబాబు చలపతిరావు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దాదాపు 1200 పైగా చిత్రాల్లో పలు రకాల పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు చలపతిరావు. -
తండ్రి అంత్యక్రియల విషయంలో మహేశ్‌బాబు తప్పు చేశాడా?
సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియల విషయంలో మహేశ్‌బాబు తీసుకున్న నిర్ణయంపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ అభిమానులతో పాటు టాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులు మహేశ్ బాబు తీరును తప్పుబడుతున్నారు. ఈ విమర్శలకు కారణం.. తన తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియలను ‘మహాప్రస్థానం’లో నిర్వహించడమే. ఈ విషయంలో మహేశ్‌బాబు తన కుటుంబ సభ్యుల మాట వినకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన తండ్రి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా, స్మారక చిహ్నం నిర్మించే విధంగా ప్రైవేట్ స్థలంలో దహనసంస్కారాలు చేయాలని మహేశ్ ఎందుకు ఆలోచించలేదని కృష్ణ ఫ్యాన్స్ అంటున్నారు. సోసైటీలో ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు మరణిస్తే.. వాళ్ల అంత్య క్రియలు వారి ప్రైవేట్ స్థలంలో నిర్వహిస్తుంటారు. ఇటీవల రెబల్‌స్టార్ కృష్ణ మరణిస్తే.. ఆయన పాంహౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు దహన సంస్కారాలను అన్నపూర్ణ స్డూడియోలో నిర్వహించారు. ఎన్టీఆర్ మరణించినప్పుడు ప్రభుత్వ స్థలంలో అంత్యక్రియలు నిర్వహించి, ఎన్టీఆర్ ఘాట్‌ని ఏర్పాటు చేశారు. కృష్ణ సతీమణి విజయనిర్మలకు గుర్తుగా ఆమె కుమారుడు నరేశ్ స్మారక మందిరం కట్టించిన సంగతి తెలిసిందే. కృష్ణ అంత్యక్రియలను కూడా పద్మాలయ స్టూడియోస్‌లో నిర్వహించి, స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తే గొప్పగా ఉండేదని కృష్ణ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే మరికొంతమంది మాత్రం మహేశ్ నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ ఏడాదిలో మరణించిన కృష్ణ సోదరుడు రమేశ్ బాబు, తల్లి ఇందిరా దేవిల అంత్యక్రియలు కూడా మహా ప్రస్థానంలోనే జరిగాయని.. అందుకే తండ్రి దహనసంస్కారాలు కూడా అక్కడే నిర్వహించాడేమోనని అంటున్నారు. అయితే తండ్రి కృష్ణ విషయంలో మహేశ్ బాబు ఆలోచన మాత్రం మరోలా ఉంది. కృష్ణ కోసం స్మారక చిహ్నం కాకుండా ఒక మెమోరియల్ ఏర్పాటుకి మహేశ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పద్మాలయ స్టూడియో వద్ద ఈ మెమోరియల్‌ను నిర్మించాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్టు తెలుస్తోంది. -
మహాప్రస్థానంలో ముగిసిన రమేశ్ బాబు అంత్యక్రియలు
Ramesh Babu Last Rites Performed In Maha Prasthanam: సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు (56)అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ చితికి నిప్పు పెట్టి తుది వీడ్కోలు పలికారు. కోవిడ్ నిబంధనలతో అతికొద్దిమందితో అంత్యక్రియలు పూర్తి చేశారు. నటుడు నరేష్, తమ్మారెడ్డి భరద్వాజ సహా కొందరు సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కోవిడ్ కారణంగా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న మహేశ్ బాబు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు.కాగా కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అశ్రునయనాల మధ్య నాయిని అంత్యక్రియలు
-
కార్మిక నేతకు తుది వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియ లు గురువారం మధ్యాహ్నం ఫిలింనగర్ మహాప్రస్థానంలో ముగిశాయి. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో నాయి ని మృతి చెందినట్లుగా అపోలో ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న బంధుమిత్రులు, అభిమానులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకొని నాయిని కుటుంబసభ్యులను పరామర్శించారు. తెల్లవారుజామున 5.50 గంటల ప్రాంతంలో ఆయన పార్థివదేహాన్ని ఆస్పత్రి నుంచి బంజారాహి ల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లోని నాయిని నివాసానికి తరలించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు ఇంటి వద్ద కడ సారి చూపుకోసం వేచి ఉన్నారు. నాయిని భౌతికకాయాన్ని సందర్శించిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు మహమూద్‌అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథో డ్, ఎంపీ కే.కేశవరావు, ఎమ్మెల్యే లు దానం నాగేందర్, జీవన్‌రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, సీపీ అంజనీకుమార్, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తదితరులు ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మినిస్టర్ క్వార్టర్స్ నుంచి నాయిని అం తిమ యాత్ర ప్రారంభమైంది. మహాప్రస్థానంలో నాయిని పార్థివదేహాన్ని సందర్శించిన మంత్రి కేటీఆర్.. పాడె కూడా మోశారు. అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. నాయిని చితికి కుమారుడు దేవేందర్‌రెడ్డి నిప్పంటించారు. ఆస్పత్రి నుంచి భార్య.. నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాయినితో పాటు ఆమె కూడా ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అపోలో ఆస్పత్రి వైద్య సిబ్బంది అంబులెన్స్‌లో ఆమె ను మినిస్టర్ క్వార్టర్స్‌కు తీసుకురాగా భర్త భౌతిక కాయాన్ని చూసి రోదించారు. అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి, కూతురు సమతారెడ్డి నాయిని మృతదేహం వద్ద కన్నీరుమున్నీరయ్యారు. కార్మిక సమస్యల పరిష్కారంలో నాయిని కృషి చిరస్మరణీయం న్యూఢిల్లీ/హైదరాబాద్: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల పలువు రు ప్రముఖులు సంతాపం తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘‘స్నేహశీలి నాయిని ఆ త్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. సోషలిస్టు ఉద్యమంతో రాజకీయాల్లోకి వచ్చిన నర్సింహారెడ్డి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కార్మిక సమస్యల పరిష్కారానికి చేసిన కృషి చిరస్మరణీయం’’అని వెంకయ్య తన సందేశంలో పేర్కొన్నారు. పలువురి సంతాపం నాయిని నర్సింహారెడ్డి మృతికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్, మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, జగదీశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రణా ళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీ యాధ్యక్షుడు కె.లక్ష్మణ్, కాంగ్రెస్ఎంపీ కోమ టి రెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వినో ద్, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లు రవి, అధికార ప్రతినిధి జి.నిరంజన్, ఏఐసీసీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, సీపీఐ నేతలు సురవరం సుధాకరరెడ్డి, కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, డీజీ నరసింహారావు, ప్రొఫెసర్ కోదండరామ్, జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అలుగు బెల్లి నర్సిరెడ్డి, టీఎన్జీఓ యూనియన్ మాజీ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, మరో నేత కారం రవీందర్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. కాగా, నాయిని పార్థివదేహానికి డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి నివాళులు అర్పించారు. హాం మంత్రిగా ఉన్నప్పుడు నాయిని పోలీసుశాఖకు ఎన్నో సేవలు చేశారని డీజీపీ గుర్తు చేసుకున్నారు. ప్రతీక్షణం తెలంగాణ కోసం .. నాయిని తన జీవితంలో ప్రతీక్షణం తెలంగాణ కోసం శ్రమించారు. రాష్ట్ర సాధన, అభివృద్ధిలో ఆయన కృషి మరువలేనిది. నాయిని మృతితో తెలంగాణ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది – గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మరచిపోలేని అనుబంధం నాయిని మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. తెలంగాణ ఉద్యమం, టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంలో నాయినితో కలిసి పనిచేసిన అనుబంధం మరచిపోలేనిది. ఆయన కుటుంబ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం. – సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి నాయిని మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయిని మరణం అత్యంత బాధాకరం అని గురువారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. నాయిని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయిని ఓ గొప్ప కార్మిక నాయకుడని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. జననాయకుడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నిలిచిన జన నాయకుడు. కార్మిక పక్షపాతిగా, తెలంగాణ తొలి హోం మంత్రిగా మనందరి మనసులో నాయిని నర్సింహారెడ్డి చిరస్థాయిగా నిలచిపోతారు. – మంత్రి కేటీ రామారావు. -
నాయిని అంత్యక్రియలు: పాడె మోసిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్న్‌నగర్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనలతో గురువారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మీయ నేతకు కడసారి కన్నీటి వీడ్కోలు పడలికేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు హాజరైన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్.. పాడె మోసి నివాళి అర్పించారు. అంత్యక్రియల్లో మంత్రులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు నేతలు పాల్గొన్నారు. కరోనా అనంతరం అనారోగ్యం పాలైన నాయిని.. బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. -
ఆవేశం ఆయుధమైతే...
‘గుండె కన్నీరైతే.. ఆవేశం ఆయుధమైతే.. ఆ కత్తి రాసే రుధిర కావ్యమే ఈ మహాప్రస్థానం’ అంటూ భావోద్వేగం నిండిన వాయిస్ ఓవర్‌తో విడుదలైన ‘మహాప్రస్థానం’ మోషన్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. తనీష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మహాప్రస్థానం’. ‘ద జర్నీ ఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్’ అనేది ఉపశీర్షిక. జాని దర్శకత్వం వహించారు. ముస్కాన్ సేథీ కథానాయిక. ‘వరుడు’ ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవికి విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం డైరెక్టర్ జాని మాట్లాడుతూ– ‘‘తనీష్ పాత్రలోని ఇంటెన్సిటీని ప్రేక్షకులు కొత్తగా ఫీలవుతారు. కిల్లర్‌గా తన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. కథలోని బలం మా అందరికీ ఇంత ఎనర్జీని ఇచ్చి పనిచేసేలా చేస్తోంది. ఇదొక అసాధారణ సినిమా అని చెప్పాలనే కొత్తగా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ చేయించాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: ఎంఎన్ బాల్ రెడ్డి. -
అందరూ నేరస్తులే
తనీష్, ముస్కాన్ సేథీ జంటగా భానుశ్రీ మెహ్రా, రిషికా ఖన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహాప్రస్థానం’. ఓంకారేశ్వర క్రియేషన్స్‌పై దర్శకుడు జాని తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. జాని మాట్లాడుతూ– ‘‘మా సినిమాలో దాదాపు అన్నీ నెగిటివ్ క్యారెక్టర్లే ఉంటాయి. హీరోతో సహా ఇతర పాత్రలు కూడా నేరస్తులే. కొంతమంది నేరస్తుల మధ్య జరిగే ఒక క్రిమినల్ ఎమోషనల్ జర్నీ ఇది. హీరో పాత్ర జీవిత ప్రయాణాన్ని చూపిస్తున్నందున ‘మహాప్రస్థానం’ అని టైటిల్ పెట్టాం. కానీ, ఇందులో శ్రీశ్రీగారి భావజాలం కనిపించదు’’ అన్నారు. ‘‘సమాజంలో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు? అని చెప్పే కథ ఇది. ఏప్రిల్‌లో సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు తనీష్. ‘‘ఇటీవలే నాకు పెళ్లయింది.. అందుకే చిన్న విరామం తీసుకున్నా. చాలాకాలం తర్వాత తెలుగు సినిమాలో నటిస్తున్నా’’ అన్నారు భానుశ్రీ మెహ్రా. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: బాల్ రెడ్డి. -
మహాప్రస్థానం మొదలైంది
తనీష్, ముస్కాన్ సేథీ జంటగా జానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాప్రస్థానం’. ‘జర్నీ ఆఫ్ యాన్ ఎమోషనల్ కిల్లర్’ అనేది ఉపశీర్షిక. ‘వరుడు’ ఫేం భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తనీష్ మాట్లాడుతూ– ‘‘సినిమా సెట్లో నేను అడుగుపెట్టి ఏడాదిన్నర అవుతోంది. కథలు వింటున్నా నచ్చడం లేదు. జానీగారు చెప్పిన ‘మహాప్రస్థానం’ కథ నాలో ఎంతో స్ఫూర్తి నింపింది. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది’’ అన్నారు. ‘‘నేను గతంలో ‘అంతకుమిం చి’ చిత్రాన్ని తెరకెక్కించా. ‘మహాప్రస్థానం’ నా రెండో సినిమా. యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది’’ అన్నారు జాని. శుభాంగీ పంత్, గగన్ విహారి, అమిత్ నటిస్తున్న ఈ చిత్రానికి సం గీతం: సునీల్ కశ్యప్, కెమెరా: బాల్ రెడ్డి. -
పంజగుట్టలో ‘మహాప్రస్థానం’ ఏదీ?
బంజారాహిల్స్: నగరంలో మరిన్ని శ్మశానవాటికలను ‘మహాప్రస్థానాలు’గా తయారు చేయాలని జీహెచ్ఎంసీ సంకల్పించి ఆ మేరకు కొన్ని శ్మశానవాటికలను గుర్తించింది. అందులో ఒకటి షేక్‌పేట మండలం, జీహెచ్ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–18 పరిధి కిందకు వచ్చే బంజారాహిల్స్ రోడ్ నెంబర్–1లో ఉన్న పంజాగుట్ట హిందూ శ్మశానవాటికను గుర్తించారు. 2008 సంవత్సరంలో అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంజాగుట్ట శ్మశానవాటిక అభివృద్ధి కోసం సకల సౌకర్యాలు కల్పించే నిమిత్తం రూ.కోటి మంజూరు చేశారు. ఇందులోనే విద్యుత్ దహనవాటిక నిర్మాణాన్ని కూడా ఇంకో రూ.కోటి వెచ్చించి నిర్మించారు. అయితే దురదృష్టవశాత్తు మహానేత మరణించడంతో శ్మశానవాటిక అభివృద్ధి పథకం మూలన పడింది. నిర్మించిన విద్యుత్ దహనవాటిక ఒక్కరోజు కూడా పనిచేయకుండానే ఉండిపోయింది. తరువాత విద్యుత్ దహన వాటిక శిథిలావస్తకు చేరి గోడలు కూలి, కిటికీలు చోరీకి గురై కొన్నాళ్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ఇప్పుడది ఎందుకూ పనికిరాని బూత్ బంగ్లాగా మారిపోయింది. మళ్లీ ఈ ఫైల్‌ను తెరమీదకు తీసుకొచ్చేవారు కరువయ్యారు. ఫలితంగా కొన్నాళ్ల నుంచి శ్మశానవాటికలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ముందుకొచ్చిన ఫినిక్స్.. 2017లో మరోసారి పంజాగుట్ట శ్మశానవాటికపై జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి పెట్టారు. ఫిలింనగర్లో నిర్మించిన మహా ప్రస్థానం తరహాలోనే ఈ శ్మశానవాటికలో కూడా మరో మహాప్రస్థానాన్ని నిర్మించేందుకు ఫినిక్స్ సంస్థ ముందుకొచ్చింది. జీహెచ్ఎంసీ అధికారులతో జరిగిన చర్చలు ఫలవంతం కాగా ఫినిక్స్ ఇక్కడ రూ.కోటి వ్యయంతో మహాప్రస్థానం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. శ్మశానవాటిక చుట్టూ ప్రహారీ ఒకేఒక గేటును ఏర్పాటు చేసి రాకపోకలకు అనుమతిచ్చే విధంగా సంస్థ ప్రారంభించిన చర్యలు మొదట్లోనే బెడిసికొట్టాయి. పునాదులు తీస్తుండగానే వివాదాలు చుట్టుముట్టాయి. ఇక మహాప్రస్థానం డిజైన్లను రూపొందించి ఓ రోజు ప్రదర్శించారు. అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పనులు కూడా ప్రారంభించారు. సరిగ్గా నాలుగు నెలలు పనులు జరిగాయో లేదో జీహెచ్ఎంసీ అధికారుల నుంచి సహకారం కరువైంది. కొన్ని నిర్మాణాలకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్ఓసీలు కూడా లభించలేదు. ఫినిక్స్ సంస్థ నిర్వాహకులకు అడుగడుగునా చుక్కెదురైంది. దీనికి తోడు కొంతమంది ఈ నిర్మాణాలకు అడ్డుపుల్లలు వేశారు. ఆందోళనలూ కొనసాగించారు. అరికట్టాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు చోద్యం చూశారు. ఫలితంగా ఫినిక్స్ సంస్థ అర్ధాంతరంగా పనులు ఆపేసి చేతులెత్తేసింది. సుమారు రూ.40 లక్షల మేర ఖర్చు పెట్టారు. ఇంకో రెండు నెలల పాటు పనులు జరిగి ఉంటే పంజాగుట్ట శ్మశానవాటిక కాస్తా మహాప్రస్థానం తరహాలోనే రూపుదిద్దుకొని ఉండేది. అడుగడుగునా నిర్లక్ష్యం.. అధికారుల నిర్లక్ష్యమే పంజాగుట్ట శ్మశానవాటికకు శాపంగా మారిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఒకవైపు శ్మశానవాటికలో ఫినిక్స్సంస్థ నిర్మాణ పనులు జరుపుతుంటే ఒక్కసారి కూడా జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం పర్యవేక్షించిన పాపాన పోలేదు. ఈ సంస్థకు అవసరమయ్యే అనుమతులు కూడా ఇవ్వలేని దుస్థితి దాపురించింది. అడ్డుకునేవారిని పిలిచి మాట్లాడాల్సిన అధికారులు ఆ దిశలో ఎలాంటి చొరవ చూపలేదు. నగరంలో మరిన్ని మహాప్రస్థానాలు నిర్మిస్తామని చెప్పిన ఫినిక్స్ సంస్థ ఇప్పుడు ఆ ఆలోచననే విరమించుకునే స్థాయికి అధికారులు తీసుకొచ్చారు. ఆదినుంచీ అడ్డంకులే.. పంజాగుట్ట హిందూ శ్మశానవాటికను అభివృద్ధి చేయాలని ఎప్పుడు ప్రణాళికలు రూపొందించినా అవి విఫలమవుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్ ఉంటే ఈ శ్మశానవాటిక అన్ని హంగులతో రూపుదిద్దుకొని ఉండేది. దురదృష్టవశాత్తు ఆయన మరణం కూడా ఈ శ్మశానవాటికకు శాపమైంది. ఆయన తర్వాత వచ్చిన పాలకులు ఈ ఫైల్‌ను పట్టించుకోలేదు. కనీసం తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఫినిక్స్ అనే సంస్థ అభివృద్ధికి ముందుకు వచ్చినా పాలకులు అంతగా ప్రోత్సహించలేదు. మరోసారి అర్ధాంతరపనులు అధికార యంత్రాంగ నిర్లక్ష్యానికి నిలువెత్తు దర్పణంగా నిలుస్తున్నాయి. -
జస్టిస్ కె.రామస్వామి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.రామస్వామి (87) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్యా ముగ్గరు పిల్లలున్నారు. భార్య శ్యామలాదేవి గతంలోనే కన్నుమూశారు. కుమారుడు శ్రీనివాస్ కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. మొదటి కుమార్తె జ్యోతి న్యూయార్క్‌లో ఎస్బీఐ ఏజీఎంగా... రెండో కుమార్తె జయ ఉస్మానియాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. న్యూయార్క్‌లో ఉన్న కుమార్తె గురువారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకునే అవకాశముంది. శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్ రామస్వామి అంత్యక్రియలు జరగనున్నాయి. న్యాయవర్గాల్లో జస్టిస్ రామస్వామికి ఎంతో గొప్ప పేరుంది. న్యాయమూర్తుల సంతాపం.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబీ రాధాకృష్ణన్ రిటైర్డ్ జస్టిస్ రామస్వామి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదాద్చారు. న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్రచౌహన్, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ సంజయ్‌కుమార్, జస్టిస్ కోదండరాం, జస్టిస్ అమర్నాథ్గౌడ్, సుప్రీంకోర్టు జస్టిస్ సయ్యద్ షా మహ్మద్ ఖాద్రీలు, రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ ఈశ్వరయ్య తదితరులు కూడా జస్టిస్ రామస్వామి భౌతికాయం వద్ద నివాళులర్పించారు. భీమవరం నుంచి ఢిల్లీ వరకు 1932 జూలై 13న జన్మించిన జస్టిస్ కె.రామస్వామి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం డబ్ల్యూజీబీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆంధ్రా లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1962 జూలై 9న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో మంచి నైపుణ్యం సాధించిన ఆయన 1972 నుంచి 1974 వరకు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. 1974లో హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది (జీపీ)గా విధులు నిర్వర్తించారు.1981–82 కాలంలో ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 1982 సెప్టెంబర్ 29న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2 నెలలకు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 1989 సెప్టెంబర్ నుంచి ఇంటర్నేషనల్ జూరిస్ట్స్ ఆర్గనైజేషన్ (ఆసియా) ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. 1989 అక్టోబర్ 6న పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1997 జూలై 12న పదవీ విరమణ చేశారు. 1998లో ఆయన జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు. 2012 వరకు ఆ పోస్టులో కొనసాగారు. -
గోపిచంద్ 'మహా ప్రస్థానం'
'లౌక్యం' సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన గోపిచంద్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. జిల్ సినిమాతో స్టైలిష్ హీరోగా మారిన ఈ మ్యాన్లీ స్టార్, ప్రస్తుతం ఎయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాతో మంచి సక్సెస్ సాధించిన రవికుమార్ చౌదరి గోపిచంద్ సినిమాతో మరో సక్సెస్ మీద కన్నేశాడు. రవికుమార్ చౌదరి సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాకు రెడీ అవుతున్నాడు గోపిచంద్. 'వెన్నెల', 'ప్రస్థానం' లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేవ కట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. 'ఆటోనగర్ సూర్య', 'డైనమైట్' లాంటి వరుస ఫెయిల్యూర్స్ తరువాత, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు దేవ కట్టా. తన కెరీర్‌ను మలుపు తిప్పిన 'ప్రస్థానం' సినిమా తరహాలో 'మహా ప్రస్థానం' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్థానానికి కొనసాగింపు కాకపోయినా దాదాపు అదే తరహా కథా కథనాలతో నడుస్తుందని చెపుతున్నాడు. మహా ప్రస్థానంలో గోపిచంద్ డాన్ తరహా పాత్రలో కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యే సక్సెస్ ట్రాక్ ఎక్కిన గోపిచంద్‌కు ఈ ప్రయోగం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.