పాన్ ఇండియా రేంజ్‌లో రవి బస్రూర్ పేరు కేజీఎఫ్ చిత్రంతో వెలుగులోకి వచ్చింది. తాజాగా ప్రభాస్ 'సలార్' సినిమాతో మళ్లీ దేశవ్యాప్తంగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్' సినిమా బాలీవుడ్‌లో కూడా సూపర్ హిట్‌తో దూసుకుపోతుంది. ఇందులో రవి బస్రూర్ సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు మాత్రమే కాదు, మాస్ సినిమాలకు అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని కూడా ఆయన అందించారు. బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా తమ సినిమాల కోసం రవి బస్రూర్ హంటింగ్ బీజీఎమ్ కోసం తహతహలాడుతున్నారు.
ఆకలితో జీవనం.. రవి బస్రూర్ నేపథ్యం
రవి బస్రూర్ తండ్రి గ్రామంలో కొలిమి నడుపుతున్నాడు. రవి కూడా తండ్రి దగ్గర కొలిమి పని చేస్తూ ఉండేవాడు. కానీ సంగీత రంగంలో ఏదైనా సాధించాలనే అచంచలమైన సంకల్పం అప్పటికే అతనిలో ఉండేది. కానీ ఆర్థిక స్థోమత అడ్డొచ్చి చాలా రోజుల పాటు తండ్రి వద్దే పని చేస్తూ ఉండేవాడు. ప్రస్తుతం గొప్ప సంగీత దర్శకుడిగా అయిన తర్వాత తాజాగా కన్నడ సరిగమప సీజన్ 10కి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు.ఆ సమయంలో తన జీవితంలో జరిగిన ఆసక్తికరమైన సంఘటనను వెల్లడించాడు.
సరిగమప షోలో రవి బస్రూర్ తన జీవితాన్ని మార్చేసిన సంఘటనను వివరించాడు. 'సంగీత ప్రపంచంలో తానేంటో నిరూపించుకోవాలని ఇంటి నుంచి వచ్చేశాను. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు.. అప్పటికే మూడు నాలుగు రోజులు భోజనం చేయలేదు.. నీళ్లు తాగుతూనే గడిపేశాను... కానీ నా జేబులో ఒక లిస్ట్ ఉంది.. ఏ రోజు ఏ గుడిలో ఎలాంటి ప్రసాదం ఇస్తారో రాసి పెట్టుకున్నాను. ఆ సమయంలో నేను సమయానికి వెళ్ళలేదు, నాకు ప్రసాదం లభించదు.' అని ఆ రోజు సంఘటనను గుర్తుచేసుకున్నాడు.
'దేవుడా, నా పరిస్థితి ఏమిటి..? అని నా మదిలో చాలా ప్రశ్నలే మొదలయ్యాయి. అప్పుడు ఒక పెద్దాయన నన్ను చూశాడు. అతని పేరు కామత్. నన్ను బెంగళూరులోని ఎవెన్యూ రోడ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ నన్ను ఒక దుకాణానికి తీసుకెళ్లి ఇతను ఇత్తడి, బంగారు వస్తువుల తయారి వంటి అన్ని పనులు చేస్తాడని యజమానికి పరిచయం చేశాడు .కానీ ఇతనికి సంగీతం అంటే పిచ్చి. ఎప్పుడూ చూడే అదే పనిలో ఉంటాడని తెలిపాడు. పనిలో పెట్టుకోమని కామత్ చెప్పడం.. వెంటనే అతను ఓకే చేయడం జరిగిపోయాయి.
అతను ముందే చెప్పాడు.. నేను ఈ రేంజ్‌లో ఉంటానని
కానీ నేను ఎలాంటి పని చేయనని చెప్పాను.. అప్పుడు అక్కడ ఉన్న యజమాని నాకు రూ. 5 ఇచ్చి ఏదైనా తిని రమ్మన్నాడు. అప్పుడు నన్ను చూసి మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావని చెప్పాడు. భవిష్యత్‌లో అతన్ని చూడటానికి 5 నెలలు అపాయింట్‌మెంట్ కావాలి. అంతలా అతని రేంజ్ పెరిగిపోతుందని చెప్పాడు. కానీ ఆయన మాటలు నాకు నమ్మకంగా లేవు.. ఇలా చెప్పేవాళ్ళు చాలా మందిని చూస్తున్నాను. నాకు సంగీతం మాత్రమే కావాలని చెప్పాను. అప్పుడు ఆ వ్యక్తి మీకు ఏమి కావాలి అని అడిగాడు, నాకు కీబోర్డ్ కావాలి, నాకు డబ్బు ఇస్తావా అని చెప్పాను, అతను ఎంత కావాలి అని అడిగాడు. నేను. 35 వేలు అన్నాను.
క్షణం ఆలోచించకుండా వెంటనే ఇచ్చాడు.. ఆయనెవరో నాకు తెలియదు.. ఆ సమయంలో నేను, కామత్ ఇద్దరం షాక్ అయ్యాము. ఈ డబ్బు తిరిగివ్వకు. కీబోర్డ్ తీసుకో.ఈ 35వేలకు పని ఇస్తాను, పని చేసి చెల్లించు అని చెప్పాడు. ఆ సాయం చేసిన వ్యక్తి పేరు రవి. అప్పటి నుంచి నా పేరు తొలగించి అతని పేరును నా ఊరు పేరుతో పాటు ఉంచాను. అలా రవి బస్రూర్ వెలుగులోకి వచ్చింది. నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అతనే.. అతనికి క్రెడిట్ ఇవ్వడానికే నా పేరును మార్చుకున్నాను. నా అసలు పేరు కిరణ్.. కానీ రవి బస్రూర్ అని పిలుస్తేనే నాకు సంతోషం.' అని ఆయన చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment