హమాస్ తీవ్రవాదుల దాడితో ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య భీకర యుద్ధ జరుగుతోంది. ఇప్పటికే వందలమందిని బందీలుగా పట్టుకున్న ఇజ్రాయెల్ పౌరులను హమాస్ తీవ్రవాదులు అత్యంత దారుణంగా హతమారుస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి షేర్ చేసిన వీడియో కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ దాడుల్లో తన కజిన్ సోదరి, బావను అత్యంత దారుణంగా చంపేశారని మధురా నాయక్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది.
వారి పిల్లల కళ్లముందే భార్య, భర్తను హతమార్చారని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సంచలనంగా మారింది. అంతే కాకుండా ఇజ్రాయెల్‌లో మహిళలు, పిల్లలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని పట్టపగలే దారుణంగా హత్యలు చేస్తున్నారని మధుర వాపోయింది.
మధుర మాట్లాడుతూ..' నా సోదరి, ఆమె భర్తను పాలస్తీనా ఉగ్రవాదులు వారి పిల్లల ముందే దారుణంగా హత్య చేశారు. ఈరోజు శవమై కనిపించారు. ఉగ్రదాడిలో మా బంధువును కోల్పోయినందుకు చాలా బాధపడ్డా. వారి ఆప్యాయత, దయ, ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మా ప్రార్థనలు బాధితులందరికీ అండగా ఉంటాయి. ఓం శాంతి. ఈ కష్టకాలంలో దయచేసి ఇజ్రాయెల్ ప్రజలకు అండగా నిలవండి. ఉగ్రవాదుల అరాచకాలు ఎంత అమానవీయంగా ఉంటాయో ప్రజలు ప్రత్యక్షంగా చూసే సమయం ఇదే,' అని తెలిపింది.
తాను ఎలాంటి హింసను సమర్థించనని.. ఇజ్రాయెల్‌లోని ప్రజల కోసం, బాధిత కుటుంబాల కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ఆమె కోరారు. కాగా.. మధుర నాగిన్, కసౌతి జిందగీ కే, ఉత్తరన్, ప్యార్ కీ యే ఏక్ కహానీ, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్ అనే సీరియల్స్‌లో నటించింది.
Comments
Please login to add a commentAdd a comment