మహాప్రస్థానం తరహాలో నిర్మాణం జరుపుకుని అర్ధంతరంగా ఆగిపోయిన నిర్మాణ పనులు
బంజారాహిల్స్: నగరంలో మరిన్ని శ్మశానవాటికలను ‘మహాప్రస్థానాలు’గా తయారు చేయాలని జీహెచ్‌ఎంసీ సంకల్పించి ఆ మేరకు కొన్ని శ్మశానవాటికలను గుర్తించింది. అందులో ఒకటి షేక్‌పేట మండలం, జీహెచ్‌ఎంసీ జూబ్లీహిల్స్ సర్కిల్–18 పరిధి కిందకు వచ్చే బంజారాహిల్స్ రోడ్ నెంబర్–1లో ఉన్న పంజాగుట్ట హిందూ శ్మశానవాటికను గుర్తించారు. 2008 సంవత్సరంలో అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంజాగుట్ట శ్మశానవాటిక అభివృద్ధి కోసం సకల సౌకర్యాలు కల్పించే నిమిత్తం రూ.కోటి మంజూరు చేశారు. ఇందులోనే విద్యుత్ దహనవాటిక నిర్మాణాన్ని కూడా ఇంకో రూ.కోటి వెచ్చించి నిర్మించారు. అయితే దురదృష్టవశాత్తు మహానేత మరణించడంతో శ్మశానవాటిక అభివృద్ధి పథకం మూలన పడింది. నిర్మించిన విద్యుత్ దహనవాటిక ఒక్కరోజు కూడా పనిచేయకుండానే ఉండిపోయింది. తరువాత విద్యుత్ దహన వాటిక శిథిలావస్తకు చేరి గోడలు కూలి, కిటికీలు చోరీకి గురై కొన్నాళ్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. ఇప్పుడది ఎందుకూ పనికిరాని బూత్ బంగ్లాగా మారిపోయింది. మళ్లీ ఈ ఫైల్‌ను తెరమీదకు తీసుకొచ్చేవారు కరువయ్యారు. ఫలితంగా కొన్నాళ్ల నుంచి శ్మశానవాటికలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు.
ముందుకొచ్చిన ఫినిక్స్..
2017లో మరోసారి పంజాగుట్ట శ్మశానవాటికపై జీహెచ్‌ఎంసీ అధికారులు దృష్టి పెట్టారు. ఫిలింనగర్‌లో నిర్మించిన మహా ప్రస్థానం తరహాలోనే ఈ శ్మశానవాటికలో కూడా మరో మహాప్రస్థానాన్ని నిర్మించేందుకు ఫినిక్స్ సంస్థ ముందుకొచ్చింది. జీహెచ్‌ఎంసీ అధికారులతో జరిగిన చర్చలు ఫలవంతం కాగా ఫినిక్స్ ఇక్కడ రూ.కోటి వ్యయంతో మహాప్రస్థానం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. శ్మశానవాటిక చుట్టూ ప్రహారీ ఒకేఒక గేటును ఏర్పాటు చేసి రాకపోకలకు అనుమతిచ్చే విధంగా సంస్థ ప్రారంభించిన చర్యలు మొదట్లోనే బెడిసికొట్టాయి. పునాదులు తీస్తుండగానే వివాదాలు చుట్టుముట్టాయి. ఇక మహాప్రస్థానం డిజైన్లను రూపొందించి ఓ రోజు ప్రదర్శించారు. అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పనులు కూడా ప్రారంభించారు. సరిగ్గా నాలుగు నెలలు పనులు జరిగాయో లేదో జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి సహకారం కరువైంది. కొన్ని నిర్మాణాలకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఎన్‌ఓసీలు కూడా లభించలేదు. ఫినిక్స్ సంస్థ నిర్వాహకులకు అడుగడుగునా చుక్కెదురైంది. దీనికి తోడు కొంతమంది ఈ నిర్మాణాలకు అడ్డుపుల్లలు వేశారు. ఆందోళనలూ కొనసాగించారు. అరికట్టాల్సిన జీహెచ్‌ఎంసీ అధికారులు చోద్యం చూశారు. ఫలితంగా ఫినిక్స్ సంస్థ అర్ధాంతరంగా పనులు ఆపేసి చేతులెత్తేసింది. సుమారు రూ.40 లక్షల మేర ఖర్చు పెట్టారు. ఇంకో రెండు నెలల పాటు పనులు జరిగి ఉంటే పంజాగుట్ట శ్మశానవాటిక కాస్తా మహాప్రస్థానం తరహాలోనే రూపుదిద్దుకొని ఉండేది.
అడుగడుగునా నిర్లక్ష్యం..
అధికారుల నిర్లక్ష్యమే పంజాగుట్ట శ్మశానవాటికకు శాపంగా మారిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఒకవైపు శ్మశానవాటికలో ఫినిక్స్‌సంస్థ నిర్మాణ పనులు జరుపుతుంటే ఒక్కసారి కూడా జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం పర్యవేక్షించిన పాపాన పోలేదు. ఈ సంస్థకు అవసరమయ్యే అనుమతులు కూడా ఇవ్వలేని దుస్థితి దాపురించింది. అడ్డుకునేవారిని పిలిచి మాట్లాడాల్సిన అధికారులు ఆ దిశలో ఎలాంటి చొరవ చూపలేదు. నగరంలో మరిన్ని మహాప్రస్థానాలు నిర్మిస్తామని చెప్పిన ఫినిక్స్ సంస్థ ఇప్పుడు ఆ ఆలోచననే విరమించుకునే స్థాయికి అధికారులు తీసుకొచ్చారు.
ఆదినుంచీ అడ్డంకులే..
పంజాగుట్ట హిందూ శ్మశానవాటికను అభివృద్ధి చేయాలని ఎప్పుడు ప్రణాళికలు రూపొందించినా అవి విఫలమవుతూనే ఉన్నాయి. వైఎస్‌ఆర్ ఉంటే ఈ శ్మశానవాటిక అన్ని హంగులతో రూపుదిద్దుకొని ఉండేది. దురదృష్టవశాత్తు ఆయన మరణం కూడా ఈ శ్మశానవాటికకు శాపమైంది. ఆయన తర్వాత వచ్చిన పాలకులు ఈ ఫైల్‌ను పట్టించుకోలేదు. కనీసం తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఫినిక్స్ అనే సంస్థ అభివృద్ధికి ముందుకు వచ్చినా పాలకులు అంతగా ప్రోత్సహించలేదు. మరోసారి అర్ధాంతరపనులు అధికార యంత్రాంగ నిర్లక్ష్యానికి నిలువెత్తు దర్పణంగా నిలుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment